Share News

శక్తి కేంద్రాల జాగృతే ఆనందమార్గం

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:07 AM

మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థ లేదా యంత్రాంగం మనలో ఏడు పొరలుగా పని చేస్తుంది. ఈ ఏడు పొరలే మనలోని శక్తి కేంద్రాలు. వాటినే చక్రాలు అంటాం. అదే మన శరీరంలో మనకు కనిపించని కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఆత్మ సాక్షాత్కారం...

శక్తి కేంద్రాల జాగృతే ఆనందమార్గం

సహజయోగ

మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థ లేదా యంత్రాంగం మనలో ఏడు పొరలుగా పని చేస్తుంది. ఈ ఏడు పొరలే మనలోని శక్తి కేంద్రాలు. వాటినే చక్రాలు అంటాం. అదే మన శరీరంలో మనకు కనిపించని కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఆత్మ సాక్షాత్కారం పొంది వాటిని జాగృతం చేసుకోవడమే మానవులు ఆనందాన్ని పొందే మార్గం.ఈ శక్తి కేంద్రాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

మూలాధార చక్రం: మొదటి శక్తి కేంద్రమైన మూలాధార చక్రం మన విసర్జనావయవాల మీద ప్రభావం చూపుతుంది. అది మనకు ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది. మిగిలిన లోతైన, సున్నితమైన విషయాల వల్ల కలిగే అనుభూతులు ఈ ఆనందాన్ని అధిగమించకూడదంటే... మనలో అమాయకత్వం ఉండాలి. అది గణేశుడి సహజమైన లక్షణం. అదే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం. ఈ అమాయకత్వం కావాలనుకుంటే వచ్చేది కాదు. అది అంతర్గతంగా నిర్మితమై ఉండాలి. కానీ సహజయోగ సాధనతో మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా దాన్ని పెంచుకోవచ్చు.

స్వాధిష్టాన చక్రం: రెండో శక్తి కేంద్రమైన స్వాధిష్టాన చక్రం... సృజనాత్మకత వల్ల కలిగే ఆనందానికి ప్రతీక. కొందరు దేన్నయినా సృష్టించాలని ఆరాటపడతారు. పుస్తకం రాయడం, చిత్రాన్ని గీయడం లాంటివి ఎంతో ముఖ్యంగా భావిస్తారు. ఈ సృజనాత్మకతకు హేతుబద్ధమైన మెదడు తోడైతే... తమ గొప్పతనం వల్లే మంచి సత్ఫలితాలు, విజయం చేకూరుతున్నట్టు భావిస్తారు. కానీ ఈ ఆలోచన సరికాదు. దీన్ని అధిగమించాలంటే నిర్విచార స్థితిలోకి వెళ్ళాలి. మీ అవగాహన ప్రకాశవంతమైనప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు మీరు దేన్ని సృష్టించినా... దాన్ని కేవలం గమనిస్తూ ఉంటారు. ఆ నిర్విచారమైన స్థితిలో దేన్ని సృష్టించినా దాన్ని ఆనందించగలుగుతారు. మనలోనే ఉన్న శ్రీబ్రహ్మదేవ సరస్వతీతత్త్వాన్ని జాగృతపరచడం వల్లే ఇది సాధ్యమవుతుంది.


నాభి లేదా మణిపుర చక్రం: ఆకలితో ఉన్నప్పుడు ధ్యానంలో కూడా సరిగ్గా కూర్చోలేం. ఆహారాన్ని తిన్నప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే ఈ ఆనందం తాత్కాలికం. ఎందుకంటే దేన్నైనా సంపూర్ణంగా ఆనందించగలిగితే... దాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకోం. ఈ స్థితికి చేరుకోవడానికి సంతృప్తి ఒక్కటే సాధనం. రెండు ముద్దలు తిన్నా సంతృప్తి చెందగలగాలి. నాభీ చక్రాన్ని సరిచేసుకొనే మార్గం ఈ సంతృప్తే. నిత్య ధ్యాన సాధన ద్వారా మనలోని శ్రీలక్ష్మీనారాయణ శక్తిని జాగృతం చేసుకోవడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. సంతృప్తి అనేది ఆత్మసాక్షాత్కారం లేకుండా లభించదు. ఆత్మసాక్షాత్కారం పొందితే... మీ ఆత్మను ఏది సంతృప్తి పరుస్తుందనేది తెలుస్తుంది. అప్పుడు మీ ప్రాధాన్యాలు మారుతాయి.

అనాహత చక్రం: అనాహత (హృదయ) చక్రం చాలా ముఖ్యమైనది. ఉదార స్వభావులైన వారు ప్రపంచమంతటినీ తమ కుటుంబంగా భావిస్తారు. అందరి సమస్యను తమదిగానే పరిగణిస్తారు. ఈ గుణం హృదయంలోంచీ వస్తుంది. హృదయ చక్రంలోని విశిష్టత... భద్రత. మీలోని సంపూర్ణ భద్రత మీ ఆత్మ మాత్రమే. మీరు భద్రతా భావం కలిగినవారైతే... మీ పిల్లలు కూడా భద్రత అనేది తమలోనే ఉన్నదని గ్రహిస్తారు. వారు నిజమైన ధైర్యవంతులుగా ఉంటారు. భద్రతాభావం వల్ల కలిగే ఆనందం మిమ్మల్ని ఆధ్యాత్మికమైన లోతులకు తీసుకువెళుతుంది. ఎవరిలో భగవంతుడు ఉంటాడో, ఎవరికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయో... వారికి ఇక కావలసింది మరేముంటుంది? కాబట్టి భగవంతుడి మీద విశ్వాసాన్ని మీ హృదయ చక్రంలో పదిలరపచుకోండి. దీనికోసం దుర్గామాతను మీ హృదయంలో స్థిరపరచుకోండి.

విశుద్ధి చక్రం: విశుద్ధి చక్రాన్ని రెండుగా విభజించవచ్చు. అవి విశుద్ధి, హంస చక్రాలు. విశుద్ధ చక్రం విరాట్‌ స్వరూపుడి చక్రం. అది విశ్వవ్యాపితమైన మాధుర్యత. సంబంధ బాంధవ్యాలలో ఉండే మాధుర్యత. మీరు పుష్పంలోని మాధుర్యాన్ని, సువాసనను ఆస్వాదించినట్టు... ఇతరులలోని మంచి లక్షణాలను ఆస్వాదించాలి. ఈ సామూహక చేతనను, విశ్వజనీనతను మీరు అనుభూతి చెందినప్పుడే విరాట్‌ స్వరూపంలో భాగం అవుతారు. కాబట్టి మొదటగా ఇతరుల పట్ల ప్రేమను మీలో పెంచుకోండి. అప్పుడు మీ ప్రవర్తనలో, ముఖకవళికల్లో ఎంతో మృదుత్వం ప్రస్ఫుటమవుతుంది. సహజయోగ సాధన ద్వారా... విరాట్‌ స్వరూపుడైన కృష్ణుడి గుణగణాలను మీరో స్థిరపరుచుకోవడం ద్వారా ఇది మీకు లభిస్తుంది. ఇక హంస చక్రం మీలో విచక్షణా భావాన్ని పెంపొందిస్తుంది. దాన్ని పరిశుభ్రంగా, చైతన్యవంతంగా ఉంచుకుంటే... మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని మీ అంతట మీరే గుర్తించగలరు.

ఆజ్ఞా చక్రం: ఆజ్ఞా చక్రం తాలూకు తత్త్వం... కాంతి లేదా ప్రకాశం. ఇది మీ చిత్తాన్ని తేజోవంతం చేస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అయిన తరువాత మీరు ప్రతిదాన్నీ ఈ కాంతి ద్వారానే చూస్తారు. మీరే కాంతి అని, శాశ్వతమైన ప్రకాశం అని తెలుసుకుంటారు. ఈ సంగతి మీరు అర్థమైనప్పుడు మీలోని భయాలు, మిమ్మల్ని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించే శక్తులు క్షణంలో అదృశ్యమవుతాయి. అప్పుడు మీలో ఎలాంటి భయం ఉండదు. ఎలాంటి త్యాగాన్నయినా ఆనందంగా చేస్తారు. ఈ లక్షణం మీలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఇది సహజయోగ సాధన ద్వారా సాధ్యపడుతుంది.


సహస్రార చక్రం: మన సూక్ష్మ నాడీ వ్యవస్థలో ఆఖరి చక్రం... సహస్రారం. ఇది చాలా ముఖ్యమైన చక్రం. మొత్తం ఏడు చక్రాలు వాటి పీఠాలను సహస్రారంలో కలిగి ఉంటాయి. ఈ పీఠాలు ఆనందాన్ని స్వీకరించి, హృదయానికి అందిస్తాయి. మీరు ధ్యానం ద్వారా సహస్రార చక్రాన్ని చేరుకోగలగాలి. లలితా సహస్రనామాల్లో చెప్పినట్టు... దేవి ఇక్కడే ‘మహామాయ’గా ఉంటుంది. ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఈ చక్రం జాగృతం అవుతుంది.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 05:07 AM