Share News

Women Empowerment:బాధ్యతల స్టీరింగ్‌ పట్టారు...

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:50 AM

బతుకు బండి నడిపించడానికి స్టీరింగ్‌ పట్టారు ఇద్దరు పేద మహిళలు. ఒకరు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంటే... మరొకరు పండ్లు, కూరగాయలను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. నిత్యం ఎన్నో సమస్యలు, సవాళ్లు, చులకన మాటలు...

Women Empowerment:బాధ్యతల స్టీరింగ్‌ పట్టారు...

భర్తకు చేదోడువాదోడుగా ఒకరు... కట్టుకున్నవాడి ఆదరణకు నోచుకోక బాధ్యతలు భుజానకెత్తుకొని మరొకరు... బతుకు బండి నడిపించడానికి స్టీరింగ్‌ పట్టారు ఇద్దరు పేద మహిళలు. ఒకరు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంటే... మరొకరు పండ్లు, కూరగాయలను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. నిత్యం ఎన్నో సమస్యలు, సవాళ్లు, చులకన మాటలు... వేటికి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసమే అండగా ప్రయాణం సాగిస్తున్నారు... సూర్యాపేట జిల్లాకు చెందిన పగిళ్ల సైదమ్మ , పిట్టల కళమ్మ.

భారం తగ్గించాలని...

పగిళ్ల సైదమ్మది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామం. భర్త, పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. సైదమ్మ భర్త లింగయ్య హోంగార్డుగా పని చేసేవాడు. వీరికి కుమారుడు సందీప్‌, కుమార్తె స్వప్న ఉన్నారు. కొన్నాళ్ల క్రితం భర్త లింగయ్య అనారోగ్యంతో విధులకు హాజరుకాలేకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో అతను అప్పు చేసి, ఒక కారు కొన్నాడు. దానిద్వారా వచ్చే సంపాదన ఏ మూలకూ సరిపోయేది కాదు. అదే సమయంలో కూతురు పెళ్లి చేశారు. దాంతో ఆ కుటుంబం ఆర్థికంగా మరింత చితికిపోయింది. తన తండ్రికి కొంతైనా భారం తగ్గించాలని కొడుకు సందీప్‌ నిర్ణయించుకున్నాడు. ఫైనాన్స్‌ తీసుకొని... తుఫాన్‌ వాహనం కొన్నాడు. అతడికీ వివాహమైంది. తండ్రీకొడుకులకు వచ్చే ఆదాయంతో కుటుంబం గడవడం కష్టం కావడంతో... పరిస్థితులు సైదమ్మకు నిద్ర పట్టనివ్వలేదు. ఏంచేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆమె దృష్టి ఇంట్లో ఉన్న తుఫాన్‌ వాహనంపై పడింది.

కొడుకుతో డ్రైవింగ్‌కు వెళ్లి...

సందీప్‌ డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకున్నప్పుడు సైదమ్మ కూడా అతడి వెంట వెళ్లేది. క్రమంగా తను కూడా డ్రైవింగ్‌ నేర్చుకుంది. ఆ తరువాత లైసెన్స్‌ తెచ్చుకుంది. కుటుంబ భారం పంచుకోవాలనే ఉద్దేశంతో వాహనం నడుపుతోంది. గతంలో ఇంట్లో విస్తరాకులు తయారు చేసి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు తమకున్న వ్యాన్‌లో తీసుకెళ్లి విక్రయించేది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత విస్తరాకుల వ్యాపారం నడవలేదు. దీంతో రోజూ ఉప్పల్‌ నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం వరకు తుఫాన్‌ వాహనం నడుపుతోంది. ఆమె రోజూ ఒక ట్రిప్పు మాత్రమే వెళ్తుంది. ఒక ట్రిప్పుకు డీజిల్‌ ఇతర ఖర్చులు పోను రెండు వేల నుంచి రెండున్న వేల రూపాయల వరకు మిగులుతున్నాయి.


అడ్డుకోవాలని చూసినా..

