Share News

రూ.14,000 కోట్లతో హైదరాబాద్‌ విమానాశ్రయం విస్తరణ!

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:41 AM

హైదరాబాద్‌, శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్‌జీఐఏ) పెద్దఎత్తున విస్తరించాలని ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌...

రూ.14,000 కోట్లతో హైదరాబాద్‌ విమానాశ్రయం విస్తరణ!

కొత్తగా మరో టెర్మినల్‌, రన్‌వే ఏర్పాటు

2029 సెప్టెంబరు నాటికి విస్తరణ పూర్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌, శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్‌జీఐఏ) పెద్దఎత్తున విస్తరించాలని ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) భావిస్తోంది. ఇందుకోసం వచ్చే మూడేళ్ల కాలంలో దాదాపు రూ.14,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ ఒక అంతర్గత డాక్యుమెంట్‌లో పేర్కొంది. ఈ విస్తరణలో భాగంగా ప్రస్తుత టెర్మినల్‌ను విస్తరించటంతో పాటు కొత్తగా మరో టెర్మినల్‌ను రన్‌వేను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఈ పనులు ప్రారంభించి 2029 సెప్టెంబరు నాటికి ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలని జీహెచ్‌ఐఏఎల్‌ భావిస్తోంది.


ఎందుకంటే ?

ఏటా 3.4 కోట్ల మంది ప్రయాణికులు, గంటకు 42 విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా జీఎంఆర్‌ గ్రూప్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును నిర్మించింది. 2017-18లో 1.83 కోట్లుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య ఏటా 7.1 శాతం వృద్ధి రేటుతో గత ఆర్థిక సంవత్సరం 2.95 కోట్లకు చేరింది. రాకపోకలు సాగించే విమానాల సంఖ్యా గంటకు 36కు చేరింది. అంటే ఎయిర్‌పోర్టు త్వరలోనే గరిష్ఠ సామర్ధ్యానికి చేరువవుతోంది. దీంతో వెంటనే విమానాశ్రయం సామర్ధ్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రస్తుత టెర్మినల్‌ ప్రయాణికుల వార్షిక సామర్ధ్యాన్ని 3.4 కోట్ల నుంచి 4.7 కోట్లకు విస్తరించడంతో పాటు కొత్తగా 2 కోట్ల మంది ప్రయాణికులు, 46 నుంచి 47 విమానాలు రాకపోకలు సాగించేలా ఇంకో టెర్మినల్‌, 3,800 మీటర్ల పొడవైన రన్‌వే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

అత్యాధునిక సౌకర్యాలు

ఈ విస్తరణ, ఆధునీకరణను అధునాతన సదుపాయాలతో పూర్తి చేయాలని జీహెచ్‌ఐఏఎల్‌ భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే రన్‌వేలో క్యాటగిరి-1 ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌, అధునాతన నావిగేషన్‌ పరికరాలను ఏర్పాటు చేయనుంది. దీంతో రన్‌వే సరిగా కనిపించక పోయినా పైలెట్లు విమానాలను సురక్షితంగా ల్యాండింగ్‌ చేయగలుగుతారు.

Also Read:

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

For More Business News

Updated Date - Jun 20 , 2025 | 05:41 AM