Nataraja Natyanjali: నటరాజ నాట్యాంజలి అకాడమీ ఆధ్వర్యంలో కమ్మింగ్ నగరంలో చెంచు లక్ష్మి నృత్య నాటిక ప్రదర్శన
ABN , Publish Date - Oct 23 , 2025 | 09:22 PM
నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్‌లో నిర్వహించిన చెంచు లక్ష్మి నృత్య నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్‌లో నిర్వహించిన చెంచు లక్ష్మి నృత్య నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. ఈ సందర్భంగా సేకరించిన నిధులను కార్యక్రమ నిర్వాహకులు ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌కు (FCEF) అందజేశారు. ఈ కార్యక్రమాన్ని హర్షిణి చుండి, శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను మాలతి నాగభైరవ వివరించారు. కళ మనసును మేల్కొలుపుతుందని, విద్య భవిష్యత్తును వెలిగిస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమం పలువురు ప్రముఖులను సమాజసేవ లక్ష్యంగా ఒక్కతాటిపైకి తెచ్చింది. రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (డిస్ట్రిక్ట్ 25), కార్టర్ బారెట్ (డిస్ట్రిక్ట్ 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్), మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్) తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. నరసింహ స్వామి, లక్ష్మీ దేవి స్వరూపుణి చెంచు లక్ష్మి మధ్య అరణ్యాల గుండెల్లో పుట్టిన ఆధ్యాత్మిక ప్రేమగాథను నృత్య నాటిక రూపంలో ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి. పలువురు ప్రముఖులను సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలతో నిర్వాహకులు సన్మానించారు. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి.

ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీరామ్ రొయ్యాల మాట్లాడుతూ సంస్కృతి మనసులను కలుపుతుందని అన్నారు. కళ ద్వారా సమాజ సేవ చేయగలగడం గొప్ప విషయమని చెప్పారు. డిస్ట్రిక్ట్ 25 ప్రతినిధి టాడ్ జోన్స్ మాట్లాడుతూ వైవిధ్యంలో ఏకత్వానికి ఇలాంటి కార్యక్రమాలే దానికి సజీవ నిదర్శనమని అన్నారు. కళ మనసుకు భాష అని, విద్య మనసుకు కాంతి అని వ్యాఖ్యానించారు. ఈ రెండూ కలిసినప్పుడు సమాజం వెలిగిపోతుందని చెప్పారు.




ఇవీ చదవండి..
చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం
వార్సాలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!