Share News

Sushumna Nadi : సమతుల్యత సాధించాలంటే...

ABN , Publish Date - Feb 06 , 2025 | 10:44 PM

భూమికి అక్షం ఉంటుంది. భూమి చలనం దాని మీద ఆధారపడి జరుగుతుంది. అదే విధంగా మానవుడిని సమతుల్య స్థితిలో ఉంచే అక్షం (ఇరుసు)... సూక్ష్మ నాడీ వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న సుషుమ్నా నాడి. ఇదే మనకు ఆధారం. ఇది మనలో మధ్యస్థంగా ఉండే నాడి. ఎవరిలో సుషుమ్నా నాడి సరైన రీతిలో ఉండదో... వారి శరీరంలోని వివిధ చక్రాలలో సమస్యలు, ఇబ్బందులు ఏర్పడతాయి.

Sushumna Nadi : సమతుల్యత సాధించాలంటే...

భూమికి అక్షం ఉంటుంది. భూమి చలనం దాని మీద ఆధారపడి జరుగుతుంది. అదే విధంగా మానవుడిని సమతుల్య స్థితిలో ఉంచే అక్షం (ఇరుసు)... సూక్ష్మ నాడీ వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న సుషుమ్నా నాడి. ఇదే మనకు ఆధారం. ఇది మనలో మధ్యస్థంగా ఉండే నాడి. ఎవరిలో సుషుమ్నా నాడి సరైన రీతిలో ఉండదో... వారి శరీరంలోని వివిధ చక్రాలలో సమస్యలు, ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ ఇరుసు పరిధిని దాటి కుడి పార్శ్వం వైపు మొగ్గినప్పుడు... వ్యక్తి తన అహంకారంతో సమస్యలను సృష్టించుకుంటాడు. ఎడమ ఎడమ పార్శ్వం వైపు మొగ్గు చూపినప్పుడు.. తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. సుషుమ్నా నాడిలో ప్రవహిస్తున్న శక్తి... ముప్పావు వంతు చుట్టుకున్న కాగితంలా ఉంటుంది. దాని లోపలే బ్రహ్మనాడి ఉంటుంది. ఈ బ్రహ్మనాడి మామూలుగా అయితే చాలా సన్నగా.. వెంట్రుక వాసిలో ఉంటుంది. అటువంటి సన్నని బ్రహ్మనాడిలోంచీ ఇంకా సన్నటి పోగులా ఉండే కుండలినీ శక్తి ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. ఈ పోగు బాగా సన్నగా ఉన్నవారు పైకి చూడడానికి గంభీరంగా, ధైర్యంగా తెలివైనవారుగా, మంచివారుగా కనిపిస్తారు. కానీ అంతర్గతంగా ఆధ్యాత్మికమైన లోతు ఉండదు. ఏ వ్యక్తయినా ఆధ్యాత్మికంగా లోతులకు వెళ్ళగలిగినప్పుడు... అతని బ్రహ్మనాడి విశాలం అవుతుంది. దానిలో ప్రయాణించే కుండలినీ పోగులు కూడా వెడల్పుగానే ఉంటాయి. ఆధ్యాత్మికమైన లోతు ఉన్నవారికి వైఖరి చాలా సుందరంగా, మనోహరంగా ఉంటుంది. వారు అందరికీ ఆనందాన్ని పంచుతారు.

కాబట్టి మన సుషుమ్నా నాడిని దృఢంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ స్థితిని సాధించడానికి భక్తి శ్రద్ధలే అనువైన మార్గం. ముందు మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉండాలి. ‘‘ఈ జీవితంతో నేను ఏం చేస్తున్నాను? నేను జీవితాన్ని ఎలా వృధా చేస్తున్నాను? ఎందుకు వృధా చేస్తున్నాను? నా జీవితానికి పరమార్థం ఉండాలి కదా! ఆ పరమార్థాన్ని నేను నెరవేరుస్తున్నానా?’’ అనే ప్రశ్నలు మీరు వేసుకోవాలి. అప్పుడు మీ అహంకారంతో పోరాటం చేయడం చాలా సులువని మీరు అర్థమవుతుంది. ఎప్పుడయితే చిత్తం అంతర్గతంగా ప్రయాణం ప్రారంభిస్తుందో... అప్పుడు బ్రహ్మనాడి విస్తరించడం మొదలవుతుంది. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులలోనైనా, ఎటువంటి స్థితిలోనైనా, ఎటువంటి జీవన విధానంలోనైనా మీరు సౌకర్యంగా ఉండేలా చేస్తుంది. కుండలీనీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్నవారు ఈ స్థితిని సాధించగలరనీ, నిరంతర ధ్యాన సాధన ద్వారా ఈ స్థితిని సుస్థిరపరుచుకోగలరని శ్రీమాతాజీ నిర్మలాదేవి పలు సందర్భాలలో స్పష్టం చేశారు.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - Feb 06 , 2025 | 10:44 PM