Bhagavad Gitas Message for Universal Peace: విశ్వ శాంతి మార్గం గీతా సందేశం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:50 AM
భగవద్గీత... అన్ని ఉపనిషత్తుల సారం. ‘వీటన్నిటినీ శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి ఎందుకు చెప్పాడు?’ అనే సందేహం వస్తుంది. అర్జునుడు అడిగిన ప్రశ్నలు అలాంటివి. అతడు క్షత్రియుడిగా తన ధర్మాన్ని...
విశేషం
భగవద్గీత... అన్ని ఉపనిషత్తుల సారం. ‘వీటన్నిటినీ శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి ఎందుకు చెప్పాడు?’ అనే సందేహం వస్తుంది. అర్జునుడు అడిగిన ప్రశ్నలు అలాంటివి. అతడు క్షత్రియుడిగా తన ధర్మాన్ని ఆచరించాల్సిన సమయంలో... ‘అలా ఆచరించడం వల్ల గొప్ప పాపానికి ఒడిగడుతున్నానేమో?’ అనే సంశయం వచ్చింది. దానికి అనుబంధంగా నరకం, స్వర్గం... ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేశాడు. కాబట్టి అర్జునుడికి పుణ్య పాపాల గురించి ఒక సంగ్రహ స్వరూపాన్ని ఇవ్వడం కృష్ణుడి బాధ్యత అయింది. ఇప్పుడు భగవద్గీత ఎందుకు ఆధునికమో పరిశీలిద్దాం.
భగవద్గీతను ‘గీతాశాస్త్రం’గా ప్రాచీనులు వర్ణించారు. శాస్త్రం అంటే హేతుబద్ధమైన పరిశీలనతో నిర్మించుకున్న లేదా ఏర్పడిన కొన్ని నిర్ణయాలను లేదా విశేషాలను తెలియజేసేది. పరిశీలించే విషయం ఏదైనా కావచ్చు. సైన్సులో ముఖ్యంగా మనం మనకు ఎదురుగా కనిపించే ప్రపంచంలోని విషయాలను పరిశీలిస్తాం. వాటి గురించి ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర శాస్త్రాలను చదువుతాం. వీటి విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండవు. ఒకవేళ... ఈ రోజు పరిశీలించిన విషయం తదుపరి పరిశోధనల్లో తప్పు అని తెలిసినప్పుడు... ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరిస్తాం. కానీ దేవుడు అనే విషయాన్ని విశ్వాసం పరిధిలోకి మనం నెట్టివేశాం. అలాంటి విశ్వాసానికి ఎలాంటి భంగం కలిగించకూడదనే భయంకరమైన నియమాన్ని పెట్టాం. మన సమాజంలో దేవుళ్ళకు సంబంధించి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాలకు చెందినవారు ఆ దేవుడే గొప్ప అని భావిస్తూ ఉంటారు. ప్రపంచంలోని పెద్ద మతాలన్నిటి విషయంలోనూ అదే పరిస్థితి. ఒకానొక సమయంలో ఒకానొక వ్యక్తి... దేవుడి దగ్గర నుంచి ఒక సందేశాన్ని పొందానని తన అనుచరులకు చెప్పి, దాన్ని ప్రచారం చేయడం ద్వారా ఆ మతం వ్యాప్తి చెందుతుంది. దీనికి భిన్నంగా... ‘దేవుడు’ అనే విషయంలో శాస్త్రీయమైన విచారణ ఎక్కడైనా జరిగిందా? అని పరిశీలిస్తే... దాన్ని ముఖ్యంగా భారతీయ తత్త్వవేత్తలే చేశారని ఆధునిక వేదాంత గురువులైన వివేకానందుడిలాంటి వారు రాసిన పుస్తకాలను చదివితే తెలుస్తుంది. ఈ విధంగా పరిశీలించిన విషయాలే వేదాల్లోని చివరి భాగాలైన ఉపనిషత్తుల్లో ఉన్నాయి.
అన్నీ పరబ్రహ్మ రూపాలే...
విశ్వాసం, శాస్త్రీయ పరిశీలన అనే రెండూ సమాజంలో అనాదిగా సమాంతరంగా వస్తూనే ఉన్నాయి. దేవుడి విషయంలో కూడా అంతే. వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సంప్రదాయాలు ఎన్నో ఉన్నప్పటికీ... వాటికి సమాంతరంగా ‘ఉపనిషత్తులు’ అనే ఆలోచనా ధార కూడా వచ్చింది. వేదాంత శాస్త్రం రెండు స్థాయిల్లో మాట్లాడుతుంది. ఒకటి శాస్త్రీయమైన స్థాయి. రెండోది సామాన్యమైన మనిషి స్థాయి. శాస్త్రీయ స్థాయిలో దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు. విశ్వాన్ని మించి అనంతంగా వ్యాపించి ఉన్న ఒక చైతన్యం, ఒక తత్త్వం అని చెప్పారు. దానినే ‘పరమాత్మ’ లేక ‘పరబ్రహ్మం’ అంటాం. ఆ చైతన్యమే ప్రపంచ రూపంలో కనిపిస్తుంది. అనేక రకాలైన నామరూపాలలో కనిపిస్తుంది. సమాజంలో ఉన్న సంప్రదాయాలను ఈ ఆలోచనాధార నిరాకరించలేదు. వాటిని కూడా సమన్వయం చేయడానికి పూనుకుంది. విష్ణువు, శివుడు, శక్తి, గణేశుడు... వీరందరూ ఆ పరబ్రహ్మలో మనం భావించుకున్న రూపాలేననేది ఉపనిషత్తుల సిద్ధాంతం.
