నీ తోటివాడూ నీలాంటివాడే
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:37 AM
సంపన్నుడైన ఒక బాటసారి కొండదారిలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అతని దగ్గిర డబ్బు, నగలు ఉన్న పెద్ద మూట ఉంది. అది దొంగలు దారికాచి దోచుకోవడానికి అనువైన ప్రదేశమే. కాబట్టి...
దైవమార్గం
సంపన్నుడైన ఒక బాటసారి కొండదారిలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అతని దగ్గిర డబ్బు, నగలు ఉన్న పెద్ద మూట ఉంది. అది దొంగలు దారికాచి దోచుకోవడానికి అనువైన ప్రదేశమే. కాబట్టి అతను ఆ మూటను జాగ్రత్తగా పట్టుకొని నడుస్తున్నాడు. అతను భయపడినట్టే... చెట్ల చాటు నుంచి, బండల మాటు నుంచి దొంగలు వచ్చారు. అతణ్ణి చుట్టు ముట్టారు. తీవ్రంగా కొట్టారు. అతని దగ్గర ఉన్నదంతా దోచుకుపోయారు. ఆ బాటసారి స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికి తేరుకున్నాడు. లేవలేని స్థితిలో ఉన్న అతను సాయం కోసం అరిచాడు, అర్థించాడు. అటువైపు పలువురు పలుకుబడి ఉన్న పెద్దమనుషులు, సంఘ సేవకులుగా పేరున్నవారు, సంపన్నులు, మతాచార్యులు ప్రయాణించారు. అందరూ అతణ్ణి దాటుకుంటూ పోయారు తప్ప సహాయం చేయలేదు.
కొంతసేపటికి ఒక సాదాసీదా మనిషి చిన్న గాడిదమీద అటు వచ్చాడు. ఆ బాధితుణ్ణి చూసి, ‘అయ్యో పాపం’ అని జాలిపడ్డాడు. అతడికి కట్లు కట్టాడు. తన గాడిదమీద ఎక్కించుకొని దగ్గరలో ఉన్న సత్రంలోకి చేర్చాడు, వైద్యం చేయించాడు. సత్రంవారికి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. మరుసటిరోజు వచ్చి... సత్రం వారికి చెప్పిన మొత్తం చెల్లించాడు. ఆ బాటసారిని అతని ఇంటికి తీసుకువెళ్ళాడు.
ఆ వచ్చిన వ్యక్తి ఒక సమరేయుడు. అంటే ఆ రోజుల్లో కడజాతివాడుగా, అంటరానివాడుగా పరిగణించే వ్యక్తి. అందరూ ఈ సడించుకొనే వర్గానికి చెందినవాడు. అయితేనేం... బాధలో ఉన్న తోటి మనిషిని అతను కాపాడి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. ‘‘సాటివాడు శత్రువు కాదు. తోటివాడు తోడేలూ కాదు. వారూ మనలాంటి మనుషులే అని భావించి, ప్రేమించడం నేర్చుకోవాలి. ఎంత సంపద ఉన్నా, అధికారంలో ఉన్నా, జాతిపరంగా ఉన్నతులమని భావించేవారైనా... వారెవరూ గొప్పవారు కాదు. తోటివారికి సాయం చేసేవారు పేదలైనా, నిమ్నవర్గాలవారైనా ఉన్నతులే’’ అంటూ తన చుట్టూ చేరిన ప్రజలకు ఏసు క్రీస్తు చెపిన్పన కథ ఇది. ‘మనల్ని మనం ప్రేమించుకోవడంలో విశేషం ఏముంది? మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మన చుట్టుపక్కలవారిని కూడా అలాగే ప్రేమించాలి’ అనేది బైబిల్ సారాంశం.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి