The Spiritual Meaning of Advent: ఆగమన కాలం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:33 AM
క్రిస్మస్ పండుగ రావడానికి ముందు... నాలుగు వారాల కాలాన్ని క్రైస్తవులు ఆగమన కాలంగా పాటిస్తారు. ఆ పండుగ కోసం మానసికంగా సిద్ధపడే ఈ రోజులను ‘ఆయత్త దినాలు’ అని కూడా అంటారు....
దైవమార్గం
క్రిస్మస్ పండుగ రావడానికి ముందు... నాలుగు వారాల కాలాన్ని క్రైస్తవులు ఆగమన కాలంగా పాటిస్తారు. ఆ పండుగ కోసం మానసికంగా సిద్ధపడే ఈ రోజులను ‘ఆయత్త దినాలు’ అని కూడా అంటారు. ఈ రోజులలో నాలుగు కొవ్వొత్తులను వెలిగించి.. ప్రభువు రాకకోసం ఎదురుచూస్తారు. ఈ నాలుగు కొవ్వొత్తులు చాలా ముఖ్యమైనవి ఒకటి ఆశతో కూడిన నిరీక్షణకు, రెండోది శాంతి సమాధానాలకు, మూడోది ప్రేమ జ్వాలకు, నాలుగోది సంతోషానికి, ఉత్సాహానికి సంకేతాలు.
ఈ అందమైన విశ్వాన్ని దేవుడు ఎంతో శ్రద్ధగా మలిచాడు. జగత్తు మొత్తానికి ఎలా ఉండాలో నేర్పాడు. కానీ అది దారి తప్పి, అపమార్గంలో పయనించడం గమనించి, భక్తులు, ప్రవక్తలు విలపించడం చూసి... తను తప్పక వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పడనే విశ్వాసంతో ఆయన రాకకోసం ఎంతగానో నిరీక్షించారు. అది మొదటి కొవ్వొత్తి. తమను సాతాను వెంటాడుతూ పన్నిన సమస్యల వలయంలో చిక్కుకొని, అలజడి చెందిన సమయంలో... దేవునికోసం శాంతి సమాధానాల కోసం జనం ఎదురు చూశారు. ఆ శాంతి సమాధానాలను ఆశించడమే రెండో కొవ్వొత్తి. మనిషిని మనిషి ద్వేషించడం, హింసించుకోవడం మొదలైంది. ఆ దశలో... ‘‘నిన ్ను నువ్వు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువారిని ప్రేమించాలి’’ అనే దేవుని ఆనతి ఉల్లంఘనకు గురైంది. తోటి సమాజాన్ని ప్రేమిస్తూ, సాటి మానవుల పట్ల ప్రేమ ద్వారా దైవ ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. అదే మూడో కొవ్వొత్తి. హృదయాల్లో కక్షలు, కార్పణ్యాల చీకట్లను తొలగించుకొని, వెలుగు నింపుకొన్న, ముఖాలతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో ప్రభువు రాకకోసం నిరీక్షిస్తూ వెలిగేది నాలుగో కొవ్వొత్తి.
ఈ నాలుగు కొవ్వత్తులు ప్రతి క్రైస్తవ కుటుంబంలో వెలిగే నిరీక్షణా దీపాలు. నాలుగు వారాల పాటు (నవంబర్ 30నుంచి డిసెంబర్ 24 వరకూ) వేకువ జామునుంచి ప్రార్థనలతో ఆరాధనలు చర్చిల ప్రాంగణాల్లో జరుగుతాయి. వాస్తవానికి క్రిస్మస్ పండుగ అనేది ఈ ఆయత్త దినాల్లోనే జరిగిపోతుంది. పండుగలు అనేవి మనిషి తనలోని మాలిన్యాన్ని తొలగించుకోవడానికి, మనసులో ప్రేమభావం పెంచుకోవడానికి, కక్షలను మరచిపోయి... సమైక్యంగా జీవనం గడపడానికి ఉద్దేశించినమి. అందుకు మానసికంగా సిద్ధం కావడానికి ఈ ఆయత్త దినాలు దోహదం చేస్తాయి.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్,
9866755024
ఈ వార్తలు కూడా చదవండి..
పేలిన వాషింగ్ మిషన్.. ఉలిక్కిపడ్డ ప్రజలు
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం