స్పైడర్ ఉండాల్సిందే
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:00 AM
మనం ఇంట్లో అందమైన మొక్కల కుండీలను పెట్టుకుంటూ ఉంటాం. ఈ మొక్కలు ఇల్లంతా తాజాదనాన్ని వ్యాపింపజేస్తూ ఉంటాయి. ఈ కోవలో చెప్పుకోదగ్గది ‘స్పైడర్ ప్లాంట్’. దీని ఆకులు సన్నగా పొడవుగా చివర్లు మొనదేలి ఉంటాయి...

మనం ఇంట్లో అందమైన మొక్కల కుండీలను పెట్టుకుంటూ ఉంటాం. ఈ మొక్కలు ఇల్లంతా తాజాదనాన్ని వ్యాపింపజేస్తూ ఉంటాయి. ఈ కోవలో చెప్పుకోదగ్గది ‘స్పైడర్ ప్లాంట్’. దీని ఆకులు సన్నగా పొడవుగా చివర్లు మొనదేలి ఉంటాయి. ఈ మొక్క గుబురుగా పెరిగినప్పుడు..... పేరుకు తగ్గట్టు సాలె పురుగును తలపిస్తుంది. దీనిని ఎక్కువగా సంరక్షించాల్సిన అవసరం లేదు. ఎండ, వాన, చలి లాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని చక్కగా పెరుగుతుంది.
వెడల్పాటి కుండీలో తోటమట్టిని నింపి చిన్న మొక్కను నాటితే చాలు. కొద్ది సమయంలోనే గుబురుగా పెరుగుతుంది. బాల్కనీ గోడమీద, కిటికీల దగ్గర కుండీలు అమర్చుకోవచ్చు. ఈ మొక్కకు నేరుగా ఎండ తగలకూడదు. కొద్దిగా వెలుగు సోకితే చాలు. గది ఉష్ణోగ్రత వద్ద వేగంగా పెరుగుతుంది. దీనికి నీరు ఎక్కువగా పోయకూడదు. మట్టి తేమగా ఉందో లేదో చూసుకుని రెండు రోజులకు ఒకసారి నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది. క్లోరిన్ కలిపిన మంచినీరు కాకుండా బోరు నీళ్లు, బాగా శుద్ది చేసిన నీరు లేదంటే వర్షపు నీటిని మాత్రమే కొద్దిగా చల్లాలి.
స్పైడర్ మొక్క కుండీలను వంటగది, పడక గది, పిల్లలు చదువుకునే గదుల్లో పెట్టుకోవచ్చు. హాల్లో సోఫాకు ఇరుపక్కలా పెట్టినా అందంగా కనిపిస్తుంది.
వంటగది నుంచి వెలువడే వేడి, ఘాటైన వాసనలను ఈ మొక్క పీల్చుకుంటుంది. ఆక్సిజన్‌తోపాటు తేమనీ విడుదల చేస్తుంది. దీనివల్ల ఇల్లంతా చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. స్పైడర్ మొక్క ఆకులు ఇంట్లో గాలిని శుద్ధి చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మెదడు చురుకుగా పనిచేయడంతోపాటు ఏకాగ్రత పెరుగుతుంది. ఏసీ ఉన్న గదిలో ఈ మొక్కను ఏర్పాటు చేసుకుంటే శ్వాసకోశ సమస్యలు రావు. ఇంట్లో స్పైడర్ మొక్కను పెంచడం వల్ల ఈగలు, దోమలు, ఇతర క్రిమి కీటకాలు లోనికి రావు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు సీరియస్..
Read latest AP News And Telugu News