విశేషాలు ఎన్నెన్నో
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:55 AM
పూరీలోని జగన్నాథ ఆలయం అనేక విశేషాల సమాహారం. శ్రీకృష్ణుని హృదయం ఇప్పటికీ ఈ ఆలయంలోని పవిత్రమైన గోడల లోపల కొట్టుకుంటూ ఉంటుందనేది భక్తుల నమ్మకాల్లో ఒకటి. కృష్ణుడి అవతార సమాప్తి...
పూరీలోని జగన్నాథ ఆలయం అనేక విశేషాల సమాహారం. శ్రీకృష్ణుని హృదయం ఇప్పటికీ ఈ ఆలయంలోని పవిత్రమైన గోడల లోపల కొట్టుకుంటూ ఉంటుందనేది భక్తుల నమ్మకాల్లో ఒకటి. కృష్ణుడి అవతార సమాప్తి తరువాత... అతని హృదయం నాశనం కాకుండా ఉండేందుకు ఈ ఆలయం లోపల ఒక దైవిక అవశేషంగా భద్రపరిచారని చెబుతారు.
ఈ ఆలయం గోపురంపైన సుదర్శన చక్రం ఉంటుంది. అన్ని టన్నుల బరువైన లోహపు నిర్మాణాన్ని అంతపైకి ఎలా చేర్చారనేది ఇప్పటికీ అంతుపట్టని విషయం. అలాగే స్వామి మందిరాన్ని ఏ కోణం నుంచి చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది. అలాగే నగరంలోని ఏ దిశ నుంచి చూసినా... ఆలయం పైన ఉన్న చక్రం ఒకే మాదిరిగా దర్శనం ఇస్తుంది.
జగన్నాథ ఆలయంలోని దారు (కలప) విగ్రహాల స్థానంలో 8, 12, 19 ఏళ్ళకు ఒకసారి నిర్వహించే నవకళేబర యాత్ర సందర్భంగా కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు. దీనికోసం నిర్దిష్టమైన లక్షణాలు కలిగిన వేప చెట్లను జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. విగ్రహాలను చెక్కే పని 21 రోజుల పాటు నిపుణులైన కళాకారులు రహస్యంగా చేస్తారు. కొత్త విగ్రహాల ప్రతిష్ఠ తవాత.. పాత విగ్రహాలను ఖననం చేస్తారు. ఇంతకుముందు... 2015లో నవ కళేబర యాత్ర జరిగింది. మళ్ళీ 2034లో దీన్ని నిర్వహిస్తారు.
జగన్నాథుడి ఆలయం మీద ఏ పక్షులూ ఎప్పుడూ ఎగరవు. అలాగే విమానాలకు కూడా ఆలయం మీదుగా ఎగరడానికి అనుమతి లేదు.
నలభై అయిదు అంతస్తుల ఎత్తున ఉండే ఆలయ గోపురం పైకి అర్చకులు ప్రతిరోజూ ఎక్కి, 20 అడుగుల వెడల్పు ఉండే త్రిభుజాకార పతాకాన్ని ఎగురవేస్తారు. గత 1800 ఏళ్ళుగా ఇది నిరంతరాయంగా కొనసాగుతోంది. దీనికి ఒక్క రోజు అంతరాయం కలిగినా... పద్ధెనిమిదేళ్ళు ఆలయాన్ని మూసేయాలనే నియమం ఉంది. కాగా... గాలి ఒక దిశలో వీస్తూ ఉంటే... దానికి వ్యతిరేక దిశలో జగన్నాథ గోపుర పతాకం ఎగరడం విస్మయం కలిగించే మరో విశేషం.
రోజులో ఏ సమయమైనా, ఆకాశంలో ఎండ ఎంత తీవ్రంగా కాస్తున్నా... జగన్నాథ ఆలయం నీడ నేలమీద పడదు. ఇది నిర్మాణపరమైన అద్భుతం అనేది కొందరి అభిప్రాయం కాగా... మరికొందరి దృష్టిలో ఇది జగన్నాథుడి లీల.
శ్రీ జగన్నాథుడికి అయిదు విడతలుగా... 56 రకాల ప్రసాదాలను నిత్యం సమర్పిస్తారు. ఇరి రెండు రకాలు. వీటిలో పొడిగా ఉండే రకాలు కొన్ని, అన్నం, పప్పు లాంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. మహా ప్రసాదం తయారీలో వేలాదిమంది నిమగ్నం అవుతారు. ఏడు కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి కట్టెల పొయ్యిల మీద వంట చేస్తారు. అన్నిటికన్నా పైన ఉన్న కుండలో ఉన్న పదార్థం మొదట, తరువాత మిగిలిన కుండల్లోని పదార్థాలు ఉడుకుతాయి. దీన్ని పూరీ క్షేత్రానికే ప్రత్యేకమైన విశేషంగా చెబుతారు. ప్రతిరోజూ ఒకే పరిమాణంలో ప్రసాదం తయారు చేస్తారు. అయితే భక్తుల సంఖ్య ఎక్కువైనా, తక్కువైనా... ఏ రోజూ ఆహారం వృధా కాదనీ, అలాగే భక్తులు ఎవరూ నిరాహారంగా మిగిలిపోరనీ అంటారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News