Share News

అధ్యయనం చేయకుండానే రాసేస్తున్నారు!

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:41 AM

మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తూ కూడా తెలుగుపై మమకారంతో భాషాసేవ చేసేవారందరో! అలాంటి వారిలో డాక్టర్‌ తుర్లపాటి రాజేశ్వరి ఒకరు. ఒడిశాలోని బరంపురంలో...

అధ్యయనం చేయకుండానే రాసేస్తున్నారు!

మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తూ కూడా తెలుగుపై మమకారంతో భాషాసేవ చేసేవారందరో! అలాంటి వారిలో డాక్టర్‌ తుర్లపాటి రాజేశ్వరి ఒకరు. ఒడిశాలోని బరంపురంలో నివసిస్తున్న రాజేశ్వరి... జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాఽథ్‌ మహంతి ఒడియాలో రాసిన ‘దాడి బుధా’ అనే నవలను ‘ఈతచెట్టు దేవుడు’ పేరిట అనువదించారు. ఈ నవలకు తాజాగా కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఈ నేపథ్యంలో రాజేశ్వరిని ‘నవ్య’ పలకరించింది.

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు లభించినందుకు అభినందనలు...

కృతజ్ఞతలు. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 50 ఏళ్ల నుంచి రాస్తున్నాను. అనేక అవార్డులు కూడా వచ్చాయి. అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం చిన్న విషయం కాదు. ఈ నా ప్రయాణంలో నా కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు.

ఈ అవార్డు రావటంలో పరోక్షంగా వారి సహకారం కూడా ఉంది.


మీరు కొన్ని స్వతంత్ర రచనలు చేశారు.. అనువాదాలూ చేశారు. ఈ రెండింటిలో ఏది కష్టం?

నా అనుభవంలో అనువాదమే కష్టమనిపిస్తుంది. ఎందుకంటే - కొన్ని ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభవాల సమాహారమే స్వతంత్ర రచన. వీటికి అనుగుణంగానే మన రచన సాగుతుంది. కానీ అనువాదంలో ఇంకో రచయిత ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభవాలను ఆవాహన చేసుకోవాలి. వాటిని మన భాషలోకి తీసుకురావాలి. మూల రచన భావం చెడకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మూల రచనలో పూర్తిగా నిమగ్నమైపోవాలి. మూల రచయిత భావనలలోనే బతకాలి. చాలా సందర్భాలలో అనువాద రచన పూర్తయినా... ఆ పాత్రలు ఇంకా వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు అవార్డు వచ్చిన ‘ఈతచెట్టు దేవుడు’నే తీసుకుందాం. ఈ నవలలోని పాత్రలు చాలా లోతుగా ఉంటాయి. దీని రచన పూర్తయిన కాలం ఆ పాత్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే మూల రచన ఒడియా పాఠకులకు అంత దగ్గరయింది.

22-Navya.jpg

తెలుగు, ఒడియా సాహిత్యాల మధ్య ఉన్న సామ్యమేమిటి?

తెలుగు, ఒడియాలు మాత్రమే కాదు. ఇతర భారతీయ భాషా సాహిత్యంలో కూడా చాలా పోలికలు ఉంటాయి. భాషపరంగా ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. కానీ సామాజికంగా అనేక విషయాలు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకు మనం తెలుగు ఆధునిక సాహితీ యుగానికి గురజాడను యుగకర్తగా చెప్పుకుంటాం కదా! గురజాడ జీవించిన సమయంలో ఒడియాలో ఫకీర్‌ మోహన్‌ సేనాపతి అని ఒక రచయిత ఉండేవారు. ఆయనను ఒడియా సాహితీ దిగ్గజంగా చెప్పుకోవచ్చు. ఆయన ‘రేవతి’ అనే ఒక కథ రాశారు. ఈ కథలో చిన్న చిన్న అమ్మాయిలను ముసలివాళ్లకు ఇచ్చి పెళ్లిచేయటం, డబ్బుల కోసం అమ్మాయిలను అమ్ముకోవటం ప్రధానమైన అంశాలు. గురజాడ ‘కన్యాశుల్కం’లోని పాత్రల లాంటివే దీనిలో కూడా ఉంటాయి. వాస్తవానికి భాషాపరంగా తెలుగుకు, ఒడియాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో ఒకే రకమైన దురాచారాలు ఉన్నాయి. వాటిపై రచయితలు స్పందించారు. కేవలం ఈ రెండు భాషల్లోనే కాదు. ఇతర భాషాల్లో రచయితలు కూడా ఈ తరహా దురాచారాలపై స్పందించే ఉంటారు.


ప్రస్తుతం తెలుగు భాష వ్యాప్తి మీద మీ అభిప్రాయమేమిటి?

మంచి కృషి జరుగుతోంది. జరగటం లేదని చెప్పలేం. కానీ ఈ తరం వాళ్లు తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి దూరం అవుతున్నారనేది నా అభిప్రాయం. గత మూడు దశాబ్దాలుగా తెలుగు చదివేవారి సంఖ్య తగ్గుతోంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు కాన్వెంట్స్‌లో చదువుతున్నారు. దీని వల్ల తెలుగు చదివేవారి సంఖ్య, రాసేవారి సంఖ్య తగ్గిపోతోంది. నా ఉద్దేశంలో ప్రస్తుతం ఎక్కువగా తెలుగు చదివేవారు 50లు దాటినవారే! ఎక్కువ మంది చదవకపోవటం వల్ల మంచి సాహిత్యం రావటం లేదు. అదే సమయంలో సాహితీపరంగా లోతైన అధ్యయనం చేసేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొద్దిమంది చేస్తున్నారు. కానీ అది ప్రభావవంతంగా, సంతృప్తికరంగా ఉండటం లేదు. నా ఉద్దేశంలో పాతను ఎప్పుడూ మనం గౌరవించాలి. పాత మన భవిష్యత్తుకు పునాదిలాంటి. అందుకే తెలుగు సాహిత్యంలో ఉన్న రామాయణ, భారత, భాగవత గ్రంథాలతో పాటు ఇతర సాహిత్యాన్ని కూడా చదవాలి. ఆ గ్రంథాలలో ఉన్న మంచిని గ్రహించాలి. మంచిని గ్రహించాలంటే ముందు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయటానికి బాగా చదవాలి. ఇప్పుడు కొందరు అధ్యయనం చేయకుండా రాసేస్తున్నారు. ఈ విషయం తలుచుకున్నప్పుడు బాధగా అనిపిస్తుంది.

ఫ సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఈ వార్తలు కూడా చదవండి:

Soundarya husband Raghu: ఆ విషయంపై నిజమేంటో తేల్చి చెప్పిన సౌందర్య భర్త..

KTR Drone Flying Case: కేటీఆర్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ.. అసలు విషయం ఇదే..

Updated Date - Mar 13 , 2025 | 12:41 AM