Indian Diaspora-Tariffs: ఎన్నారైలు భారత్‌ను నిరాశపరిచారు.. ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉన్నతాధికారి కామెంట్
ABN , Publish Date - Aug 28 , 2025 | 01:23 PM
అమెరికాలోని ఎన్నారైలు భారత్ తరపున అగ్రరాజ్యంలో తమ గొంతు వినిపించడంలో విఫలమయ్యారని ఎయిర్‌ఫోర్డ్ రిటైర్డ్ అధికారి ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో అమెరికాలోని ఎన్నారైలు తమ మాతృదేశానికి మద్దతుగా నిలవడంలో విఫలమయ్యారంటూ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఉన్నతాధికారి సంజీవ్ కపూర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సంజీవ్ కపూర్ గతంలో ఇన్‌స్పెక్షన్స్ అండ్ ఫ్లైట్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య నెలకొన్ని పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేశారు.
ట్రంప్ సుంకాల విషయంలో అమెరికాలోని ఎన్నారైలు మౌనం వహించడాన్ని ఆయన ఆక్షేపించారు. భారత అభివృద్ధి అంశం కేవలం చర్చలకే పరిమితమైనది గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో టాప్ డాక్టర్లు, సైంటిస్టులు, సీఈఓలు, అత్యధిక పన్ను చెల్లించేవారిగా ఉన్న ఎన్నారైలు సిలికాన్ వ్యాలీలో, అమెరికా రాజకీయాల్లో రాణిస్తున్నారని తెలిపారు.
అధికార రిపబ్లికన్ పార్టీలో వారి మాటకు ఎంతో కొంత చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందని అన్నారు. అయినా వారెవరూ మాతృదేశానికి మద్దతుగా నిలవలేదని అన్నారు. ప్రపంచంలో భారత అనుకూల అభిప్రాయాల ఏర్పడేలా చేయడంలో వారు విఫలమయ్యారని అన్నారు. మౌనం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా మీడియాలో భారత వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా వీటిని తిప్పి కొట్టే గొంతుకలే వినిపించట్లేదని అన్నారు. భారత్‌ను ఎన్నారైలు నిరాశపరిచారని వ్యాఖ్యానించారు.
అమెరికా ఎంత ఒత్తిడి చేస్తున్నా భారత్ తట్టుకుని నిలబడుతోందని చెప్పారు. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే బాగా పడిపోయిందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెన్సన్ అన్న మాటలను కూడా కపూర్ ప్రస్తావించారు. అయితే, అమెరికాకు మండుకొచ్చేలా భారతీయ కరెన్సీ తిరిగి కోలుకుంటుందని అన్నారు.
ఇక ఈ పోస్టుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సంజయ్ కపూర్‌కు ఎన్నారైలపై అవాస్తవ అంచనాలు ఉన్నాయని అనేక మంది కామెంట్ చేశారు. అక్కడి ఎన్నారైలకు అనేక పరిమితులు ఉన్నాయని, అమెరికా రాజకీయాల్లో వారి పాత్ర పరిమితమని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
న్యూయార్క్ రోడ్డు ప్రమాదం.. మృతుల్లో భారతీయుడు ఉన్నట్టు పోలీసుల వెల్లడి
ఓపీటీని ట్రంప్ టార్గెట్ చేయనున్నారా.. విదేశీ విద్యార్థులకు చుక్కలే..