Share News

Why Meditation Is Essential Today: ధ్యానం దేనికోసం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:46 AM

మనం నివసిస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి విడదీయలేని ఒక భాగమైపోయింది. ప్రాణం పోయడానికి చికిత్స చేస్తున్న సర్జన్‌కి అయినా, క్షణం తీరుబడిలేని సీఈఓకి అయినా, క్లాసులో విద్యార్థులకు పాఠం చెప్పే...

Why Meditation Is Essential Today: ధ్యానం దేనికోసం

చింతన

మనం నివసిస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి విడదీయలేని ఒక భాగమైపోయింది. ప్రాణం పోయడానికి చికిత్స చేస్తున్న సర్జన్‌కి అయినా, క్షణం తీరుబడిలేని సీఈఓకి అయినా, క్లాసులో విద్యార్థులకు పాఠం చెప్పే టీచర్‌కి అయినా, ఇంట్లో గృహిణికి అయినా ఒత్తిడి తప్పదు. కొన్ని వేల ఏళ్ల క్రితం మనిషి జీవితం చాలా సరళంగా... సరళరేఖలో సాగేది. వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవడం, ప్రకృతి నుంచి రక్షించుకోవడం... ఈ రెండే ప్రాఽధామ్యాలుగా ఉండేవి. అప్పుడప్పుడు క్రూర మృగాలు ఎదురయినప్పుడు, లేదా ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే ఒత్తిడి ఉండేది. ఈ ఒత్తిడి సమయంలో శరీరం- దాన్ని ఎదుర్కోవడానికి లేదా తప్పించుకొని పారిపోవడానికి వీలుగా హార్లోన్లు ఉత్పత్తి చేసేది. (దీనినే ‘ఫ్లైట్‌ ఆర్‌ ఫైట్‌ సిద్ధాంతం’ అంటారు). అంటే ఆ సమయంలో ఒత్తిడి ఒక అరుదైన విషయం.

అందరికీ అవసరం

మానవ పరిణామ క్రమంలో అనేక మార్పులు వచ్చాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అందరూ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ఈ హార్మోన్లు ఏడాదిలో పది పదిహేనుసార్లు విడుదలయితే- ఇప్పుడు ప్రతిరోజూ 20,30 సార్లు విడుదలవుతున్నాయి. వీటి వల్ల బీపీ, షుగర్‌ లాంటి అనేక జబ్బులు వస్తున్నాయి. జన్యుపరివర్తనలు కూడా జరుగుతున్నాయి. వ్యాధులున్నప్పుడు మనం తీసుకొనే నిర్ణయాలు స్పష్టంగా ఉండవు. మన చుట్టూ ఉన్న ప్రపంచగమనాన్ని మార్చలేం కాబట్టి... మనం ఒత్తిడి నుంచి తట్టుకోవటానికి సిద్ధంగా ఉండటానికి మనకు ఉన్న ఏకైక సాధనం ధ్యానం. చాలామంది ధ్యానాన్ని ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఉన్న ప్రత్యామ్నాయంగా లేదా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి తొలి మెట్టుగా భావిస్తారు. కానీ ప్రస్తుతం ధ్యానం అందరికీ ఒక అవసరం. మానసిక పరిశుభ్రతకు అవసరమైన ఒక సాధనం. ప్రతి రోజు మనం స్నానం చేస్తే శారీరక మలినాలు తొలగిపోతాయి. అలాగే ధ్యానం చేయటం వల్ల మన ఆలోచనల వల్ల.. భావోద్వేగాల వల్ల కలిగే మలినాలను తొలగించుకోగలుగుతాం. అవి తొలగితే మన జీవితానికి అవసరమైన ప్రాధమ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అంశంపై ఇప్పటి దాకా అనేక శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. క్రమం తప్పకుండా ధ్యానం చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని, ఆత్మనిర్భరత మెరుగుపడుతుందని.. భావోద్వేగాలు నియంత్రణలోకి వస్తాయని, మెదడు పనితీరు బాగుపడుతుందని ఈ పరిశోధనలలో తేలింది.


హార్డ్‌ఫుల్‌నెస్‌...

ఒక వైద్యుడిగా 365 రోజులూ నేను ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటాను. వందల మంది రోగుల ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే నాకు- ధ్యానం ఒక అనుభవం కాదు, నిత్యావసరం. ప్రస్తుతం మనకు అనేక రకాలైన ధ్యానపద్ధతులు అందుబాటులో ఉన్నాయి. 15 ఏళ్ళ క్రితం నేను ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ మార్గంలో మనం మంత్రాలు ఉచ్చరించాల్సిన అవసరం ఉండదు. ఉచ్ఛ్వాస, నిశ్వాసలను నియంత్రించనక్కరలేదు. క్లిష్టమైన క్రతువులు చేయాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి జడ్జిమెంట్‌ లేకుండా ఆలోచనలను గమనించి, నిశ్చల స్థితికి చేరుకోవటమే హార్ట్‌ఫుల్‌నెస్‌ సిద్ధాంతం. 15 ఏళ్ళ క్రితం ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ మొదలైన నా ప్రయాణం నేటికీ సాగుతూనే ఉంది. హార్ట్‌ఫుల్‌నెస్‌ నా జీవితానికి ఒక చుక్కానిగా మారింది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు నా ప్రతిస్పందనల తీరులో మార్పు వచ్చింది. నాలో పేరుకున్న కొన్ని భయాలు తొలగిపోయాయి. అత్యంత క్లిష్టమైన సర్జరీలు చేసే సమయంలో ఎటువంటి సందిగ్దత లేకుండా నిర్ణయాలు తీసుకొనే శక్తి పెరిగింది. నా ఉద్దేశంలో - ఎగుడుదిగుడుల మన జీవితాలకు ఒక చుక్కాని తప్పనిసరిగా కావాలి. అది మన జీవితాలను ముందుకు నడపడంతో పాటుగా మనను ఆధ్యాత్మిక కాంతివైపు కూడా నడిచేలా చేయాలి. దీనికి హార్ట్‌ఫుల్‌నెస్‌ ఒక ఉత్తమమైన మార్గం.

డాక్టర్‌ శరత్‌రెడ్డి

క్లినికల్‌ డైరక్టర్‌, మెడికవర్‌ హాస్పటల్స్‌

9440087532

ఈ వార్తలు కూడా చదవండి..

పేలిన వాషింగ్ మిషన్.. ఉలిక్కిపడ్డ ప్రజలు

మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం

Updated Date - Nov 28 , 2025 | 12:52 AM