సద్గతులనిచ్చే క్షేత్రం వ్యాఘ్రేశ్వరం
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:50 AM
ఏకాదశ రుద్రులుగా పేరు పొందిన ఈశ్వర రూపాల్లో... తొమ్మిది కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలంలో కొలువుతీరాయి. వాటిలో ఈశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. ఎంతో మహిమ కలిగిన ఈ క్షేత్రాలను...
ఆలయ దర్శనం
ఏకాదశ రుద్రులుగా పేరు పొందిన ఈశ్వర రూపాల్లో... తొమ్మిది కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలంలో కొలువుతీరాయి. వాటిలో ఈశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. ఎంతో మహిమ కలిగిన ఈ క్షేత్రాలను సందర్శిస్తే పాపవిముక్తి, సద్గతి ప్రాప్తి కలుగుతాయనే విశ్వాసం ఉంది. వీటన్నిటిలో అత్యంత శక్తిమంతమైన క్షేత్రంగా వ్యాఘ్రేశ్వరంలోని శ్రీబాలాత్రిపురసుందరీ సమేత శ్రీవ్యాఘ్రేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఈశ్వరుడే వ్యాఘ్రరూపంలో...
స్థల పురాణం ప్రకారం... పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ అడవులనుంచి భక్తులు ప్రతిరోజూ శివపూజ కోసం బిల్వపత్రాలను (మారేడు దళాలను) తెచ్చుకొనేవారు. ఒకసారి మహా శివరాత్రి నాడు మారేడు దళాల కోసం ఒక పేద బ్రాహ్మణుడు ఆ అడవికి వెళ్ళాడు. అక్కడ అతణ్ణి ఒక పెద్ద పులి తరమడంతో... భయంతో పరుగులు పెడుతూ ప్రాణ రక్షణ కోసం ఒక మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ పులి చెట్టు కిందే కాచుకొని ఉంది. దాంతో చెట్టు దిగలేక, మరోవైపు శివరాత్రి మహా పుణ్యకాలం సమీపిస్తూ ఉండడంతో... ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కోసి, మంత్రాలు చదువుతూ పూజ నిర్వహించాడు. తెల్లవారిన తరువాత చూస్తే... ఆ చుట్టుపక్కల పులి కనిపించలేదు. ఈ వృత్తాంతాన్ని ప్రాంతాన్ని పాలించే పిఠాపురం రాజుకు అతను వివరించాడు. ఆ రాజు భటులను పంపించి, బ్రాహ్మణుడు పూజించిన మారేడు దళాలు గుట్టగా ఉన్న చోట తవ్వించగా... ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ ప్రదేశంలో ఒక శివలింగం బయటపడింది. మహా శివరాత్రి రోజున పరమశివుడే.. వ్యాఘ్రం
(పెద్ద పులి) రూపంలో వచ్చాడని అందరూ భావించారు. ఆ తరువాత రాజు కలలో శివుడు సాక్షాత్కరించి... ఆ వృత్తాంతాన్ని గుర్తు చేశాడు. అప్పుడు రాజు ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించి, నిత్య దీప ధూప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రాంతం ‘వ్యాఘ్రేశ్వరం’గా ప్రసిద్ధి చెందింది. నాటినుంచి నేటివరకూ ఇక్కడ వ్యాఘ్రేశ్వరుడిగా శివుడు పూజలందుకుంటున్నాడు.
ఇంటింటా ఆ పేరే...
ఈ ప్రాంతం వారు వ్యాఘ్రేశ్వరుణ్ణి తమ ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికీ ప్రతి కుటుంబం తమ ఇంట పుట్టిన ప్రథమ సంతానం పేరులో తప్పనిసరిగా ‘వ్యాఘ్రేశ్వర’ లేదా ‘వ్యాఘ్రి’ అనే పదాన్ని చేరుస్తారు. మరో విశేషం ఏమిటంటే... భక్తులు తమ కోర్కెలు తీరడం కోసం ఆలయ ప్రాంగణంలో ఒక కొబ్బరి మొక్కను నాటుతారు. అలా చేస్తే తాము కోరుకున్నవన్నీ నెరవేరుతాయని వారి విశ్వాసం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశి రోజు నుంచి ఆరు రోజులపాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వాటితోపాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీమదన గోపాలస్వామి కళ్యాణ వేడుకలను కూడా వైభవంగా నిర్వహిస్తారు.
సి.ఎన్. మూర్తి,
8328143489
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News