Dasara Celebrations in Saudi: సౌదీలోని దమ్మాంలో దసరా ధూంధాం
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:04 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారందరు కలిసికట్టుగా దమ్మాం ప్రాంతంలో తెలుగు ప్రవాసీ సంఘం సాటా (యం) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దసరా – బతుకమ్మ ఉత్సవాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: నవ రాత్రులలో దుర్గాదేవిని శక్తి స్వరూపంగా భావించి పూజలు చేసిన అనంతరం జరుపుకునే దసరా, పూలను గౌరమ్మ దేవతగా కొలిచే బతుకమ్మ పండుగలను ఎక్కడో ఎడారి అరేబియాలోని ప్రవాసీ తెలుగు కుటుంబాలు కలిసి ఆనందమయంగా జరుపుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారందరూ కలిసి దమ్మాం ప్రాంతంలో తెలుగు ప్రవాసీ సంఘం సాటా (యం) ఆధ్వర్యంలో శుక్రవారం దసరా – బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మికతతో పరవశించిపోయారు. దినమంతా జరిగిన ఉత్సవం పండుగకు నిజమైన నిర్వచనంగా నిలిచింది.
సాటా (యం) దమ్మాంలోని ప్రఖ్యాత తెలుగు ప్రవాసీ సంఘం. సంక్రాంతి, దసరా, బతుకమ్మ పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ప్రసిద్ధి గాంచింది. ఈసారి దసరా సంబురాలకు తాము ఊహించిన దానికంటే ఎక్కువగా జనాలు పాల్గొన్నట్లుగా సాటా(యం) అధ్యక్షుడు పల్లెం తేజ వెల్లడించారు. సాటా (యం) అనేది కులమతాలకు అతీతంగా ప్రతి తెలుగు ప్రవాసీని అనుసంధానం చేసే వ్యవస్థగా తీర్చిదిద్దారని వ్యవస్థాపకుడు మల్లేశం అన్నారు.
నవదుర్గల సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు బతుకమ్మ పూలు, అమ్మ వారి అలంకరణతో పండుగ ఉత్సవం పరవళ్ళు తొక్కింది. అన్నీ తానై జయశ్రీ ఓం ప్రకాశ్ కార్యక్రమాన్ని సమన్వయం చేయగా అతనికి విజయకిశోర్, లీలలు అండగా నిలిచారు. అమ్మవారి అలంకరణలో శశి జగన్ అంకితభావాన్ని అందరు అభినందించారు. శ్రావణ్, మల్లేశ్ జవ్వాజి, మోహన్, విశాల్‌లు వివిధ ఏర్పాట్లను పరిశీలించారు.

దసరా నాడు దుర్గాదేవి విజయానికి సూచికగా మిఠాయిలకు తోడు బతుకమ్మల గౌరమ్మకు నైవేద్యంగా పిండి వంటలను కూడా తెలుగు మహిళలు వడ్డించారు. వర్షిత తయారు చేసిన లడ్డూలు తిరుమల వెంకన్న లడ్డూలను మరిపించాయి. హారిత, జస్మిత, లలిత, సంధ్య సురేశ్, కనక లక్ష్మి, కవిత, విజయలు చేసిన లడ్డూలను ఆస్వాదించారు. ప్రియ చేసిన గవ్వలు, ప్రవీణా చేసిన గులాబీ గుతులు, జాహ్నవీ చేసిన హల్వా, సస్సీ చేసిన కలాఖండ్, సంధ్య భారత్ చేసిన కొబ్బరి లడ్డూ, దివ్య, సంతోషీ, స్వాతి దుర్గలు చేసిన జాంగ్రీ, దీప్తి చేసిన పల్లి లడ్డూ, లక్ష్మి, వసంతీ చేసిన కజ్జికాయలు, సౌజన్య చేసిన చలిమిడి, త్రిశాలీ చేసిన బొబ్బట్లను జనాలు ఆస్వాదించారు. నవ్య, విజయ కిషోర్‌లు చేసిన బాదుషాలు, రాధిక, మధులు చేసిన సంపంగి పువ్వులు, భాగ్య చేసిన బూందీ కనక లక్ష్మి చేసిన బూరెలు నోరూరించాయి.
చిన్నారులు దాన్వి, భువి, ఘనన్వీ, సూర్య, సంయుత, దీప్తాన్స్‌లు ప్రదర్శించిన రామాయణం, లలిత అమ్మవారిగా నేహశ్రీ, సౌజన్య దీలీప్‌ల దర్శకత్వంలో సౌజన్య, జశ్మీత, ప్రవీణ, దివ్య, వర్షిత, శిల్ప, సంతోషిణి, కవిత, పార్గవిలు చేసిన నవదుర్గలు, మహిషాసురుడి పాత్రలో విజయలక్ష్మిలు అందర్నీ ఆకట్టుకున్నారు. నవదుర్గలను కళాభరితంగా జాహ్నవి అలంకరించగా లీల తన నైపుణ్యాలతో శన్విత, శివణ్య, యస్మితా, తన్వీ, శ్రేయ శ్రీలతో పాటు షాలినీల నాట్య కళ మంత్రముగ్ధులను చేసింది.

పాకిస్తాన్ జాతీయుడయిన ఆశోక్, రామ్, జగదీశ్‌లు పాడిన పాటలు శ్రోతలను అలరించగా దివ్య, ప్రవీణ, పావనిలు సందర్భానుసారం సన్నివేశాలకు తగినట్లుగా చేసిన వ్యాఖ్యానాలు అందరికీ నచ్చాయి. సౌజన్య, శిల్పల దర్శకత్వంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి.
రాకేష్, రామకృష్ణా, జగదీశ్‌లు చేసిన విద్యుత్ దీపాలంకరణ కాంతులతో వేదిక దివ్యమోహన సౌందర్యాన్ని సంతరించుకుంది. అతిథులందరికీ మూడు పూటలా ఆంధ్ర భోజనాలు వడ్డించిన జుబేల్‌లోని సదర్న్ డీలైట్ రెస్టారెంట్ నిర్వాహకుడు రవిని నిర్వాహకులు అభినందించారు.
సంబరాల నిర్వహణలో కీలక పాత్ర వహించిన వర ప్రసాద్, కిషోర్ గురుజు, నవ్య శ్రీనివాస్, రమేష్, లక్ష్మీనారాయణ, ప్రియ కేశవసుబ్రహ్మణ్యం పిరాఠి, అనిల్, వినయ్, రావడ సత్యం, సనాదుల పవన్, శర్మ, దిలీప్, సతీష్, లోకేష్ పలపాలా, కాయల శ్రీనివాస్, సూర్య దాసరి, నిరంజన్, సతీష్ దేవరం, పార్థసారథి, ప్రీతి నరేష్, రాధా సురేష్, లలిత శ్రీకాంత్, భరత్ రావుపల్లి, ఫణి కుమార్, జాస్మిత తారక్ మెడిబోయిన, శ్రావణ్, మల్లేష్ జవ్వాజి, మోహన్, విశాల్‌లను సాటా (యం) అభినందించింది.






ఇవి కూడా చదవండి
డల్లాస్‌లో సీనియర్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పర్యటన
వర్జీనియాలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం
Read Latest NRI News And Telugu News