ఉన్నది ఒకే చైతన్యం
దీనిలో ఆధునికత ఏముంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడా శాస్త్రవేత్తల ఎదుట ఉన్న ప్రశ్న ఇదే. ‘చైతన్యం మొదట వచ్చిందా? లేదా జడమైన ప్రపంచం, జడమైన పరమాణువుల నుంచి చైతన్యం వచ్చిందా? లేదా ఆ రెండూ వేరువేరుగా, స్వతంత్రంగా ఉన్నాయా?’ అని శాస్త్రవేత్తలు ప్రాచీనకాలం నుంచి ఆలోచిస్తూ వచ్చారు. ఇటీవలి గతితార్కిక భౌతికవాదంలో కూడా దీన్నే విచారించారు. కానీ వారు విశ్వాసం స్థాయిలో సమాజంలో ఉన్న సంప్రదాయాలను పూర్తిగా నిరాకరించారు. వేదాంత శాస్త్రం అలా చేయలేదు. ‘ఉన్నది ఒక్కటే. దాన్ని మీరు ఏ రూపంలోనైనా భావించుకోవచ్చు’అని స్వేచ్ఛను ఇచ్చింది. ఉపనిషత్తులు అన్నిటిలో ఉన్న ఈ విషయాన్ని.... దాదాపుగా వేదాంతంలో చెప్పినట్టు ‘ఒకే చైతన్యం ప్రపంచంలో ఉంది’ అనే విషయానికి దగ్గరగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం మాట్లాడుతోంది. దేవుడు ఒక మనిషి కాడని, స్వర్గం అనే లోకంలో ఉండే ఒకానొక వ్యక్తి కాడని చెప్పడం వల్ల సామాజికమైన లాభం ఏమిటి? మనకు ఇష్టమైన సంప్రదాయాన్ని అనుసరించే స్వేచ్ఛను భగవద్గీత ఇస్తుంది. ‘‘దేవుణ్ణి నీవు ఏ రూపంలో, ఏ పేరుతో భావించుకుంటే... ఆ రూపంలో, ఆ పేరుతోనే ఆ పరమాత్మ అనుగ్రహిస్తుంది’’ (7-21) అని చెబుతుంది. ‘‘విశాల బుద్ధితో నన్ను కాకుండా వేరే ఏ దేవుణ్ణి పూజించినా నన్ను పూజించినట్టే (9-23) అని కూడా చెబుతుంది. కాబట్టే మన ఋషులు, శంకరాచార్యులు లాంటి గురువులు వివిధ సంప్రదాయాలను సమన్వయం చేసి, శాంతిని నెలకొల్పారు.
గుణప్రధానంగా...
హిందూమతం అంటే కులం అనే భావనను మన మనసులో బలంగా రుద్దడం జరిగింది. ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో నాలుగు వర్ణాలు అనే ప్రసక్తి ఉంది గానీ సమాజంలో ఉన్న వేల కొద్దీ కులాలను ఎవరూ నిర్మించలేదు. ఎవరూ ఏ పుస్తకంలోనూ చెప్పలేదు. భగవద్గీతను పాఠంగా చెప్పే ఆచార్యులు ఈ విషయం వివరిస్తూనే ఉన్నారు. నాలుగు వర్ణాల ప్రస్తావన సృష్టిలో ఉన్న విభిన్న వ్యక్తిత్వాలమీద ఆధారపడినదే. ఈనాడు మనస్తత్వ శాస్త్రవేత్తలు మనుషులను వారి స్వభావాన్ని బట్టి విభజించినట్టే... మన ఋషులు కూడా ఒక వ్యక్తిలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాల ప్రాధాన్యాన్ని బట్టి ఆ వ్యక్తి వర్ణాన్ని గురించి చెప్పారు. ఈ ప్రస్తావన కూడా ‘విశ్వంలో ప్రతి ప్రాణీ పరమాత్మ రూపమే’ అని చెప్పే సందర్భంలో చేసినదే తప్ప... మనుషులను విభజన చేయాలని చెప్పినది కాదు. భగవద్గీత శాస్త్రీయతను, ఆధునికతను, అవసరాన్ని గురించి తెలుసుకోవాలంటే... దానిపై ఉన్న వ్యాఖ్యలతో పాటు ఆచార్యుల ప్రసంగాలను వినాలి. మన సమాజంలోనే కాదు... మొత్తం ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి గీతా సందేశం చాలా అవసరం. ముఖ్యంగా యువత దీని గురించి తెలుసుకోవాలి.
కె.అరవిందరావు
అదే ఆత్మజ్ఞానం
దేవుడు అనేది ఒక అనంతమైన తత్త్వం అయినప్పుడు... మనిషి స్వరూపం ఏమిటి? కేవలం మనిషే కాకుండా ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపం అని చెప్పడం మరో విషయం. ఏ వస్తువూ అనంతానికి బయట ఉండదు కదా! దాన్ని తెలుసుకోవడమే ‘ఆత్మజ్ఞానం’ అంటారు. దీన్ని సిద్ధాంత రూపంలో తెలుసుకోవడం చాలా సులభమే కానీ... ఆ భావనలో ఉండడానికి ఎంతో నిష్ట అవసరం. ఆ నిష్టను సాధించడానికి ఎంతో కృషి చేయాలి. ఆ నిష్టను పొందిన వ్యక్తి... సమాజం తనకు ఇచ్చిన సంకుచితమైన ఐడెంటిటినీ వదిలేస్తాడు. తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో విశ్వంలో ప్రతి ప్రాణినీ అంతే ప్రేమగా చూస్తాడు. భగవద్గీతలో ఈ విషయాన్నే శ్రీకృష్ణుడు చెప్పాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
పేలిన వాషింగ్ మిషన్.. ఉలిక్కిపడ్డ ప్రజలు
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం