Share News

Munni Kaizer Inspirational Story: ఆమె ఆత్మస్థైర్యం ఎవరెస్టంత

ABN , Publish Date - Nov 17 , 2025 | 06:22 AM

కొన్ని కథలు వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అలాంటి కథే ఇది. ఐదు పదుల వయసులో... రొమ్ము క్యాన్సర్‌తో పోరాడి జయించారు. అరవైకి చేరువలో...

Munni Kaizer Inspirational Story: ఆమె ఆత్మస్థైర్యం ఎవరెస్టంత

స్ఫూర్తి

కొన్ని కథలు వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అలాంటి కథే ఇది. ఐదు పదుల వయసులో... రొమ్ము క్యాన్సర్‌తో పోరాడి జయించారు. అరవైకి చేరువలో... దృఢ సంకల్పంతో ఎవరెస్టు పర్వతాన్ని ముద్దాడారు. చికిత్స సమయంలో బాధను భరించలేక మరణమే శరణ్యమనుకున్న ఆమె... ఆ తరువాత ఆత్మస్థైర్యంతో నిలబడి... అసాధ్యమనుకున్నది సాధించారు. 58 ఏళ్ల విశాఖ ఉక్కు మహిళ మున్నీ కైజరేతో ‘నవ్య’ మాటామంతి.

‘‘జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకొంటుందో ఊహించలేం. చుట్టూ ప్రేమించే మనుషులు... దేనికీ లోటు లేని పరిస్థితులు... ఎంతో సంతోషంగా రోజులు సాగిపోతున్నాయని అనుకునేలోపు... ఓ కుదుపు. నాకు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. అది నన్నే కాదు, మా కుటుంబాన్నీ తీవ్రంగా కలచివేసింది. ఎన్నో నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. కానీ ఆ బాధ నుంచి బయటపడి మహమ్మారిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. మా సొంతూరు అమలాపురం. నా చిన్నప్పుడే మా కుటుంబం విశాఖపట్టణం వచ్చి స్థిరపడింది. అమ్మానాన్న వైద్యులు. విశాఖలోని ఆర్‌సీడీ, మానసిక ఆస్పత్రులకు సూపరింటెండెంట్లుగా పని చేశారు.

బాల్యంలోనే...

నా రొమ్ములో కణితి ఉన్నట్టు చిన్న వయసులోనే అమ్మ గుర్తించింది. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించేది. కణితిలో మార్పులు లేకపోవడంతో ఇబ్బందేమీ ఉండదని అమ్మానాన్న చెప్పారు. చదువు అయ్యాక నేవీలో పని చేసే ఉమే్‌షకు ఇచ్చి నా వివాహం జరిపించారు. తరువాత మాకు బాబు పుట్టాడు. వాడు ప్రస్తుతం మర్చంట్‌ నేవీలో సెకండ్‌ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. నేను కూడా టింపనీ స్కూల్‌లో టీచర్‌గా పని చేసేదాన్ని. మా అబ్బాయికి పెళ్లయిన తరువాత ఉద్యోగం మానేశాను. మావారు, కొడుకు, కోడలు... హాయిగా సాగిపోతోంది జీవితం. అయితే రొమ్ములో కణితిలో ఏవైనా తేడాలున్నాయా అని నిత్యం పరీక్షించుకొంటూ ఉండేదాన్ని. అలా 2017లో ఒకరోజు... పరిశీలిస్తుండగా ఏదో తేడాగా అనిపించింది. వైద్యుల్ని సంప్రతించగా, రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్టు నిర్థారించారు. రెండో దశలో ఉందని, శస్త్రచికిత్స చేయాలని అన్నారు. అంతేకాదు... ఐదేళ్లకు మించి బతికే అవకాశం లేదన్నారు. ఆ వాస్తవాన్ని తొలుత జీర్ణించుకోలేకపోయాను. ఇంట్లోవాళ్లు బాధలో మునిగిపోయారు. ఆ సమయంలో ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాను... ‘ఏది ఏమైనా సరే క్యాన్సర్‌ను జయించాలని’.


అదొక నరకయాతన...

చికిత్సకు ధైర్యంగా ముందడుగు వేశాను కానీ... వాస్తవానికి అదొక నరకయాతన. శస్త్రచికిత్స చేసి క్యాన్సర్‌ సోకిన రొమ్ము తొలగించారు. మూడు నెలలు రేడియేషన్‌. తొమ్మిది కీమోలు ఇచ్చారు. కీమో సమయంలో నరకయాతన అనుభవించాను. ఒక దశలో దానికంటే చనిపోవడం మంచిదని అనిపించింది. ఏడాదిన్నరపాటు చికిత్స సాగింది. ఈ వేదన నుంచి బయటపడాలని... దేవుడిని ప్రార్థించడం, వంట చేయడం, యోగా, ధ్యానం లాంటివాటిపై దృష్టి పెట్టాను. కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు అండగా నిలిచారు. అందరి సహకారంతో బలంగా నిలబడ్డాను. తీవ్రమైన కుంగుబాటు నుంచి కోలుకునే ప్రయత్నం చేశాను. చివరకు నా ప్రార్థనలు, పోరాటం ఫలించాయి. రెండేళ్ల తరువాత క్యాన్సర్‌ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడ్డాను.

ఆలోచన ఆలా పుట్టింది...

క్యాన్సర్‌కు చికిత్స సమయంలో డిస్కవరీ చానెల్‌ చూసేదాన్ని. అప్పుడు ఎవరెస్ట్‌ పర్వతారోహణ చేయాలన్న ఆలోచన కలిగింది. క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తరువాత స్నేహితురాలు యశోద సూచన మేరకు 2019లో బెంగళూరులో నిర్వహించిన గ్రాండ్‌మదర్‌ పోటీల్లో పాల్గొన్నా. అప్పటికే క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ వల్ల జుట్టు ఊడిపోయింది. అలాగే పోటీల్లో పాల్గొన్నాను. ద్వితీయ స్థానంలో నిలిచా. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ తరువాత ట్రెక్కింగ్‌కు వెళతానని మావాళ్లకు చెప్పాను. వద్దంటే వద్దన్నారు. ఎలాగోలా వారిని ఒప్పించాను. 2023లో ఉత్తరాఖండ్‌లోని దయాలా బుగ్యాలాలో తొలిసారి ట్రెక్కింగ్‌కు వెళ్లా. 13,500 ఎత్తులో ఉన్న శిఖరాన్ని అధిరోహించాను. ఈ క్రమంలోనే పూణెకు చెందిన ‘గిరి ప్రేమి ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో కొందరు మహిళలు ఎవరెస్ట్‌ పర్వతారోహణకు వెళుతున్నారని తెలిసింది. గత నెల మూడో తేదీన మరో ఐదుగురు మహిళలతో కలిసి ట్రెక్కింగ్‌ ప్రారంభించాను. దాదాపు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ వరకు వెళ్లాలనేది నా లక్ష్యం. 12వ తేదీ నాటికి అక్కడికి చేరుకున్నాం. 17న వెనక్కి వచ్చాం. అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. నా మనసు పులకించింది.


సమస్యలు ఎదురైనా...

ఎవరెస్టు బేస్‌క్యాం్‌పకు వెళ్లే క్రమంలో నాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. మధ్యలో ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడ్డాను. గడ్డ కట్టే చలిలో మంచు పర్వతంపై వేసే ప్రతి అడుగూ ఓ సవాలే. కానీ ఎలాగైనా సాధించాలన్న పట్టుదల నన్ను ముందుకు నడిపించింది. ఆత్మస్థైర్యంతో తోడు గైడ్లు, సహాయక సిబ్బంది సహకారంతో అనుకున్నది సాధించగలిగాను.

బి.శ్రీనివాసరావు, విశాఖపట్నం

ఫొటోలు: వై.రామకృష్ణ

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా...

ఎవరికైనా నేను చెప్పేది ఒక్కటే... జీవితంలో కష్టాలు సహజం. వాటికి భయపడి వెనకడుగు వేయవద్దు. ముఖ్యంగా క్యాన్సర్‌ బాధితులు మహమ్మారి సోకిందనగానే భయకంపితులైపోతారు. నేనూ అందుకు మినహాయింపు కాదు. కానీ త్వరగానే ఆ భయం నుంచి బయటకు వచ్చాను. యోగా, మెడిటేషన్‌, వ్యాయామం ప్రారంభించాను. వైద్యులు ఐదేళ్లే బతుకుతానని చెప్పారు. ఇప్పుడు క్యాన్సర్‌ నుంచి కోలుకుని ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ వయసులో ఎవరె్‌స్టను అధిరోహించాను. అందుకే ఆశ వదులుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో దేన్నయినా జయించవచ్చు.

ఇవి కూడా చదవండి..

కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..

లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 17 , 2025 | 06:22 AM