Share News

NATS: టాంపాలో నాట్స్ 8వ తెలుగు సంబరాలకు భారీ సన్నాహాలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 10:33 PM

త్వరలో జరగనున్న నాట్స్ 8వ తెలుగు సంబరాలకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్‌కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న గుత్తికొండ శ్రీనివాస్ సభ ఏర్పాట్ల గురించి వివరించారు.

NATS: టాంపాలో నాట్స్ 8వ తెలుగు సంబరాలకు భారీ సన్నాహాలు
NATS 8th Telugu convention

  • 16 ఏళ్ల తర్వాత ఫ్లోరిడాలో మళ్లీ నాట్స్ వేడుకలు

  • సందడి చేయనున్న ముగ్గురు అగ్రహీరోలు, ఇద్దరు సంగీత దర్శకులు

  • సినీ, రాజకీయ, వ్యాపార, సాహితీ, కళా, క్రీడా ప్రముఖుల కోలాహలం

  • తెలుగు సంఘాలు ఎక్కువ ఉంటేనే మంచిది. సేవాతత్పరతలో పోటీ తప్పనిసరిగా ఉండాలి.

  • బాలకృష్ణకు జీవితసాఫల్య పురస్కారం

  • 4 మిలియన్ డాలర్ల (₹35కోట్లు) నిర్వహణ నిధుల సేకరణ. అందులో సేవా కార్యక్రమాలకు 10శాతం కేటాయింపు.

  • నభూతో నభవిష్యతి రీతిలో 8వ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ

  • సభల సమన్వయకర్త, కృష్ణా జిల్లా ప్రవాసాంధ్రుడు గుత్తికొండ శ్రీనివాస్‌ వెల్లడి

2009లో ఏర్పాటు చేసిన ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) తన 8వ ద్వైవార్షిక సంబరాలను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జులై 4,5,6 తేదీల్లో జరుపుకునేందుకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తెలుగుదనం ఉట్టిపడేలా, తారల సందడి నడుమ, సమాజానికి కూడా మంచి చేయాలనే త్యాగనిరతి బాటలో ఈ వేడుకలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'ఇది మన తెలుగు సంబరం-కలిసి జరుపుకుందాం అందరం' నినాదంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన గుత్తికొండ శ్రీనివాస్ ఈ సభలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. నాట్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలనే దృఢసంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామన్న శ్రీనివాస్ ఈ వేడుకల గురించిన మరిన్ని విశేషాలు వెల్లడించారు.

టాంపా డౌన్‌టౌన్‌లోని టాంపా కన్వెన్షన్ సెంటరులో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు, ప్రవాసుల పరిస్థితి నడుమ ఇంతటి పెద్ద వేడుక జరపడం 'వసుధైక కుటుంబమ'నే నినాదాన్ని మరోసారి వినిపించాలనే లక్ష్యం కోసమని అన్నారు. ఈ సంవత్సరం సంబరాలను నిర్వహించడం ఒక గొప్ప సవాలుగా భావిస్తున్నామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో కూడా ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైన విషయమని గుర్తుచేశారు. ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను సైతం దృష్టిలో ఉంచుకుని $75లకే నాట్స్ టికెట్లను అందిస్తున్నామని తెలిపారు. తాను, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, తమ నిర్వాహక బృంద సభ్యులు అందరూ ఈ సభను విజయవంతం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు www.sambaralu.org చూడవల్సిందిగా కోరారు.


'నభూతో నభవిష్యతి' రీతిలో ముగ్గురు అగ్రహీరోలు - బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్‌లతో పాటు నటి శ్రీలీల ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలబడతారని గుత్తికొండ వెల్లడించారు. అమెరికాలో జాతీయ తెలుగు సంఘాల చరిత్రలో ఒక మహాసభకు ముగ్గురు అగ్రహీరోలు రావడం ఇదే ప్రప్రథమని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు రోజుల తెలుగు సంబరాల ప్రత్యేకతల గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ 4వ తేదీ సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో కార్యక్రమం మొదలవుతుందని, చంద్రబోస్ ఆధ్వర్యంలోని నాటు బ్యాండ్ ఈ విందులో అలరిస్తుందని తెలిపారు. 5వ తేదీ ఉదయం స్వాగత నృత్యాలు, సాయంత్రం పుష్ప చిత్రబృందం సందడి, దేవిశ్రీ సంగీత లాహిరి, 6వ తేదీ ఉదయం తితిదే వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, థమన్ సంగీత విభావరి, బాలయ్యకు జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవంతో పాటు రెండు రోజులు తెలుగు వైభవానికి అద్దంపట్టే పలు స్థానిక ప్రవాసుల ప్రదర్శనలు, చర్చావేదికలు, ఇష్టాగోష్టిలు ఈ వేడుకల్లో ఏర్పాటు చేశామన్నారు.

నాట్స్ మొదటి కన్వెన్షన్ 2009లో ఫ్లోరిడాలోని ఆరంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిందని గుర్తుచేసుకున్న ఆయన, డల్లాస్, లాస్ ఏంజెలెస్, చికాగో, న్యూజెర్సీ తదితర నగరాల్లో గత సంబరాలను నిర్వహించుకుని 16 సంవత్సరాల తరువాత మళ్లీ ఫ్లోరిడా రాష్ట్రానికి తిరిగి వస్తోందని అన్నారు. ఈ వేడుక సమన్వయకర్తగా వ్యవహరించే సదవకాశం ఇచ్చిన నాట్స్ కార్యవర్గానికి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ స్థాపన నుంచి సంస్థలో చురుకైన పాత్ర పోషించిన శ్రీనివాస్...హెల్ప్ లైన్ డైరెక్టర్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా, నాట్స్ బోర్డ్ ఛైర్మన్‌గా పనిచేశారు. నాట్స్‌లోని కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవాన్ని ఈ సంబరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వినియోగిస్తానని ఆయన పేర్కొన్నారు.


4 మిలియన్ డాలర్ల నిర్వహణ నిధులను సేకరించే బృహత్తర కార్యం కూడా తమ ముందు ఉందన్న శ్రీనివాస్...ఈ నిధుల్లో నుండి 10శాతం ($400కే) అమెరికా, ఇండియాల్లో సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని తెలిపారు. ఒకప్పుడు వేలల్లో ఉండే తెలుగువారి సంఖ్య నేడు 10 లక్షలు దాటిందని, వారందరి అవసరాలకు తగినట్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలంటే ఎన్ని ఎక్కువ సంఘాలు ఉంటే అంత మంచిదనే అభిప్రాయాన్ని వెల్లడించారు. సేవాతత్పరలో పోటీ ఆరోగ్యకరమైన అంశమని అన్నారు. ప్రవాసులందరూ పెద్ద సంఖ్యలో కదిలి వచ్చి తెలుగువారి చారిత్రాత్మక, సాంస్కృతిక వైభవ ప్రతీకగా నిలబడనున్న ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయవల్సిందిగా కోరారు.

2.jpg3.jpg1.jpg

ఇవీ చదవండి:

అట్లాంటాలో తానా పికిల్‌ బాల్‌ టోర్నమెంట్‌ విజయవంతం

ఆసుపత్రిలో ఒంటరైన రోగికి ఆపన్నహస్తం.. సౌదీలో మానవత్వం చాటుకున్న తెలుగు మహిళ

Read Latest and NRI News

Updated Date - Jul 02 , 2025 | 11:21 AM