ఉప్పల్‌లోని వాహనాల అడ్డా వద్ద కొంతమంది మగవారు సైదమ్మను అడ్డుకోవాలని చూశారు. మహిళ కాబట్టి వాహనం నడపవద్దంటూ చులకన చేసేవారు. ఉప్పల్‌ అడ్డా మీదకు వాహనం తీసుకుని రావద్దని చెప్పేవారు. అయినా వెనక్కి తగ్గకుండా రోజూ వాహనం తీసుకువెళ్లి, ప్రయాణికులను ఆమె క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. క్రమంగా పరిస్థితులు మారాయి. హేళనలు తగ్గాయి. ఇక వాహనంలో చిన్నచిన్న రిపేర్లు వస్తే తనే సరిచేసుకుంటుంది. టైర్‌ పంక్చర్‌ అయినా వేరొకరి సాయం లేకుండా మార్చేసుకొంటుంది.

క్షణం తీరిక దొరకదు...

తెల్లవారుతూనే నిద్ర లేచింది మొదలుపడుకోబోయేవరకు సైదమ్మకు క్షణం తీరిక ఉండదు. ఇంటి పనులు చేసుకుని తనతో పాటు భర్తకు మఽధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఉప్పల్‌ చౌరస్తా వద్దకు వాహనాన్ని తీసుకుని వెళుతుంది. అక్కడ వరుసలో వాహనాన్ని నిలుపుతుంది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే కాసేపటికే బండి నిండుతుంది. వారిని తిరుమలగిరికి తీసుకెళ్తుంది. అక్కడే భోజనం చేసి, వరుసలో తన వంతు రాగానే... ప్రయాణికులతో సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఇంటికి వెళ్లాక రాత్రి పడుకోబోయేవరకు పని చేస్తూనే ఉంటుంది.

సిరికొండ సైదులు,


సూర్యాపేట ఒంటరి మహిళగా...

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండల కేంద్రానికి చెందిన పిట్టల కళమ్మది భిన్నమైన కథ. ఆమెకు కొడుకు, కూతురు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకు ఆమె భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఒంటరి మహిళగా ఈ కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలనే బాధ కళమ్మను వేధించింది. దిక్కుతోచని స్థితిలో నూతనకల్‌లోనే కూరగాయలు, పండ్ల వ్యాపారం ప్రారంభించింది. కొడుకు గణేష్‌ను, కూతురు గౌతమిని సూర్యాపేటలోని ప్రైవేట్‌ కళాశాలలో చేర్పించి చదివించింది. తనలా తన పిల్లలు ఇబ్బందులు పడకూడదని, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని పట్టుదలగా వారిని చదివిస్తోంది.

ఇబ్బందులు ఎదురైనా...

వేరే ప్రాంతాలకు వెళ్లి కూరలు, పండ్లు విక్రయించాలంటే ఒక వాహనం కావాలి. దాని కోసం ఒక వాహనం కొని, డ్రైవర్‌ను నియమించింది కళమ్మ. చాలా సందర్భాల్లో సమయానికి డ్రైవర్లు డ్యూటీకి వచ్చేవారు కాదు. ఆ ప్రభావం వ్యాపారం మీద పడేది. తరచూ ఇలా జరుగుతుండటంతో తనే వాహనం నడపడం నేర్చుకుంది. పూర్తి నైపుణ్యం సాధించాక డ్రైవర్లను తొలగించి, స్వయంగా వాహనం నడపడం మొదలుపెట్టింది. రోజూ సూర్యాపేట, హైదరాబాద్‌, ఖమ్మం పట్టణాలకు వెళ్లి అక్కడ హోల్‌సేల్‌గా కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తుంది. ఆ సరుకును నూతనకల్‌కు తరలిస్తుంది. అక్కడి దుకాణాల్లో వాటిని విక్రయిస్తుంటుంది. అంతేకాదు... సమీప ప్రాంతాలకు వెళ్లి అమ్మకాలు కూడా సాగిస్తుంది.


అన్నీ తానై...

ఏ తోడూ లేకపోయినా ఇంటి పని, డ్రైవింగ్‌, వ్యాపార లావాదేవీలన్నీ కళమ్మ ఒక్కతే చూసుకొంటోంది. పేదరికంతో తన పిల్లలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అహర్నిశలూ కష్టపడుతోంది. ఆశించిన మేర వ్యాపారం సాగడంలేదని, ప్రభుత్వం తనలాంటి మహిళలకు రుణాలు అందించి ప్రోత్సాహించాలని ఆమె కోరుతోంది.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Updated Date - Feb 24 , 2025 | 04:50 AM