ఉలూచి ప్రాణదాతే కానీ
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:43 AM
మహాభారతంలో ఉలూచి (ఉలూపి) పాత్రచిత్రమైనది. ఆమె పాతాళలోకంలో నాగులకు రాజైన కౌరవ్యుడి కూతురు. అర్జునుడి తీర్థయాత్రల సమయంలో ఈ పాత్ర పరిచయం అవుతుంది. పాండవులు...
తెలుసుకుందాం
మహాభారతంలో ఉలూచి (ఉలూపి) పాత్రచిత్రమైనది. ఆమె పాతాళలోకంలో నాగులకు రాజైన కౌరవ్యుడి కూతురు. అర్జునుడి తీర్థయాత్రల సమయంలో ఈ పాత్ర పరిచయం అవుతుంది. పాండవులు ఒక నియమం పెట్టుకుంటారు. వారిలో ఎవరైనా ద్రౌపదితో ఏకాంతంగా ఉండగా... మిగిలినవారు ఆ వైపు వెళ్ళకూడదు. ఏ కారణంగానైనా ఆ నియమాన్ని ఉల్లంఘించినట్టయితే... నిర్ణీతకాలం తీర్థయాత్రలు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ధర్మరాజు, ద్రౌపది ఏకాంతంలో ఉండగా... ఆర్త రక్షణ కోసం తన విల్లమ్ములు తీసుకోవడానికి ఆ మందిరంలోకి అర్జునుడు ప్రవేశించక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. అందుకు పరిహారంగా అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అతను గంగానదిలో స్నానం చేస్తూ ఉండగా... నాగకన్య అయిన ఉలూచి అతడి కాలు పట్టుకొని పాతాళానికి లాక్కుపోతుంది. తనను పెళ్ళాడమని అర్జునుణ్ణి ప్రాధేయపడుతుంది. మొదట అర్జునుడు నిరాకరించినా... ఆమె అతణ్ణి ఒప్పించి వివాహం చేసుకుంటుంది. కొన్నాళ్ళకు అర్జునుడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వారికి ఇరావంతుడనే కొడుకు జన్మిస్తాడు. అతను మహాభారత యుద్ధంలో మరణిస్తాడు.
అర్జునుడి పాపం...
ఒక రోజు ఉలూచి గంగానదిలో స్నానానికి వస్తుంది. అక్కడికి వసువులు వచ్చి, గంగాదేవితో మాట్లాడడం గమనిస్తుంది. తమ వసువుల్లో ఒకరు శాపవశాత్తూ గంగాపుత్రుడైన భీష్ముడిగా జన్మించి... భారత యుద్ధంలో సాధించిన విజయాలను వారు వివరిస్తూ ఉంటే... శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముణ్ణి అర్జునుడు చంపాడని గంగాదేవి ఆవేదన చెందుతుంది. అప్పుడు వసువులు ‘‘నీవు ఆజ్ఞాపిస్తే అర్జునుణ్ణి శాపంతో భస్మం చేస్తా’’మంటారు. అందుకు గంగాదేవి సమ్మతిస్తుంది. ఆ మాటలు విన్న ఉలూచి పరుగుపరుగున పాతాళలోకానికి వెళ్ళి, అర్జునుణ్ణి కాపాడాలని తన తండ్రిని కోరుతుంది. కౌరవ్యుడు ఆమెతో కలిసి వసువుల దగ్గరకు వస్తాడు. తన కుమార్తెకు పతిభిక్ష పెట్టాలని కోరుతాడు. వారి వేదనను చూసి కరిగిపోయిన వసువులు ‘‘మేము ఊరుకున్నా అర్జునుణ్ణి ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది. అతను నరకానికి వెళ్ళక తప్పదు.
అర్జునుడు తన కుమారుడి చేతిలో మరణించడమే పాపపరిహారం’’ అంటారు. భారత యుద్ధం తరువాత... అర్జునుడికి మిగిలిన కుమారుడు బభ్రువాహనుడు మాత్రమే. అర్జునుడు-చిత్రాంగదల కుమారుడైన అతను మణిపుర రాజ్యానికి పాలకుడు. అతనికీ, అర్జునుడికీ మధ్య యుద్ధం జరిగే సందర్భం కోసం ఉలూచి నిరీక్షిస్తూ ఉంటుంది.
యుద్ధానికి ప్రేరేపించి...
కొన్నాళ్ళకు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తాడు. యాగాశ్వ రక్షణ కోసం దాని వెంట బయలుదేరిన అర్జునుడు.. మణిపుర రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఇది తెలుసుకున్న బభ్రువాహనుడు తండ్రికి స్వాగతం చెప్పడానికి వెళతాడు. అతణ్ణి అర్జునుడు ఎగతాళి చేస్తాడు. వెనుతిరిగి వస్తున్న బభ్రువాహనుణ్ణి ఉలూచి కలుసుకుంటుంది. యాగాశ్వాన్ని బంధించి, వాటి వెనుక వచ్చినవారిని జయించడమే రాజ ధర్మం అని చెప్పి, అర్జునుడితో యుద్ధం చేయమంటుంది. అప్పుడు బభ్రువాహనుడు యుద్ధానికి దిగి, అర్జునుణ్ణి ఓడిస్తాడు. అతను సంధించిన ఒక అస్త్రం అర్జునుడి ప్రాణాలు తీస్తుంది. ఈ సంగతి తెలిసిన చిత్రాంగద రణరంగానికి చేరుకొని విలపిస్తూ ఉంటుంది. అప్పుడు ఉలూచి వచ్చి... తన దగ్గర ఉన్న మృతసంజీవనీ మణితో అర్జునుణ్ణి బతికిస్తుంది. అర్జునుడి పాపపరిహారం కోసం తపించిన ఉలూచి... సవతి కొడుకును భర్త ప్రాణాలు తీయడానికి ప్రేరేపించి, ఆ తరువాత భర్తను బతికించి... తన ఆశయాన్ని నెరవేర్చుకుంది.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News