Share News

SATA Central: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సౌదీ తెలుగు ప్రవాసీ ప్రముఖులు

ABN , Publish Date - Aug 13 , 2025 | 09:41 AM

రాజధాని రియాధ్ కేంద్రంగా కీలకంగా వ్యవహారించే సాటా సెంట్రల్ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడును అమరావతిలోని సచివాలయంలో కలిశారు. సాటి తెలుగు వారి కోసం సాటా సెంట్రల్ చేస్తున్న సేవలను వివరించారు. టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వైనాన్ని సీఎంకు చెప్పారు.

SATA Central: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సౌదీ తెలుగు ప్రవాసీ ప్రముఖులు
Saudi Telugu NRIs Meeting With AP CM

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా సంఘాల పరంగా తక్కువగా ఉన్న కారణంగా సుదీర్ఘ కాలం పాటు నిమిత్తమాత్రంగా ఉన్న సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ లోకం ఒక్కసారిగా క్రియాశీలకమై సౌదీలోనే కాకుండా అన్ని గల్ఫ్ దేశాలలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఒక వైపు సాంస్కృతిక వైభవం మరో వైపు కష్టాలలో ఉన్న తోటి తెలుగువారికి తామున్నామంటూ ఆపన్న హస్తం అందించి మానవ సేవయే మాధవ సేవ అంటూ ముందుకు కదులుతున్న ఖ్యాతి తెలుగు ప్రవాసీ సంఘాలైన సాటా, సాటా సెంట్రల్‌లకు దక్కుతుంది. ఇక రాజకీయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు అన్ని పార్టీలకు చెందిన అభిమానులు ఈ సంఘాలలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు.

2.jpg

రాజధాని రియాధ్ కేంద్రంగా కీలకంగా వ్యవహారించే సాటా సెంట్రల్ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి యన్.చంద్రబాబు నాయుడును అమరావతిలోని సచివాలయంలో కలిశారు. సాటా సెంట్రల్ కీలక నాయకుడు, ఒంగోలు నగరానికి చెందిన ముజ్జమ్మీల్ షేఖ్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గడ్డం శిల్పలు సీఎం చంద్రబాబును కలిసి సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల గురించి వివరించారు. సువిశాల ఎడారి దేశంలో తెలుగు వారికి రేయింబవళ్లు ఒక ఆశాకిరణంలా సాటా సెంట్రల్ పని చేస్తోందని ముఖ్యమంత్రికి వివరించానని ముజ్జమ్మీల్ షేఖ్ పేర్కొన్నారు. భారతీయ ఎంబసీ, సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారుల సహకారంతో ప్రవాసాంధ్రులకు చేస్తున్న సహాయం గురించి వివరిస్తూ అమరావతిలోని ఏపీ ఎన్నార్టీ సంస్థతో తాము చేస్తున్న సమన్వయం గురించి కూడా వివరించారు. ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవి, తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ అందిస్తున్న సహాయ సహకారాల గురించి వీరు ప్రత్యేకంగా ప్రస్తావించారు.


తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను శిల్ప సీఎంకు వివరించారు. సౌదీతో సహా గల్ఫ్ దేశాలలో పార్టీ బలోపేతానికి మహిళల సహాయం అవసరమనే విషయాన్ని చెప్పినట్లు ఆమె వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం తనను కలిసిన శిల్పను గుర్తు పట్టిన ముఖ్యమంత్రి ఆమెను ప్రత్యేకంగా అభినందించగా సౌదీ అరేబియా పర్యటనకు రావాల్సిందిగా ఆమె ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. పార్టీ పునాదులను నిర్మించడానికి, తెలుగు జాతి గౌరవాన్ని పెంపొందించడానికి ప్రవాసీ మహిళలు కూడా శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా ఆమెకు ఉద్బోధించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఫ్రిస్కో హనుమాన్ ఆలయంలో కొలువైన శ్రీవారు

ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

Read Latest and NRI News

Updated Date - Aug 13 , 2025 | 10:22 AM