LA Shooting Incident: నడి వీధిలో కత్తితో విన్యాసం.. అమెరికా పోలీసుల కాల్పుల్లో సిక్కు వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:06 AM
అమెరికాలో నడి వీధిలో కత్తితో గట్కా ప్రదర్శన చేస్తున్న ఓ సిక్కు మతస్థుడిని లాస్ ఏంజెలెస్ పోలీసులు కాల్చి చంపారు. ప్రస్తుతం ఇది అమెరికాలో సంచలనం రేకెత్తిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్‌ప్రీత్ సింగ్ (36) అనే వ్యక్తిపై లాస్ ఏంజెలెస్ పోలీసులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. అతడు నడి వీధిలో నిలబడి కత్తితో సంప్రదాయక యుద్ధ కళ గట్కాను ప్రదర్శిస్తున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. జులై 13న ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
డౌన్‌టౌన్ ప్రాంతంలో కత్తితో గుర్‌ప్రీత్ హల్‌చల్ చేశాడని లాస్‌ఏంజెలెస్ పోలీసులు తెలిపారు. తమ ఆదేశాలను ఖాతరు చేయకుండా దాడి చేసేందుకు గుర్‌ప్రీత్ ప్రయత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. నడి వీధిలో కత్తి ఝళిపిస్తూ ఓ వ్యక్తి హంగామా చేస్తున్నాడన్న సమాచారంతో అక్కడకు వెళ్లామని అన్నారు. అక్కడున్న పాదచారులవైపు చూపిస్తూ గుర్‌ప్రీత్ కత్తి ఝళిపించాడని అన్నారు. తన కారును పక్కనే వదిలిపెట్టి అతడు ఈ విన్యాసానికి దిగాడని, ఓ సందర్భంలో తన నాలుకను తానే నరుక్కునే ప్రయత్నం చేశాడని అన్నారు. కత్తిని కింద పడేయాలని పలుమార్లు హెచ్చరించినా అతడు వినలేదని తెలిపారు.
కొందరు పోలీసులు అతడిని సమీపించేందుకు ప్రయత్నించగా ఓ బాటిల్‌ను వారిపై విసిరాడని తెలిపారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని అన్నారు. పోలీసులు వెంబడిస్తుండగా అతడు కారును ఇష్టారీతిన తోలి అక్కడున్న ఓ పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడని చెప్పారు. ఆ తరువాత కత్తితో వారిపై ఎగబడ్డ సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుందని అన్నారు. కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా, బుల్లెట్ గాయాలయైన గుర్‌ప్రీత్‌ను ఆసుపత్రికి తరలించగా అతడు కన్నుమూసినట్టు తెలిపారు. ఈ ఘటనలో సామాన్య పౌరులు, పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
బాలభారతి పాఠశాల విద్యార్థులకు 10 లక్షల విరాళం