Share News

Outreach Qatar: భారతీయ దివ్యాంగులకు చేరువలో ఔట్‌రీచ్ ఖతర్

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:28 PM

దివ్యాంగులైన భారతీయ చిన్నారులకు ఔట్‌రీచ్ ఖతర్ సంస్థ అండగా నిలుస్తోంది. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా సంతోషం వెల్లివిరిసేలా చేస్తోంది.

Outreach Qatar: భారతీయ దివ్యాంగులకు చేరువలో ఔట్‌రీచ్ ఖతర్
Outreach Qatar

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఆ చిన్నారులు ఒక్కొక్కరు ఒక్కో మానసిక స్థితిలో ఉన్నారు. కొందరికి మాటలు రావు, కొందరికి చూపు లేదు, మరికొందరు నడవలేరు. ఇంకొందరు చేతులు, కాళ్ళు కూడా పని చేయని స్థితిలో ఉన్నారు. వీరంతా కూడా దివ్యాంగులు. పిల్లలు మానసిక వైకల్యంతో జన్మిస్తే వారి తల్లిదండ్రులు అనుభవించే బాధ వర్ణనాతీతం. అందులో పరాయి దేశంలో పరాయి గడ్డపై బతుకడానికి వచ్చిన చోట తల్లిదండ్రులు ఎనలేని వ్యధను అనుభవిస్తుంటారు. ఇలా నిస్సహాయ స్థితిలో నిట్టూర్పుతో ఉండే తల్లిదండ్రులకు మనోస్థైర్యం ఇవ్వడంతో పాటు చిన్నారుల్లో చిరు సంతోషంతో పాటు పరిపక్వత నింపడానికి గల్ఫ్ దేశాలలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పని చేస్తుండగా అందులో ఖతర్‌లోని ఔట్‌రీచ్ ఖతర్ ఒకటి (Outreach Qatar).

మాతృభూమి భారతావనిలో దివ్యాంగులు ఎక్కువగా ప్రభుత్వం, దాతల ఆర్థిక సహాయంపై ఆధారపడుతుండగా ఖతర్, ఇతర గల్ఫ్ దేశాలలో మాత్రం ఆర్థిక చేయూత కంటే మనోస్థైర్యం అవసరం. ఖతర్‌లోని భారతీయ ఎంబసీ సౌజన్యం, స్థానిక ప్రవాసీయుల సహకారంతో గత రెండేళ్ల నుండి నడుస్తున్న ఔట్‌రీచ్.. దేశంలోని భారతీయ ప్రవాసీ దివ్యాంగులైన చిన్నారుల్లో జన్మతః ఉన్న సహజ సామర్థ్యాలను వయస్సుతో పాటు క్రమంగా వికసించే పరిణితి గురించి తల్లిదండ్రులలో అవగాహన కల్పించడానికి, పిల్లలలో మానసిక పరిపక్వత తీసుకొచ్చేందుకు ఔట్‌రీచ్ ఖతర్ కృషి చేస్తోంది.

5.jpg


ఔట్‌రీచ్ ఖతర్‌లో ప్రస్తుతం 80 మంది దివ్యాంగులైన చిన్నారులు ఉన్నారని ఇటీవల సంస్థ అధ్యక్షునిగా ఎన్నికయిన కృష్ణకుమార్ తెలిపారు. ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయులకు కె.కె, పెద్ద మనిషిగా గుర్తింపు పొందిన ఆయన పలు సామాజిక, సాంస్కృతిక సంఘాలలో క్రియాశీలకంగా ఉన్నారు. ఔట్‌రీచ్ ఖతర్ ఆవిర్భావం నుండి అందులో కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఆయన ఇటీవల దానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

దివ్యాంగుల వయస్సు ఆధారంగా విజ్ఞానాభ్యాసం చేయించడానికి తాము కృషి చేస్తున్నట్లుగా కృష్ణకుమార్ తెలిపారు. విద్య, విజ్ఞానంతో పాటు వారిలో దేహదారుఢ్యాన్ని పెంపొందించే దిశగా క్రీడలలో కూడా ఆసక్తి కల్పించే దిశగా తాము పని చేస్తున్నామని పేర్కన్నారు.

దివ్యాంగులతో పాటు వారి తల్లిదండ్రులకు మనోస్థైర్యం కల్పిస్తూ తమ పిల్లలను ఏ రకంగా పోషించుకోవాలో తెలియజేయడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లుగా కృష్ణకుమార్ వెల్లడించారు.

4.jpg


బాలల దినోత్సవమైన 14 నవంబర్‌తో పాటు వివిధ సందర్భాలలో ఔట్‌రీచ్ ఖతర్ నిర్వహించే కార్యక్రమాలలో దివ్యాంగులైన చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనే విధానాన్ని చూస్తే వారి ఆత్మవిశ్వాసంపై అందరికి సంతృప్తి కలుగుతుందని, ఇది నిత్యం పెంపొందించే దిశగా తాము పని చేస్తామని ఆయన చెప్పారు.

అధ్యక్షుడిగా కృష్ణకుమార్‌తో పాటు ఉపాధ్యక్షునిగా సమీర్ మూసా, ప్రధాన కార్యదర్శిగా సంతోష్ పిళ్ళై, సంయుక్త కార్యదర్శులుగా లక్ష్మి చొక్కాలింగం, నవీన ప్రియ ఎన్నికయ్యారు. గతంలో అధ్యక్షునిగా పని చేసిన అవినాష్ గైక్వాడ్‌ను సలహా మండలి అధ్యక్షునిగా నూతన కార్యవర్గం నియమించింది.

నూతన పాలకవర్గం ఇటీవల బాధ్యతలు స్వీకరించగా, ఈ కార్యక్రమంలో భారతీయ ఎంబసీ ప్రథమ కార్యదర్శి వైభవ్ తాండ్లే, ప్రవాసీ భారతీయ ప్రముఖులు పాల్గొన్నారు.

3.jpg2.jpg

ఈ వార్తలు కూడా చదవండి

సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం

సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ

Read Latest and NRI News

Updated Date - Dec 22 , 2025 | 07:04 AM