ఆ నలుగురు
ABN , Publish Date - May 02 , 2025 | 03:56 AM
దైవ పుత్రుడైన ఏసు క్రీస్తు మానవుడిగా ఈ భూమిపై జన్మించాడు. మానవులతో మమేకమయ్యాడు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో, ఉపమానాలతో కూడిన కథలతో వారికి బోధ చేశాడు. శిలువపై మరణించిన క్రీస్తు పునరుత్థానం...
దైవమార్గం
దైవ పుత్రుడైన ఏసు క్రీస్తు మానవుడిగా ఈ భూమిపై జన్మించాడు. మానవులతో మమేకమయ్యాడు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో, ఉపమానాలతో కూడిన కథలతో వారికి బోధ చేశాడు. శిలువపై మరణించిన క్రీస్తు పునరుత్థానం చెందిన తరువాత... నలభై రోజుల పాటు భూమిపై ఉన్నాడు. తదుపరి కర్తవ్యంపై తన శిష్యులకు దిశా నిర్దేశం చేశాడు. తాను చెప్పినవాటిలో వారు నమ్మిన వాటిని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించాడు. క్షమాగుణంతో, ప్రేమతో మసలుకోవాలన్నాడు. తన బోధలు ప్రజలకు సువార్తలుగా చేరుకోవాలని, అవి దుఃఖంతో కలత చెందిన హృదయాలతో ఉన్న ప్రజలను మేలుకొలిపేలా, కష్ట సమయాల్లో తగినంత ఓదార్పు ఇచ్చేలా ఉండాలని సూచించాడు.
ఆ విధంగా ఆయన చెప్పిన సూక్తులను, బోధలను సువార్తలుగా గ్రంథస్థం చేసి, ప్రజలకు అందించిన మహనీయులు నలుగురు... మత్తయి, మార్కు, లూకా, యోహాన్. వారిని ‘సౌవార్తికులు’ అంటారు. వారు రాసిన సువార్తలు వారి పేరిటే (మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త) ప్రాచుర్యం పొందాయి. నూతన నిబంధన గ్రంథానికి ఆయువుపట్టు అయిన గ్రంథాలివి. క్రీస్తు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారు చిత్రీకరించారు. ఈ అదృష్టం దాదాపుగా క్రీస్తు శిష్యులకే దక్కడం విశేషం. కాగా. వీరితో పాటు పౌలు తదితరులు రాసిన లేఖలు, ఇతర శిష్యులు (అపోస్తలులు) చేసిన కార్యాలు కూడా ప్రముఖంగా కనిపిస్తాయి.
ఏసు బోధలు, వాటిని అక్షరబద్ధం చేసిన గ్రంథాలు, ఏసు శిష్యులు సాగించిన సువార్తయాత్రలు ప్రజలకు దిక్సూచులు అయ్యాయి. ఆనాటి మూఢ నమ్మకాలు, మూఢాచారాలు తొలగి పోవడానికి సాయపడ్డాయి. వెలుగును చూడాలని తపనపడిన నాటి ప్రజలకు నాయకత్వం వహించాయి. వెన్నంటి తోడుగా నిలిచాయి.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..