Share News

Kundalini Energy : కుండలినీ శక్తి నిజంగానే ఉందా?

ABN , Publish Date - Jan 23 , 2025 | 11:56 PM

జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాల్లో, సంభాషణలలో ‘చైతన్యం’ అతి ముఖ్యమైన అంశం. ‘యోగః చిత్త వృత్తి నిరోధః’ అని పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని నిర్వచించాడు. చైతన్యంలో పుట్టి, నిరంతరం చలనంలో ఉండే వృత్తుల్ని నిరోధించడాన్ని, అంటే... వాటిని అరికట్టే లేదా నిర్మూలించే సాధనను ‘యోగం’

 Kundalini Energy : కుండలినీ శక్తి నిజంగానే ఉందా?

జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాల్లో, సంభాషణలలో ‘చైతన్యం’ అతి ముఖ్యమైన అంశం. ‘యోగః చిత్త వృత్తి నిరోధః’ అని పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని నిర్వచించాడు. చైతన్యంలో పుట్టి, నిరంతరం చలనంలో ఉండే వృత్తుల్ని నిరోధించడాన్ని, అంటే... వాటిని అరికట్టే లేదా నిర్మూలించే సాధనను ‘యోగం’ అంటారని అర్థం. అయితే ‘చిత్తం అంటే ఏమిటి?’ అనే ప్రశ్నకు పతంజలి యోగసూత్రాల్లో మనకు జవాబు దొరకదు. ‘నేను ఎవరిని?’, ‘ఈ ప్రపంచం ఏమిటి?’ అనే రెండు మౌలికమైన ప్రశ్నలు అర్థం కావాలంటే... చైతన్యం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. కాబట్టి చిత్తం లేదా చైతన్యం ప్రాక్పశ్చిమ తత్త్వశాస్త్రాలలో అతి ముఖ్యమైన విషయం. మన అనుభవాలన్నిటికీ ఇదే రంగస్థలం. పాయసంలో రుచిని, గులాబీలో పరిమళాన్ని, వేణునాదంలో మాధుర్యాన్ని, ఉదయిస్తున్న సూర్యుడిలో రంగులను జ్ఞానేంద్రియాలు గ్రహిస్తున్నప్పటికీ... అవి అనుభవం అయ్యేది చైతన్యంలోనే. మన సంకల్పాలకు, ఆలోచనలకు, రాగద్వేషాలకు, సుఖదుఖాలకు, వినయం, మదం లాంటి గుణాలకు చైతన్యమే వేదిక. దీని పర్యాయ పదాలైన ‘మనసు, బుద్ధి, చిత్తం, హృదయం’ లాంటివి మన మాటల్లో తరచు దొర్లుతూ ఉంటాయి.


అది కేవలం ఒక మిష

ఆధ్యాత్మిక సాధన అంతా చైతన్యపరమైనదే. మనిషి చైతన్యంలో కుండలినీ అనే అనంతమైన శక్తి ఒకటి ఉంటుంది, దాన్ని సాధన ద్వారా మేల్కొల్పవచ్చునని మన సంప్రదాయం చెబుతోంది. ‘‘కుండలినీ శక్తి నిజంగానే ఉంటుందా?...’’ కృష్ణమూర్తితో జరిపిన సంభాషణల్లో పుపుల్‌ జయకర్‌ లాటి మేధావులు ఈ ప్రశ్న వేశారు. ‘‘అవును, చైతన్యంలో అనంతమైన, నిత్యనూతనమైన, అక్షయమైన శక్తి ఒకటి ఉంటుంది’’ అనేది కృష్ణమూర్తి జవాబు. ‘‘అయితే మనకు అనంతమైన ఈ చైతన్యంలో ఒక చిన్న భాగం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ‘నేను’ అనే అహంభావం, అది సృష్టించిన ‘నేను-నువ్వు’ అనే విభజన (అంటే ద్వైతం), ఆ ‘నేను’ చుట్టూ పేరుకున్న కుహనా మనుగడ... ఇవన్నీ చైతన్యాన్ని ఆవరిస్తాయి. అందువల్ల మనకు మన చైతన్యం సంపూర్ణంగా అందుబాటులో ఉండదు. చైతన్యాన్ని శుభ్రపరిస్తే ఈ శక్తి మేలుకొనే అవకాశం ఉంటుంది. సంప్రదాయం చెప్పే సాధన అందుకు పనికిరాదు’’ అంటారు కృష్ణమూర్తి. అబద్ధాలు, అవినీతి, అసూయ లాంటి వాటితో నిండిన జీవితాన్ని గడుపుతూ కుండలినీ శక్తిని మేల్కొల్పాలనే ఉద్దేశం హాస్యాస్పదం, కేవలం ఆధ్యాత్మిక వ్యాపారానికి ఒక మిష. చైతన్యాన్ని సంపూర్ణంగా శుభ్రపరచడం ఒక్కటే ఈ శక్తిని మేలుకొలుపగలిగే మార్గం. అంటే దానిలో ఎలాటి ఆలోచనలకు, జ్ఞాపకాలకు... అంటే గతంతో ముడిపడిన అనుభవాలకు, సంకల్పాలకు, మంత్రాలకు, ఉపదేశాలకు, జపాలకు (ఇవన్నీ ఆలోచనల ప్రతిరూపాలే)... చివరకు ‘కుండలినీ శక్తిని మేలుకొలపాలి’ అనే ఆలోచనకు కూడా తావు లేకుండా చూడాలి.

నిరంతర ప్రక్రియ

చైతన్యాన్ని శుభ్రపరిచే ఈ ప్రక్రియను ‘ధ్యానం’ (మెడిటేషన్‌) అంటారు కృష్ణమూర్తి. ఈ ధ్యానం పక్షమో, మాసమో, ఆరునెలలో చేసే పునశ్చరణ కాదు. ఇది 24 గంటలూ నిర్విరామంగా, అత్యంతమైన అప్రమత్తతతో జరిగే మానసిక ప్రక్రియ. చైతన్యాన్ని సంపూర్ణంగా శుభ్రపరచడం వరకే మన ప్రయత్నం పరిమితమై ఉంటుంది. కుండలినీ శక్తి తాలూకు జాగృతి మన చేతిలో ఉండదు. ఇంటిని శుభ్రం చేసి కిటికీలు, తలుపులు తెరిస్తే గాలి లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. గాలిని మనం నిర్బంధించలేం. కుండలినీ శక్తి కూడా అంతే.

గుంటూరు వనమాలి

Updated Date - Jan 23 , 2025 | 11:56 PM