Cooking Oil: ఏ నూనె మేలు
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:38 AM
మార్కెట్లో రకరకాల వంట నూనెలు దొరుకుతున్నాయి. వీటికి తోడు గానుగ నూనెలు కూడా అందుబాటులోకొచ్చాయి. ఇన్ని నూనెల్లో, దేన్ని వాడుకోవడం ఉత్తమం? ఏ నూనె ఆరోగ్యకరం...
పోషకాహారం
మార్కెట్లో రకరకాల వంట నూనెలు దొరుకుతున్నాయి. వీటికి తోడు గానుగ నూనెలు కూడా అందుబాటులోకొచ్చాయి. ఇన్ని నూనెల్లో, దేన్ని వాడుకోవడం ఉత్తమం? ఏ నూనె ఆరోగ్యకరం? పోషకాహార నిపుణులేమంటున్నారో తెలుసుకుందామా?
మార్కెట్లో ఎన్నో రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో జరిగే కల్తీలు, నాణ్యతా లోపాల వల్ల ఇటీవలి కాలంలో గుండె రక్తనాళాల్లో అడ్డంకులు, అధిక కొలెస్ట్రాల్ సంబంధిత గుండెపోట్లు పెరుగుతున్నాయి. ఇలాంటి నూనెల వాడకం వల్లే 20 ఏళ్ల యువతలో సైతం చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎంచుకునే నూనెల్లో జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా వాణిజ్య ప్రకటనల్లో కనిపించే బ్రాండ్లకే ఎక్కువ గిరాకీ ఉంటుంది. కానీ ధర ఎక్కువే ఉన్నా, పరిశోధనాధారిత నూనెలు, దీర్ఘకాలంగా మన్నుతున్న బ్రాండ్లనే ఎంచుకోవాలి. పొద్దుతిరుగుడు నూనెకు గిరాకీ ఎక్కువ కాబట్టి దాన్లోనే ఎక్కువ కల్తీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
గానుగ నూనెలు మేలే!
కొంతకాలంగా సర్వత్రా వేరుశనగ, నువ్వుల నూనెల పట్ల మక్కువ పెరిగింది. ఇవే నూనెలు ప్యాకెట్ల రూపంలో సూపర్‌మార్కెట్లలో దొరుకుతున్నప్పటికీ, వీటి తయారీలో మూడు, నాలుగో గ్రేడ్ వేరుసెనగలనే వాడతారు. అలాగే గానుగల్లో తయారయ్యే శనగ నూనెల్లో కూడా కల్తీ జరగలేదని చెప్పలేం! కాబట్టి స్వచ్ఛమైన నూనెలు కావాలనుకునేవారు, నువ్వులు, లేదా వేరుశనగలను కొని, వాటితో గానుగలో నూనె పట్టించి తీసుకోవాలి. వీటికి బదులుగా కుసుమ నూనె, రైస్ బ్రాన్, సన్‌ఫ్లవర్ నూనెలు వాడుకోవాలనుకునేవాళ్లు, ధర ఎక్కువైనా, నాణ్యమైన మన్నికైన బ్రాండ్ నూనెలనే ఎంచుకోవాలి.
రైస్ బ్రాన్ కూడా...
ఈ నూనె వంటకు మంచిదే! చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులతో బాధపడేవారు ఈ నూనె వాడుకోవడం మంచిది. ఈ నూనెలో ఉండే ఒరైజనాల్ అనే ఫైటోకెమికల్ గుండె రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోడానికి సహాయపడుతుంది. కాబట్టి వంటనూనెల జాబితాలో దీన్ని కూడా చేర్చుకోవాలి.
నూనెలు మార్చి మార్చి
రక రకాల నూనెల్లో భిన్నమైన పోషకాలుంటాయి. కాబట్టి ఎప్పుడూ ఒకే నూనెకే పరిమితమైపోకుండా, తరచూ మారుస్తూ ఉండాలి. నువ్వుల నూనె, వేరుశనగ, కుసుమ, రైస్ బ్రాన్, పొద్దుతిరుగుడు.. ఇలా వీటిని మారుస్తూ వాడుకుంటూ ఉండాలి. గుండె జబ్బులున్న వాళ్లు పొద్దుతిరుగుడు నూనె మినహా మరే నూనె వాడడానికైనా భయపడుతూ ఉంటారు. కానీ ఏ నూనె అయినా పరిమితంగా వాడుకోవచ్చు. మనం తినే ఆహారంలో కూడా నూనెలుంటాయి. తాలింపుల్లో, పచ్చళ్లలో వేరుశనగలు, నువ్వులు, కొబ్బరిల ద్వారా కొంత నూనె శరీరంలోకి చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి వాటి పరిమాణాన్ని లెక్కించుకుని, వంటల్లో వాడే నూనెను పరిమితం చేసుకోగలిగితే, శనగ, నువ్వుల నూనెలను కూడా వాడుకోవచ్చు.
ఇళ్లలో బజ్జీలు, పకోడీల కోసం ఉపయోగించిన నూనెను, చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకుని, కూరలు, తాలింపుల కోసం వాడుకోవచ్చు. కానీ అదే నూనెను మళ్లీ మళ్లీ డీప్ ఫ్రైలకు వాడడం సరి కాదు. కానీ హోటళ్లలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. హోటళ్లలో వాడిన నూనెలో పదే పదే వాడుతూ ఉంటారు. నిజానికి హోటళ్లు, ఇలాంటి నూనెలను క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిదారులకు విక్రయించాలనే నిబంధన ఉంది. క్రూడ్ ఆయిల్ ఉత్తత్తిదారులు ఇలా సేకరించిన నూనెలతో ఇంజన్ ఆయిల్, గ్రీజ్ లాంటి పెట్రోలియం ఉత్పత్తులను తయారుచేస్తారు.
నూనెలో ముంచి వేయించే పూరీలు, బజ్జీలు లాంటి వాటి కోసం స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉండే వేరుశనగ, పొద్దుతిరుగుడు, రైస్ బ్రాన్ నూనెలను వాడుకోవాలి. నువ్వుల నూనె, ఆలివ్ నూనె, అవిసె గింజల నూనెలు ఇలాంటి వేపుళ్లకు వాడకూడదు.
డాక్టర్ సుజాత స్టీఫెన్
క్లినికల్ న్యూట్రిషనిస్ట్,
యశోద హాస్పిటల్స్,
మలక్ పేట, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి
నీ వయస్సు అయిపోయింది.. అందుకే..
ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
Read Latest AP News And Telugu News