Nirmaladevi : ఆత్మ స్వాతంత్య్రం కోసం పోరాడాలి
ABN , Publish Date - Jan 23 , 2025 | 11:49 PM
భారత దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు జనవరి 26. దీని వెనుక ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల అవిరళ కృషి ఉంది. అటువంటివారిలో మాతాజీ నిర్మలాదేవి ఒకరు. ఆమె కుటుంబం మొత్తం స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంది. నిర్మలాదేవి తండ్రి ప్రసాదరావు
భారత దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు జనవరి 26. దీని వెనుక ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల అవిరళ కృషి ఉంది. అటువంటివారిలో మాతాజీ నిర్మలాదేవి ఒకరు. ఆమె కుటుంబం మొత్తం స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంది. నిర్మలాదేవి తండ్రి ప్రసాదరావు సాల్వే అప్పటి రాజ్యాంగ రచనా కార్యంలో చురుగ్గా పాలు పంచుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత... పార్లమెంట్ సభ్యునిగా సేవలు అందించారు.
జైల్లో చిత్రహింసలు...
నిర్మలాదేవి బాల్యంలో మహాత్మాగాంధీ ఆశ్రమంలో ఉండేవారు. ఆమెకు నేపాలీల్లా చిన్ని చిన్ని కళ్ళు ఉండడంతో... గాంధీ మహాత్ముడు ఆమెను ముద్దుగా ‘నేపాలీ’ అని పిలిచేవారు. ఆశ్రమంలో పాడుకొనే ప్రార్థనా గీతాలను ‘భజనావళి’ పేరిట ఒక పుస్తకంగా ఆయన రూపొందించారు. ఆ సమయంలో... నిర్మల సలహా ప్రకారం... ఆ గీతాలను మన సూక్ష్మ శరీరంలోని చక్రాలు ఏ క్రమంలో ఉంటాయో... అదే క్రమంలో పొందుపరిచారు. చిన్నారి నిర్మలతో ఆయన అనేక విషయాలు చర్చించడం చూసి మిగిలినవారు ఆశ్చర్యపోయేవారు. అప్పుడు గాంధీ మహాత్ముడు ‘‘ఒక్కొక్కసారి పెద్దవారి కన్నా చిన్న పిల్లల నుంచే సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది అనేవారు. అలాంటి గొప్ప నాయకుల మధ్య పెరిగిన నిర్మల... వారి అడుగుజాడల్లో నడిచారు. ఆమె తండ్రి ప్రసాదరావు ఆ రోజుల్లో నాగపూర్‌లో పేరు ప్రఖ్యాతులున్న మేజిస్ట్రేట్. ఖుర్‌ఆన్‌ను మరాఠీ భాషలో అనువదించిన పండితుడు. పెద్ద బంగళాలలో నివసించే వారి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో ఆస్తులన్నీ త్యాగం చేయడం వల్ల... పూరిళ్ళలో నివసించాల్సి వచ్చింది. తల్లితండ్రులిద్దరూ జైలుకు వెళితే... ఇంటి బాధ్యతలను నిర్మల స్వీకరించారు. ఆమె లాహోర్ మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు... క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా... కాలేజీ మీద భారత జెండాను ఎగురవేశారు. దీనితో కాలేజీ నుంచి ఆమెను బహిష్కరించారు. నాగపూర్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ధర్నా చేసి అరెస్టయ్యారు. జైలులో ఆమెను అక్కడి అధికారులు చిత్రహించలు పెట్టారు. విద్యుత్ షాక్ ఇచ్చారు, మంచు గడ్డల మీద పడుకోబెట్టారు. అయినా ఆమె ఉద్యమాన్ని విడిచి పెట్టలేదు. గ్రామ గ్రామానికీ తిరిగి రహస్యంగా కరపత్రాలు పంచిపెట్టేవారు. గ్రామీణ ప్రజలను స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేలా చైతన్యపరిచేవారు.
ఆధ్మాత్మికతకు అనుకూలం
ఆ తరువాత సహజయోగ ధ్యానపద్ధతిని ప్రవేశపెట్టారు. మానవులలో కుండలినీ శక్తిని జాగృతం చేసి, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించడానికి అనేక దేశాల్లో పర్యటించారు. ఎక్కడికి వెళ్ళినా మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం గురించి చెప్పేవారు. ‘‘యోగాకు పుట్టినిల్లు మన భారతావని. ఎందరో మహనీయులు నడయాడిన నేల మనది. ఇక్కడ ఎన్నో భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, వృత్తులు ఉన్నా... ప్రతి ఒక్కరూ తమ జీవిత చరమాంకంలో భగవంతుణ్ణి చేరుకోవాలనే అభిలషిస్తారు. మన దేశ ఆధ్యాత్మికతకు అనుకూలమైనది. అలాగే భారతీయ సంగీతం ఆధ్యాత్మికపరంగా ప్రశస్తమైనది. హిందుస్తానీ సంగీతమైనా, కర్ణాటక సంగీతమైనా... వాటిలోని రాగాలు మన సూక్ష్మశరీరంలో ఉండే వివిధ చక్రాలను లేదా శక్తి కేంద్రాలను చైతన్యతరంగాల ద్వారా శుద్ధి చేస్తాయి. కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి భారతీయ సంగీతం కన్నా అనుకూలమైనది మరొకటి లేదు’’ అని నిర్మలాదేవి చెప్పారు. ఆమె దగ్గర సంగీత కచ్చేరీలు చేయడానికి వచ్చిన చాలామంది... కుండలినీ శక్తి జాగృతి చెందిన అనుభూతి పొంది... సహజ యోగంలో స్థిరపడ్డారు.
అందరికీ ఆత్మసాక్షాత్కారమే లక్ష్యం
‘‘మనల్ని సృష్టించిన పరమాత్మను ప్రస్తుతించడమే ఏ కళకైనా పరమావధి. మన ఆలయాలు అద్భుతమైన శిల్పకళకు నిలయాలు. మన నృత్య రీతులు... నాట్యం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవడానికి రూపొందినవి. మన సాహిత్యంలో భక్తికి, కరుణరసానికి ప్రాధాన్యం ఎక్కువ ఇన్ని రకాలుగా ఆధ్యాత్మికతకు అనువైన ఈ దేశంలో జన్మించడానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి’’ అని చెప్పేవారు నిర్మలాదేవి. ‘‘ఆ రోజుల్లో మేము దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాం. ఇప్పుడు మీరు మీ ఆత్మ స్వాతంత్య్రం కోసం పోరాడాలి. మీ ఆత్మను అరిషడ్వర్గాలు, అహంకార, ప్రత్యహంకారాలు ముక్తిని పొందకుండా నిరోధిస్తున్నాయి. వాటి బానిసత్వం నుంచి బయటకు రండి. విశ్వంలో ఉన్న మానవులందరూ తమలోని కుండలినీ శక్తిని జాగృతం చేసుకొని, సహజయోగం ద్వారా అంతిమ స్వాతంత్య్రం అయిన ఆత్మ సాక్షాత్కారం పొందేలా చేయడమే నా లక్ష్యం. ఈ విషయంలో భారతీయులే మిగిలిన దేశాల ప్రజలను ముందుండి నడిపించాలి. యువత దేశభక్తిని పెంపొందించుకుంటేనే దేశం పురోగతి చెందుతుంది’’ అని ఆమె స్పష్టం చేశారు. దేశ విముక్తికోసం తమ సర్వస్వాన్ని నిస్వార్థంగా త్యాగం చేసి, గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో పయనించిన మాతాజీ నిర్మలాదేవిని, ఆమె కుటుంబాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకోవడం సముచితం.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