Vanabhojanalu: జెడ్డాలో వనభోజనాలకు సన్నాహాలు.. ‘సాటా’ ప్రకటన
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:24 PM
జెడ్డాలో వనభోజనాలకు సన్నాహాలు చేస్తున్నామని ప్రవాసీ సంఘం సాటా పేర్కొంది. ఇందులో భాగంగా ప్రవాసీయుల కుటుంబాలలోని క్రీడా, సాంస్కృతిక, ఇతర కళలలోని ప్రతిభను గుర్తించి ప్రొత్సహించే విధంగా వివిధ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీకి వాణిజ్య రాజధానిగా భావించే ఎర్ర సముద్ర తీరంలోని జెడ్డా నగరంలో ఉభయ తెలుగు రాష్ట్రాల గ్రామీణ ప్రాంత ప్రవాసీయుల జనాభా దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే అంతంత మాత్రమే. పరిమిత సంఖ్యలో ఉన్న తెలుగు ప్రవాసీయులు కూడా చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నారు.
నలుగురు కలిస్తే ఆనందం పెరుగుతుంది. అందునా పండుగలు లేదా సహంపక్తి భోజనాలు మొదలగు కార్యక్రమాలు తెలుగువారిలో ఆప్యాయత, పరస్పర ఆదరాభిమానాలు పెరగడానికి ఒక వారధిగా పని చేస్తాయి. ఈ క్రమంలో కార్తీక మాసంలో ముఖ్య ఘట్టమైన సహంపక్తి భోజనాలతో ప్రవాసీ తెలుగు కుటుంబాలను మరింత సన్నిహితం చేయడానికి స్థానిక తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.
జెడ్డా, పరిసర ప్రాంతాలలోని తెలుగు ప్రవాసీయులలో ఆప్యాయతకు తోడుగా ఆధ్యాత్మిక చింతన, సాంస్కృతిక చైతన్యం తీసుకొచ్చే దిశగా తాము వచ్చే వారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా సాటా(యం) అధ్యక్షుడు మల్లేషన్ వెల్లడించారు. ప్రవాసీయుల కుటుంబాలలోని క్రీడా, సాంస్కృతిక, ఇతర కళలలోని ప్రతిభను గుర్తించి ప్రొత్సహించే విధంగా వివిధ కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
జెడ్డా పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రవాసీయులు వన భోజనాలు, ఇతర తెలుగు కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారం కోసం 0597384449 నెంబర్‌పై సంప్రదించవచ్చని మల్లేశన్ సూచించారు.
ఇవీ చదవండి
యూఏఈలో ‘తెలుగు తరంగిణి’ కార్తీక వనభోజనాలు
పాకిస్థానీలకు 59 రోజుల్లో కెనడా వీసా దరఖాస్తు ప్రాసెసింగ్.. భారతీయులకు మాత్రం..