AP: అల్లుళ్ల కట్నకానుకల కోసం అరబ్బునాట తెలుగు అమ్మ కష్టం
ABN , Publish Date - Jun 19 , 2025 | 07:03 AM
కూతుళ్ల పెళ్లి నాటి అప్పులు తీర్చేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఓ మహిళ అక్కడ వెట్టిచాకిరీతో అష్టకష్టాల పాలైంది. చివరకు ఏపీ ఎన్నార్టీ, స్థానిక ఎన్నారైల సాయంతో ఇబ్బందుల నుంచి గట్టెక్కి స్వదేశానికి చేరుకుంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: చుట్టూ గలగలా ప్రవహించే గోదావరి.. మధ్యలో ద్వీపకల్ప కుగ్రామంలో ఊరి అవతల ఒక తాటి పూరి గుడిసెలో ఉంటోందా నిరుపేద కుటుంబం. ఎక్కడో అరేబియా సముద్ర తీరంలోని ఖతర్ దేశం తమ కటిక దారిద్ర్యం తీరుస్తుందని భావించింది. ఆడ పిల్ల పుట్టడమే నేరమైన దేశం నుండి ఇద్దరు ఆడపిల్లల పెళ్ళి కట్నం అప్పులు తీర్చే క్రమంలో అరబ్బు దేశానికి చేరుకున్న వారందరికీ ఎడారి జీవితం అగమ్యగోచరమైంది.
కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెద్దపట్నంలంక గ్రామానికి చెందిన జిల్లి వరలక్ష్మి అనే మహిళ ఏడాదిన్నర క్రితం ఒక ఇంట్లో పని చేయడానికి ఖతర్‌కు వెళ్లింది. దోహాలోని భారతీయ ఎంబసీకి ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం తనను ఒక ఇంట్లో ఉద్యోగం చేయకుండా అనేక ఇళ్ళల్లో తిప్పుతూ పని చేయించుకోవడమే కాకుండా వేతనం లేకపోవడానికి తోడుగా సుదీర్ఘ పని గంటలు, భోజన వసతి విషయమై అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆ తరువాత అనారోగ్యానికి గురయిన ఆమె తాను పని చేయలేనంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేసినా దళారులు కనికరించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తమ స్ధానిక శాసన సభ్యుడు, జనసేనకు చెందిన గిడ్డి సత్యనారాయణ ద్వారా ఏపీ ఎన్నార్టీస్ సంస్ధ దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా ఖతర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రవాసీయుల సంక్షేమం కోసం పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు కూడా విన్నవించుకున్నారు.
అటు రాష్ట్ర సర్కారుకు చెందిన ఏపీ ఎన్నార్టీ సంస్థ, ఇటు తెలుగు ప్రవాసీ సంఘం అండగా భారతీయ ఎంబసీకి చేరుకున్న వరలక్ష్మికి ఎంబసీ ఆశ్రయం ఇచ్చి ఆమె సమస్యను ఖతరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆమె వీసాను రద్దు చేయించింది. ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆమెకు విమాన టిక్కెట్ సమకూర్చడంతో ఆమె ఇటీవల స్వదేశానికి చేరుకుంది.
కోనసీమ జిల్లాకు చెందిన అనేక మంది మహిళలు ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, సరైన ఎంప్లాయ్‌మెంట్ కంట్రాక్టులు లేకుండా ఖతర్, ఇతర గల్ఫ్ దేశాలకు వచ్చిన తర్వాత తాము మోసపోయినట్లుగా ఆవేదన చెందుతున్నారని దోహాలోని ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట నరసింహా జోశ్యుల పేర్కొన్నారు.
వరలక్ష్మితో పాటు ఈ రకమైన మహిళల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్న మంగళగిరిలోని ఏపీ ఎన్నార్టీ సంస్థ, ఖతర్‌లోని భారతీయ ఎంబసీలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు
బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు