The Living Word Of God: సజీవ వాక్కు
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:30 AM
బైబిల్‌లో వాక్కుకు (మాటకు) మహోన్నతమైన స్థానం ఉంది. దేవుని నోట వెలువడిన ఆ వాక్కు ద్వారానే ఈ సమస్త విశ్వం పుట్టిందనీ, కాబట్టి అది దైవతుల్యమైనదనీ, దానికి ఎంతో ఔన్నత్యం ఉన్నదనీ...
దైవమార్గం
బైబిల్‌లో వాక్కుకు (మాటకు) మహోన్నతమైన స్థానం ఉంది. దేవుని నోట వెలువడిన ఆ వాక్కు ద్వారానే ఈ సమస్త విశ్వం పుట్టిందనీ, కాబట్టి అది దైవతుల్యమైనదనీ, దానికి ఎంతో ఔన్నత్యం ఉన్నదనీ, దివ్యమార్గాన్ని నిర్దేశించే ఆ వాక్కు... ప్రజలకోసం శరీరధారిగా, క్రీస్తు రూపంలో మానవునిగా అవతరించిందనీ, మానవుల మధ్య సంచరించిందనీ బైబిల్ చెబుతోంది. కనిపించే ఐశ్వర్యాలన్నిటినీ దొంగిలించడానికి వీలుంది... కానీ జ్ఞానాన్నీ, దానికి సంబంధించిన మంచి వాక్కును ఎవరూ దొంగిలించలేరు. ‘‘ఆహారం లేకుండానైనా ఉండవచ్చేమో కానీ, మాట లేకుండా బతకడం కష్టం’’ అని ఒక సందర్భంలో సాతానుకు ఏసు ప్రభువు చెబుతాడు. కేవలం మాట ద్వారానే ఏసు అద్భుతాలు చేసిన సంఘటనలు కనిపిస్తాయి.
ఒక సైన్యాధిపతి తన ఇంట చావు బతుకుల్లో ఉన్న తన కుమారుణ్ణి బతికించాలని ఏసును ఆహ్వానిస్తూ ‘‘స్వామీ! మీరు నా ఇంటికి వచ్చేటంతటి భాగ్యవంతుణ్ణి, అర్హుణ్ణి కాదు. మీరు ఇక్కడి నుంచి ఒక మాట పలికితే చాలు, నా కుమారుడు బతుకుతాడు’’ అని వేడుకున్నాడు. ప్రభువు మాటలోని శక్తిమంతమైన జీవాన్ని అతను గుర్తించాడు. ఏసు కృపతో అతని విశ్వాసం ఫలించింది. ‘‘భూమ్యాకాశాలు నశించినా నశించవచ్చు, కానీ నా వాక్కుకు అంతం లేదు. అది ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుంది’’ అని ప్రభువు ప్రకటించాడు. ప్రభువు వాక్కు సత్యంతో, జీవంతో, కాంతితో, శక్తితో కూడుకున్నది. అది బాధల్లో ఉన్నవారికి చల్లనైన ఓదార్పును ఇస్తుంది. నిత్యంగా ఉండే మార్గానికి తీసుకువెళ్తుంది. అది ఆదికాలం నుంచి నేటి వరకూ ఉన్న మానవులందరికీ తోడుగా ఉంది. ఆ వాక్కు ఇప్పటికీ అనేక రూపాల్లో ప్రజలతో మమేకమై, లోకాన్ని నడిపిస్తోంది. ఒకప్పుడు దేవుని నోట ‘‘అగుగాక’’ అని శాసించిన వాక్కు... ఉపదేశించే క్రీస్తు వాక్కుగా పరిణమించి ఈ విశ్వాన్ని కాపాడుతూ... మానవులకు తోడుగా ఉండే పవిత్రాత్మగా నేడు వ్యాపించిందనేది క్రైస్తవుల విశ్వాసం.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్, 9866755024
ఇవీ చదవండి:
వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..
మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన