Indian Art Market: ఆర్ట్‌కు మంచి మార్కెట్
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:04 AM
రాజా రవివర్మ చిత్రం 35 కోట్ల రూపాయలు... ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ 3.5 కోట్లు... ఇలా మన దేశంలో లబ్ధ ప్రతిష్టులైన ఆర్టిస్టుల పెయింటింగ్స్‌ను విక్రయిస్తోంది ‘ఆర్ట్ గ్యాలరీ జీ’....
రాజా రవివర్మ చిత్రం 35 కోట్ల రూపాయలు... ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ 3.5 కోట్లు... ఇలా మన దేశంలో లబ్ధ ప్రతిష్టులైన ఆర్టిస్టుల పెయింటింగ్స్‌ను విక్రయిస్తోంది ‘ఆర్ట్ గ్యాలరీ జీ’. సోషల్ మీడియా యుగం ప్రారంభమయిన తర్వాత కళాకారులకు మంచి రోజులు వచ్చాయని, పెయింటింగ్‌లు అందరి దగ్గరకు చేరుతున్నాయంని అంటారు ‘గ్యాలరీ జీ’ ఫౌండర్ గీతాంజలి. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘గ్యాలరీ జీ’ ప్రదర్శన నేపథ్యంలో ఆమె ‘నవ్య’తో సంభాషించారు.
ప్రస్తుతం మన దేశంలో ఆర్ట్ మార్కెట్ పరిస్థితి ఏమిటి?
ప్రజలకు ఏది కావాలో అది అందించినప్పుడే ఏ కళకైనా మనుగడ ఉంటుంది. ఆర్ట్ మార్కెట్ కూడా అంతే! ఒక ఆర్టిస్టు తన భావనను కేన్వా్‌సపై చిత్రీకరిస్తాడు. దాన్ని కావాలనుకొనేవారు కొందరు ఉంటారు. వారిద్దరికి మధ్య వారధిగా గ్యాలరీలు ఉంటాయి. మన దేశంలో పెయింటింగ్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అనధికార అంచనాల ప్రకారం ప్రస్తుతం ఆర్ట్ మార్కెట్ విలువ ఏడాదికి సుమారు 800 కోట్ల రూపాయలు ఉంటుంది. ఒక విధంగా చూస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. మనకు అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు. మన దగ్గర ఉన్న కొద్దిమంది ఆర్టిస్టులకు మాత్రమే ఇప్పటి దాకా గుర్తింపు వచ్చింది. ఇంకా అనేకమంది ఉన్నారు. వీరందరికీ రావాల్సినంత పేరు వస్తే మార్కెట్ విలువ మరింతగా పెరుగుతుంది.
ఒక ఆర్టిస్టు పెయింటింగ్‌ల విలువను ఎలా బేరీజు వేస్తారు?
దీనికి అనేక కోణాలు ఉంటాయి. ఆర్టిస్టు ప్రతిభతో పాటుగా.... ఎలాంటి షోలలో ఆయన ప్రదర్శిస్తున్నాడు, ఏఏ గ్యాలరీలతో ఆయన అనుబంధంగా పనిచేస్తున్నాడు? అనే విషయాలు కూడా పెయింటింగ్‌ల విలువను పెంచుతాయి. ఆర్ట్ మార్కెట్‌లో ప్రవేశించాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ‘నేను మంచి పెయింటింగ్‌లు వేస్తున్నాను. నా దగ్గరకు వచ్చిన వారికి అమ్ముతాను’ అనుకుంటే కుదరదు. రీసెర్చ్ చేయాలి. మంచి గ్యాలరీలకు అనుబంధంగా పనిచేయాలి.
ఎవ్వరికీ తెలియని స్థితి నుంచి ప్రపంచం స్థాయి గుర్తింపు వచ్చిన ఆర్టిస్టులు మీ ఎరుకలో ఎవరైనా ఉన్నారా?
నేను ‘రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్’కు మేనేజింగ్ ట్రస్టీని. ఆయన డైరీలను చదివితే ప్రతిభావంతుడైన ఒక ఆర్టిస్టు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అర్థమవుతుంది. ఇప్పుడైతే రాజా రవివర్మ గురించి అందరికీ తెలుసు. ఒక్కప్పుడు ఆయన అతి కొద్దిమందికే తెలుసు. ఆయన చిన్నప్పుడు తన బొమ్మలను అందరూ గుర్తించాలనుకొనేవారు. రకరకాలుగా చిత్రాలను వేయటానికి ప్రయత్నించేవారు. రంగుల విషయంలో ప్రయోగాలు చేసేవారు. అలా కృషి చేయగా చేయగా ఆయనకు పేరు వచ్చింది. ఎంఎఫ్ హుస్సేన్ కూడా అంతే! ఆయన వాల్‌పోస్టర్లు పెయింట్ చేసేవారు. ఇప్పుడు వారి పెయింటింగ్స్ కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. వారి పేరు వెనక చాలా కృషి దాగి ఉంది.
ఒక మంచి పెయింటర్ తన పెయింటింగ్‌లను ఎలా మార్కెట్ చేసుకోవాలి?
ఆర్ట్ మార్కెట్‌కు సోషల్ మీడియా ఒక వరంలాంటిది. ఎవరైనా తమ పెయింటింగ్‌ల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియచెప్పాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభిస్తే చాలు. దాని ద్వారా పెయింటింగ్ ప్రేమికులకు దగ్గర కావచ్చు. అంతేకాదు... గ్యాలరీల నిర్వాహకులు కూడా చూస్తూ ఉంటారు. నేరుగా కొనేవాళ్లు కూడా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే- సోషల్ మీడియా పెయింటింగ్‌ను అందరి దగ్గరకు తీసుకువచ్చింది. మనకు నచ్చిన పెయింటింగ్‌ను కొనుగోలు చేసే స్వేచ్ఛని కలిగించింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మేము కూడా మా గ్యాలరీని ఇలాగే నడుపుతున్నాం. ఎవరైనా రావచ్చు. పెయింటింగ్‌ను కొనుగోలు చేయవచ్చు.
రవివర్మ మొదట్లో కొద్దికాలం కేవలం రాజకుటుంబాల వారి కోసమే చిత్రాలు వేసేవారు. ఆ తర్వాత ఆయన ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. తన పెయింటింగ్స్ ప్రపంచంలో అందరి దగ్గరకు చేరాలనుకున్నారు. లిథోగ్రాఫిక్ ప్రెస్‌ను ప్రారంభించి చిత్రాలు ముద్రించారు. ఆయన ఈ ప్రెస్‌ను ప్రారంభించి ఉండకపోతే ఆయన పెయింటింగ్స్ కొందరి దగ్గరే మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆయన పెయింటింగ్ ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్
అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం
Read Latest AP News And Telugu News