Types of Deity Idols in Temples: అచలం చలం చలాచలం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:37 AM
ప్రతిమ, విగ్రహం, బింబం, బేరం, మూర్తి... ఇవన్నీ సమానార్థకాలు. ఆలయంలోని దేవతామూర్తిని వివిధ సందర్భాల్లో అనేక పేర్లతో పిలుస్తారు. దేవతా ప్రతిమలలో అచలం, చలం, చలాచలం అనే మూడు రకాలు...
తెలుసుకుందాం
ప్రతిమ, విగ్రహం, బింబం, బేరం, మూర్తి... ఇవన్నీ సమానార్థకాలు. ఆలయంలోని దేవతామూర్తిని వివిధ సందర్భాల్లో అనేక పేర్లతో పిలుస్తారు. దేవతా ప్రతిమలలో అచలం, చలం, చలాచలం అనే మూడు రకాలు ఉన్నాయి. అంటే కదలనివి, కదిలేవి, కదలీకదలనివి.
అచల బింబాలు: దేవాలయ గర్భగృహంలో విగ్రహాలను స్థిరంగా ప్రతిష్ఠిస్తారు. అవి కదలకుండా విగ్రహానికి, పీఠానికి మధ్య అష్టబంధనద్రవ్యంతో బిగిస్తారు. ఈ విగ్రహాలను ‘అచల బింబాలు’ అని అంటారు. పెద్ద పెద్ద బండలపై చెక్కిన విగ్రహాలను, మట్టి, సున్నంతో చేసి, కదలడానికి వీలులేకుండా చేసిన విగ్రహాలను కూడా ‘అచల విగ్రహాలు’ అని పిలుస్తారు.
చల బింబాలు: ఆలయంలో విగ్రహం స్థిరంగా ఉంటే... ఉత్సవ సమయాల్లో వాహనాల మీద మాడ వీధుల్లోకి, గ్రామ, పుర వీధుల్లోకి భక్తులను అనుగ్రహించడానికి వచ్చేవి ఉత్సవ మూర్తులు. ఈ ఉత్సవ విగ్రహాలకు ‘చల బింబాలు’ అని పేరు.
చలాచల బింబాలు: ‘చలాచలం’ అంటే ‘కదలీకదలనివి’ అని అర్థం. ‘అలాంటి విగ్రహాలు కూడా ఉంటాయా?’ అనే సందేహం, కాస్త ఆశ్చర్యం కలగడం సహజం. కొన్ని ఆలయాలలో ప్రత్యేకించి ఉత్సవ విగ్రహాలు ఉండవు. గర్భాలయంలో స్థిరంగా ఉండి పూజలు అందుకొనే మూల విగ్రహాలనే... ఉత్సవ సమయంలో ఆలయం బయటికి తీసుకువచ్చి ఊరేగిస్తారు. ఉత్సవం ముగిశాక.. ఆ విగ్రహాలు మళ్ళీ గర్భాలయంలోకి వెళ్ళి, మూల స్థానంలో స్థిరంగా నిలిచి... నిత్య పూజలు అందుకుంటాయి. అలాంటి విగ్రహాలకు ‘చలాచల బింబాలు’ అని పేరు. పూరీలోని జగన్నాథస్వామి, బలదేవుడు, సుభద్రాదేవి విగ్రహాలు దీనికి చక్కని ఉదాహరణ.
ఇక దేవతా విగ్రహాలు వాటి ఆకృతిని బట్టి సాత్త్వికాలు, రాజసాలు, తామసాలు అని మూడు రకాలుగా ఉంటాయి. ఎత్తు ప్రకారం కూడా వాటిని మూడు రకాలుగా విభజించారు. ఏడు తాళాల (ఏడు అరచేతి హస్తాల పరిమాణం) వరకూ ఉన్న వాటిని ‘వామనములు’ అని, ఎనిమిది తాళాల వరకూ ఉన్న వాటిని ‘మానుషములు’ అని, తొమ్మిది తాళాలు, అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్నవాటిని ‘దైవికములు’ అని చెప్పారు.
విగ్రహాలను ఏ ద్రవ్యాలతో తయారు చేస్తే ఏ ఫలితాలను ఇస్తాయో ‘అగ్ని పురాణం’ వివరిం చింది. మృన్మయాద్దారుజే పుణ్యం దారుజాదిష్టకోద్భవే ఇష్టకోత్థాచ్ఛైలజే స్యాద్ధేమాదేరధికం ఫలమ్ మట్టితో చేసిన ప్రతిమకన్నా దారువుతో (కర్రతో) చేసిన ప్రతిమ శ్రేష్టం. దారువుతో చేసిన దానికన్నా ఇటుకతో చేసినది, ఇటుకతో చేసిన దానికన్నా రాయితో చేసినది, రాతితో చేసిన దానికన్నా సువర్ణాది లోహాలతో చేసిన ప్రతిమలు శ్రేష్టమైన పలితాలను ఇస్తాయి.
డి.యన్.వి. ప్రసాద్, స్థపతి
9440525788
ఈ వార్తలు కూడా చదవండి..
పేలిన వాషింగ్ మిషన్.. ఉలిక్కిపడ్డ ప్రజలు
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం