The Rising Danger of Junk Food: జంక్ ఫుడ్‌తో పెను ప్రమాదం
ABN , Publish Date - Oct 30 , 2025 | 02:35 AM
ప్రస్తుతం పిల్లలు జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పండ్లు, కూరగాయలతో కూడిన పోషకాహారాన్ని ఆమడ దూరం పెట్టేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం, మధుమేహం, బీపీ...
ప్రస్తుతం పిల్లలు జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పండ్లు, కూరగాయలతో కూడిన పోషకాహారాన్ని ఆమడ దూరం పెట్టేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం, మధుమేహం, బీపీ, నిద్రలేమి, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు లాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని యునిసెఫ్ హెచ్చరిస్తోంది. అలాగే గత ఇరవయ్యేళ్ళుగా పిల్లలు ఎలా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారో వివరిస్తూ ఓ నివేదికను కూడా విడుదల చేసింది. ‘ఫీడింగ్ ప్రాఫిట్: హౌ ఫుడ్ ఎన్విరాన్‌మెంట్స్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్’ అనే ఈ నివేదిక.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు ఎంతటి ప్రమాదం అంచున ఉన్నారో తెలియజేస్తోంది.
నివేదికలో ఏముంది?
దాదాపు 190కి పైగా దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా యునిసెఫ్ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం బాల్యం, కౌమార దశలు అంటే అయిదు నుంచి పంతొమ్మిది ఏళ్లలోపు వయసున్న పిల్లల్లో ఊబకాయం సమస్య మూడు రెట్లు పెరిగింది. ఇలా ఊబకాయంతో బాధపడే పిల్లల్లో ఇన్సులిన్ నిరోధకత పెరిగి రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. సగటు కుటుంబాలు కూడా విద్య, వైద్యం, రవాణా, తృణధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తుల కంటే అధికంగా... ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల కోసం ఖర్చు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.
బిస్కెట్లు, చిప్స్, జ్యూస్‌లు, శీతల పానీయాల వినియోగం అంచనాలకు మించి పెరిగింది. దీనివల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. కాబట్టి ప్రభుత్వాలు ఆహార చట్టాలను కఠినతరం చేయాలని నివేదిక పేర్కొంది.
అధిక మోతాదులో చక్కెర, ఉప్పు, అతిగా శుద్ధి చేసిన పిండి, అనారోగ్యకరమైన కొవ్వులు కలిపి తయారుచేసే అలా్ట్ర ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను పిల్లలు, యువతీ యువకులు ఇష్టంగా తింటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా ఇవి అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన భోజనం కంటే జంక్ ఫుడ్ తినడమే సౌలభ్యంగా ఉందనే భావన ప్రతిఒక్కరిలో పెరుగుతోంది. ఇది మంచి పరిణామం కాదు. జంక్ ఫుడ్ ఉత్పత్తి, మార్కెటింగ్‌లపై పరిమితులు విధిస్తూ అధిక పన్ను విధానాలను అమలు చేయడం సత్ఫలితాలను ఇస్తుందని యునిసెఫ్ అభిప్రాయపడింది.
జంక్ ఫుడ్‌కు వ్యతిరేకంగా...
ఇప్పటికే సర్వత్రా జంక్ ఫుడ్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ‘ఫిట్ ఇండియా’, ‘ఈట్ రైట్ ఇండియా’ పేరిట ప్రచారాలు జరుగుతున్నాయి. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల కలిగే అనర్థాల గురించి పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వివరించి చెబుతున్నారు. జంక్ ఫుడ్, శీతల పానీయాల్లో ఉండే చక్కెర, కొవ్వుల మోతాదు తెలియజేసే బోర్డులను పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు పలువురు సూచిస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశానికి ఊబకాయం పెద్ద సమస్యగా పరిణమిస్తుందని, ప్రతి కుటుంబం వంట నూనె వాడకాన్ని తగ్గించాలని ఇటీవల ప్రధానమంత్రి మోదీ పిలుపునివ్వడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..
మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..