యోగాకు మతంతో సంబంధం లేదు
ABN , Publish Date - Jun 20 , 2025 | 06:21 AM
భారత ఉపఖండానికి యోగ విద్య కొత్తదేం కాదు. వేల ఏళ్ళ క్రితమే భారతీయులకు యోగ సాధన తెలుసని రుజువుపరిచే పురావస్తు ఆధారాలెన్నో లభించాయి. సామాన్య శక పూర్వం (బీసీఈ) 2500 కాలం నాటి సింధు నాగరికతకు...
విశేషం
భారత ఉపఖండానికి యోగ విద్య కొత్తదేం కాదు. వేల ఏళ్ళ క్రితమే భారతీయులకు యోగ సాధన తెలుసని రుజువుపరిచే పురావస్తు ఆధారాలెన్నో లభించాయి. సామాన్య శక పూర్వం (బీసీఈ) 2500 కాలం నాటి సింధు నాగరికతకు చెందిన కొన్ని మట్టి ముద్రల మీద... యోగాసన భంగిమలలో కూర్చొని తపస్సు చేస్తున్న సాధకుల బొమ్మలు ఉన్నాయి. ఇవి నేటి పాకిస్తాన్‌లోని లార్కానాలో... మొహెంజదారో శిథిలాలలో బయటపడ్డాయి. అలాగే బీసీఈ 1500 నాటి ఋగ్వేద మంత్రాల్ని పరిశీలిస్తే నాటి ప్రజలకు అప్పటికే యోగాభ్యాసం గురించి తెలుసునని గ్రహించగలం. వివిధ ఉపనిషత్తులు, భగవద్గీత (ఆత్మ సంయమ యోగం)లో యోగ సాధన ప్రయోజనాలు, మార్గాలు విపులంగా చర్చించారు. ప్రాచీన కాలంలో యోగ సాధనను అందరూ శారీరక, మానసిక ఆరోగ్య ప్రదాయినిగా భావించారు. అయితే... యోగ సాధన ఫలితాల గురించి భారతీయులలో పలు అశాస్త్రీయ విశ్వాసాలు కూడా క్రమంగా ఏర్పడ్డాయి.
ఇతర మతాల్లోనూ...
కొందరు భావిస్తున్నట్టు యోగా కేవలం సనాతన (హిందూ) ధర్మానికి సంబంధించిన సాధన మాత్రమే కాదు. వైదికేతరమైన జైన, బౌద్ధానుయాయులు, ఇస్లామ్ మతానికి చెందిన సూఫీలు, దర్వేషీలు కూడా యోగ సాధన చేస్తారు. తాంత్రిక బౌద్ధ శాఖ అయిన ‘వజ్రయానం’లో యోగాసనాలకు, ప్రాణాయామానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బౌద్ధ గ్రంథమైన ‘దీర్ఘనికాయం’లో వీటి ప్రస్తావనలు ఉన్నాయి. సాంఖ్య సిద్ధాంతం పునాదిగా, బౌద్ధం ద్వారా ప్రభావితుడైన పతంజలి మహర్షి ‘యోగ సూత్రములు’ అనే గ్రంథం రచించి, యోగను ఎనిమిది అంగాలతో కూడిన సమగ్ర సాధనంగా రూపొందించాడు. వేదాలను ప్రమాణాలుగా భావించే భారతీయ షట్ (ఆరు) ఆస్తిక దర్శనాలలో యోగ దర్శనం ఒకటి. కపిల మహర్షి రూపొందించిన సాంఖ్య దర్శనం... నిరీశ్వర (దైవం ప్రస్తావన లేని) సిద్ధాంతం కాగా... దాని ఆధారంగా పతంజలి రచించిన ‘యోగ సూత్రాలు’ దానికి దైవం, మోక్షం లాంటి భావనలను జోడించాయి. అందుకే పతంజలి యోగ సిద్ధాంతానికి ‘సేశ్వర (స+ఈశ్వర) సాంఖ్యం’ అనే పేరు వచ్చింది. ‘యోగ’ అనే మాటకు ‘ఉపాయం, కూర్పు, కలయిక’ అనే సాధారణ అర్థాలు ఉన్నాయి. సాంఖ్య సిద్ధాంతం ఆత్మను ‘పురుషుడు’ అని, పదార్థాన్ని ‘ప్రకృతి’ అని వ్యవహరిస్తూ... అవి రెండూ అంతిమ సత్యాలని నమ్ముతుంది. శుద్ధ చైతన్య స్వరూపుడైన పురుషుడు (ఆత్మ) పదార్థ జనితమైన చిత్తంతో చెందే సంయోగం కారణంగా వివిధ చిత్తవృత్తుల (మెంటల్ మోడిఫికేషన్స్)కు లోనవుతాడని, తన స్వభావ సిద్ధమైన వివేక జ్ఞానాన్ని కోల్పోతాడని, చిత్తవృత్తులను నిరోధించి, వివేక జ్ఞానం పొందడం ద్వారా మోక్షాన్ని సాధించే మార్గమే యోగమని పతంజలి సిద్ధాంతం.
శాస్త్రీయ దృక్పథంలో...
ఇప్పుడు దీన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిద్దాం. సిద్ధాంతపరంగా మిగిలిన అయిదు ఆస్తిక దర్శనాలు ఎదుర్కొన్న తార్కికమైన, తాత్త్వికమైన చిక్కులనే యోగ దర్శనం కూడా ఎదుర్కొంది. యోగ సాధన ద్వారా దైవ స్వరూపం అవగతమవుతుందని, పలు సిద్ధులు, అతీంద్రియ శక్తులు లభిస్తాయని యోగ సూత్రాలలో పేర్కొన్న విషయాలను కొందరు విశ్వసిస్తారు. అయితే వాటికి శాస్త్రీయ ఆధారాలను మాత్రం చూపలేరు. అయితే మన శారీరక, మానసిక ఆరోగ్యాలకు యోగసాధన ప్రయోజనకరమని మాత్రం శాస్త్రీయంగా రుజువయింది. యోగాసనాల వల్ల పలు శరీరావయవాలకు, మెదడుకూ రక్తప్రసరణ మెరుగుపడుతుందని, అనేక శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నిరూపితం అయింది. ‘అష్టాంగయోగ’ సాధనలో అంతర్భాగమైన ప్రాణాయామం ద్వారా శ్వాసకోశాలు శుభ్రపడి, రక్తశుద్ధి మరింత చక్కగా జరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ధారణ ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయి. ధ్యానం చిత్తశుద్ధినీ, ప్రశాంతతను చేకూరుస్తుంది. యోగ సాధన ప్రయోజనాలు వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తల అధ్యయనాల్లో రుజువయ్యాయి. అంతేతప్ప అతీంద్రియ శక్తులు లభిస్తాయని ఎవరూ రుజువు చేయలేదు. అందుకే వాటిని అంధ విశ్వాసాలుగా విజ్ఞులు, శాస్త్రవేత్తలు కొట్టి పారేస్తారు. కాగా... శారీరక, మానసిక ఆరోగ్యాలకు ఎంతో మేలు చేకూర్చే యోగ సాధనను కొందరు మత విశ్వాసాలతో ముడిపెడుతున్నారు. యోగ శిక్షణ తరగతులలో చేసే సాధనను భక్తి, ప్రార్థనలు, భజనలతో మిళితం చేస్తున్నారు. యోగ సాధనకు మత విశ్వాసాలతో ఎలాంటి సంబంధం లేదని, ఏ మతస్థులైనా యోగ సాధన చేసి పొందవచ్చని, ఎందరో అలా పొందుతున్నారని అందరూ గ్రహించాలి.
అష్టాంగ యోగం
చిత్తవృత్తులను నిరోధించడమే యోగమని చెబుతూ... ‘యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి’ అనే ఎనిమిది అంగాలను పతంజలి వివరించాడు. ఈ ఎనిమిది అంగాలు కలిగిన యోగ సాధనను ‘అష్టాంగ యోగం’ అంటారు. వాటిలో మొదటి అయిదు బహిరంగ సాధనాలని, మిగిలిన మూడు అంతరంగ సాధనలని పేర్కొంటారు. యమ, నియమాలు సాధకులకు నైతిక క్రమశిక్షణ చేకూర్చితే... ఆసన ప్రాణాయామాలు సాధకుల శరీరారోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ‘ఆసనం’ అంటే శరీరాన్ని ఒకే స్థితిలో నిశ్చలంగా ఉంచగలగడం. ‘ప్రాణాయామ సాధన’ అంటే మనం పీల్చే ప్రాణవాయువును వివిధ విధాలుగా బిగబట్టి, వదులుతూ చేసే ఆయామం (నియంత్రణ). ‘ప్రత్యాహారం’ అంటే సాధకులు తమ పంచేంద్రియాలను, మనస్సును విషయ వాంఛలకు దూరంగా ఉంచడం. సాధకులు ‘భ్రుకుటి’ (కనుబొమల మధ్య ప్రదేశం), ‘నాసాగ్రం’ (ముక్కు కొన) లాంటి వాటిపై దృష్టి కేంద్రీకరించి... ఏకాగ్ర సాధన చేయడాన్ని ‘ధారణ’ అంటాం. మనస్సును నిరంతరం ఒకే విషయం మీద లగ్నం చెయ్యడాన్ని ‘ధ్యానం’ అని పిలుస్తారు. ధ్యానం కూడా ఆగిపోయి... ఆత్మ, మనం ధ్యానం చేసే విషయం... ఈ రెండూ ఒకటై పోయే దశను ‘సమాధి స్థితి’ అంటారు.
ముత్తేవి రవీంద్రనాథ్
చరిత్ర పరిశోధకుడు
for more news
రూ.14,000 కోట్లతో హైదరాబాద్ విమానాశ్రయం విస్తరణ!