హృదయంలో అన్వేషించండి
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:47 AM
ప్రతి ఒక్కరి జీవితంలో మూడు ముఖ్యమైన నియమాలు ఉంటాయి. వాటికి అందరం లోబడి ఉంటాం. మొదటిది... జన్మించడం, రెండోది... జీవించడం, మూడోది... ఈ లోకాన్ని విడిచిపోవడం. వీటిని ఎవరూ ఉల్లంఘించలేరు...
చింతన
ప్రతి ఒక్కరి జీవితంలో మూడు ముఖ్యమైన నియమాలు ఉంటాయి. వాటికి అందరం లోబడి ఉంటాం. మొదటిది... జన్మించడం, రెండోది... జీవించడం, మూడోది... ఈ లోకాన్ని విడిచిపోవడం. వీటిని ఎవరూ ఉల్లంఘించలేరు. అన్ని జీవులు వీటికి కట్టుబడి ఉంటాయి. పూర్వం ఎవరో చెప్పినట్టు రాజైనా, సామాన్యుడైనా, సాధువులైనా... పుట్టినవారు గిట్టవలసిందే. కొందరు సింహాసనాన్ని అధిష్టించి పోతారు, మరికొందరు జీవన బంధాల్లో చిక్కుకొని కష్టాలు పడుతూ పోతారు.
అది హృదయంలో ఉంటుంది...
మనం దుఃఖాల నుంచి తప్పించుకోవాలని అనుకుంటాం. సుఖంగా బతకాలని తాపత్రయపడతాం. కానీ సుఖం అనేది ఎక్కడుంది? అది మీలోనే ఉంది. కానీ మీరేమో దాన్ని బాహ్యంగా అన్వేషిస్తున్నారు. అది మీకు బయట దొరకదు. ఈ బాహ్య సుఖాలు ఎలాంటివంటే... సుఖంలో కూడా దుఃఖాలే మిగులుతాయి. ఈ ప్రాపంచిక సుఖం ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. రేపటి రోజున అన్నీ మారిపోతాయి. ప్రతి ఒక్కటీ మారిపోతున్నా... మారకుండా ఉండాలని మీరు శతవిధాలా ప్రయత్నిస్తారు. చాలామంది వయసు తెలియకూడదని జుట్టుకు రంగు వేసుకుంటారు. కానీ యవ్వనం అనేది జుట్టులో ఉండదు. మీ హృదయంలో ఉంటుంది.
కాలయాపన వద్దు...
బయట ఉన్నవన్నీ మారుతాయి, మారుతూనే ఉంటాయి. ఈ రోజు ఉంటాయి. రేపు లేకుండా పోతాయి లేదా మారిపోతాయి. మిత్రులు మారుతారు. ఉద్యోగం మారుతుంది. రిటైరయ్యే రోజు కూడా తప్పకుండా వస్తుంది. వాతావరణం కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. కానీ ఏదీ మారకుండా ఉండాలనేది మీ ఆకాంక్ష అన్నీ ఒకేలా ఉండాలని మీరు భావిస్తారు. కానీ మార్పు సహజం. అయితే మీరు జీవించి ఉన్నంతకాలం మారనిది ఒకటుంది... అదే మీ లోపలికి వచ్చీపోయే శ్వాస. దాన్ని మీరు అర్థం చేసుకోకపోతే... ఉత్త చేతులతో వచ్చిన మీరు ఉత్త చేతులతోనే వెనుతిరగాల్సి వస్తుంది. కాబట్టి ఆ శ్వాస సరాగాలను ఆస్వాదించండి. అందులోని ఆనందాన్ని అనుభూతి పొందండి. మీరు అన్వేషిస్తున్నది మీలోనే ఉంది. దానికోసం నిరీక్షిస్తూ కాలయాపన చేయకండి. పరమానందం మీలోనే ఉందని గుర్తించండి. అలాగే మీలోనికి శ్వాస వస్తూ, పోతూ ఉంది కాబట్టి మీరు ఎంత భాగ్యశాలి అనేది కూడా గుర్తించండి. మీ జీవితంలో చీకటి ఛాయలు అలముకున్నప్పుడు, ప్రతిదీ మీకు విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తున్న స్థితిలో కూడా... ఈ శ్వాస మీకు తోడుగా ఉంటుంది. మీలోకి సహజంగా వస్తూ పోతూ ఉంటుంది. యావత్ ప్రపంచాన్నీ నడిపిస్తున్న ఆ దివ్య శక్తి మిమ్మల్ని ఆ స్థితిలో కూడా విస్మరించడం లేదు. ఈ విషయాలన్నీ గుర్తించగలగడం నిజంగా ఎంతో గొప్పవిషయం. ప్రపంచమంతా తల్లకిందులై, అన్నీ అస్తవ్యస్తంగా ఉంటూ, సమయం మీకు ఏమాత్రం అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా... శ్వాస మీలోనికి వస్తూ, పోతూ ఉంటే... అంతా సవ్యంగా ఉన్నట్టే!
అజ్ఞానానికి భయపడండి...
మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం... మీరు దేనికీ భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ భయపడాల్సి వస్తే... అజ్ఞానానికి భయపడండి. అజ్ఞానిలా ఉండకండి. ఎందుకంటే జ్ఞానం మీలోనే ఉంది. చీకటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకాశం మీలోనే ఉంది. మీ అంతరంగంలోని ఆ జ్ఞాన దీపాన్ని వెలుగొందేలా చూసుకుంటే... చీకటి మీ దరిదాపులలోకి కూడా రాదు. జీవితంలో సమస్యలు వస్తాయి. కొన్నిటిని మీరు పరిష్కరించుకోగలరు. మరికొన్నిటికి ఎలాంటి పరిష్కారం ఉండదు. కానీ జీవితం లక్ష్యం... సమస్యలను పరిష్కరించుకోవడం. కాదు. పరమానందాన్ని పొందడం, ఈ జీవితాన్ని సఫలం చేసుకోవడం. దానికోసం ప్రయత్నించండి.
ప్రేమ్‌రావత్
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News