Share News

Kunchala Kaivalya Reddy: అంతరిక్షంలోకి తెలుగమ్మాయి

ABN , Publish Date - Nov 12 , 2025 | 06:14 AM

Telugu Girl Kaivalya Reddy Selected for Space Mission Training Youngest Indian to Create History

Kunchala Kaivalya Reddy: అంతరిక్షంలోకి తెలుగమ్మాయి

విజేత

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి పువ్వు పట్టగానే పరిమళిస్తుందంటారు. కుంచల కైవల్యరెడ్డికి ఈ నానుడి మెరుగ్గా వర్తిస్తుంది. ఎనిమిది, పదో తరగతుల్లోనే గ్రహశకలాలను కనుగొన్న ఈ 17 ఏళ్ల అమ్మాయి, తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న తెలుగమ్మాయిగా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా కైవల్య ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు...

ఆకాశం వైపు చూసిన ప్రతి ఒక్కరికీ అక్కడ కనిపించే నక్షత్రాలు, చంద్రుడిని దగ్గరి నుంచి చూడాలనీ, వాటిని తాకాలని అనిపిస్తుంది. వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది మిగిలి ఉంటూనే ఉంటుంది. ఖగోళ అంశాలు అంతటి విస్తృతమైనవి. అందర్లాగే నాక్కూడా చిన్నప్పటి నుంచి ఖగోళం పట్ల ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి వయసుతో పాటు పెరిగింది. అంతరిక్షం పట్ల ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వ్యోమగామిగా ఎదగాలని కలలు కంటారు. అలాగే నేను కూడా రెండో తరగతి చదివే వయసు నుంచే వ్యోమగామిగా ఎదగాలని కల కన్నాను. ఫ్లోరిడాలోని టైటాన్స్‌ స్పేస్‌ ఇండస్ట్రీస్‌ చేపట్టబోతున్న వ్యోమగామి శిక్షణ కోసం 36 దేశాల నుంచి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. చివర్లో ఎంపికైన 150 మంది అభ్యర్థుల్లో నేనొకదాన్ని. ఎంపిక ప్రక్రియలో భాగంగా టైటాన్స్‌ స్పేస్‌ ఇండస్ట్రీ సిఇఒ ఎస్‌. లాచ్‌మాన్‌తో పాటు చీఫ్‌ అస్ట్రోనాట్‌ విలయం మెక్‌ ఆర్థర్‌, సీవోవో అండ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ డా.వి.విజయ్‌ నన్ను గంట పాటు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేశారు. అంతరిక్షంలో అడుగుపెట్టబోయే అభ్యర్థిగా ఎంపికయ్యానని తెలిసినప్పుడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కల నిజమవడం గొప్ప అనుభవం.

తల్లిదండ్రుల తోడ్పాటుతో...

కుటుంబ తోడ్పాటు ఉన్నప్పుడు ఏ కలనైనా నిజం చేసుకోగలుగుతాం! నా విషయంలో అదే జరిగింది. ఇది కఠినమైన రంగమనీ, ఈ రంగంలో మహిళలకు అవకాశాలు కష్టమనీ అంటూ ఉంటారు. అయినా మా పేరెంట్స్‌ నన్ను ప్రోత్సహించారు. రెండో తరగతిలో ఉన్నప్పుడు ఒక పుస్తకం అమ్మ దగ్గరకు తీసుకువెళ్లి ఆ పుస్తకం మీద కనిపిస్తున్న వ్యక్తులెవరు? అని అడిగాను. వాళ్లు సునీతా విలియమ్స్‌, మిగతా వ్యోమగాములనీ, వాళ్లందరూ అంతరిక్షంలోకి వెళ్లారనీ అమ్మ చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత ఏదో ఒకనాటికి అంతరిక్షంలోకి వెళ్లాలని అప్పుడే అనుకున్నాను. అప్పటి నుంచి అంతరిక్షం గురించి నేను అడిగే ప్రశ్నలకు పేరెంట్స్‌ సమాధానాలు చెప్తూ, పుస్తకాలు అందిస్తూ, నా ఆసక్తిని మరింత ప్రోత్సహించారు. భవిష్యత్తులో ఆస్ట్రో ఫిజిక్స్‌ చదవాలన్నది నా కల. ఈ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం నోబెల్‌ బహుమతి. కాబట్టి నేను కూడా రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా ఎదిగి, నోబెల్‌ బహుమతిని గెలవాలని భావిస్తున్నాను.


000000-navya.jpg

మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు

టిఎస్‌ఎ శిక్షణ రెండేళ్ల పాటు కొనసాగుతుంది. జీరో గ్రావీటీ పారాబొలిక్‌ ఫైట్స్‌లో భాగంగా స్కూబా డైవింగ్‌, స్కై డైవింగ్‌లలో శిక్షణ సాగుతుంది. మేం అంతరిక్షంలో భిన్నమైన పరిశోధనలు చేపట్టబోతున్నాం. అంతరిక్షంలో మానవ శరీరం కొన్ని మార్పులకు లోనవుతుంది. ఆ సమయంలో ఎలాంటి భౌతిక, మానసిక మార్పులు చోటుచేసుకోబోతున్నాయో తెలుసుకోబోతున్నాం. 2025 నాటికి గాల్లో ఎగిరే కార్లు అందుబాటులోకొస్తాయని 1990ల్లో అనుకున్నారు. మున్ముందు భూగ్రహం మీద కాకుండా అంతరిక్షంలో నివసించే అవకాశాలు ఉండొచ్చని ఇప్పుడు మనందరం అనుకుంటున్నాం. భవిష్యత్తులో అంతరిక్షంలో నివసించే అవసరం ఏర్పడ్డప్పుడు, అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఎలా అలవాటు పడాలో తెలియాలంటే అందుకు తోడ్పడే పరిశోధన సాగాలి. ఇప్పుడు నేను ఎంపికైన అంతరిక్ష యాత్ర కూడా ఆ పరిశోధనలో భాగమే!

రమేశ్‌ నాగేంద్ర పలసల, రాజమండ్రి

కైవల్య విజయ పరంపర 6వ తరగతి నుంచే మొదలైంది. నాసా ఫెసిలిటీతో అలబామాలోని ఎక్సా అమెరికాలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాంను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా కైవల్య ఘనత సాధించింది. నాసా ఫెసిలిటీతో ఈక్స్‌ఎ నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం-2023ను 15ఏళ్ల వయసులోనే పూర్తి చేసింది. 98 దేశాలు పాల్గొనే ఖగోళ, ఖగోళ భౌతిక శాస్త్ర పోటీల్లో సిల్వర్‌ హానర్‌ సర్టిఫికెట్‌ పొందింది. నాసా సిటిజెన్‌ సైంటిస్టుగా అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉండే ముఖ్యమైన ఆస్టరాయిడ్‌ బెల్ట్‌లోని 2020 పిఎస్‌24, 2021 సిఎం37 అనే రెండు ప్రివిజనల్‌ ఆస్టరాయిడ్స్‌ని కొనుగొంది. నాసా నిర్వహించే సైంటిస్ట్‌ ఫర్‌ ఎ డే-2021 వ్యాసరచన పోటీల్లో జాతీయ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇస్రో నిర్వహించిన స్పేస్‌ క్విజ్‌, సైన్స్‌ ఫెయిర్‌, ఆస్ట్రోఫొటోగ్రఫీ, వక్తృత్వంతోపాటు ఇతర పోటీల్లో అనేక అవార్డులను అందుకొంది.


మనమిప్పుడు ఆవిష్కరించిన అంశం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఒకప్పుడు న్యూటన్‌ కనిపెట్టిన లాస్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ అద్భుతమైన ఆవిష్కరణ. కానీ అప్పటి వాళ్లకు దాని విలువ తెలియదు. కానీ ఇప్పుడు కూడా న్యూటన్‌ లాస్‌ మనకు అక్కరకొస్తున్నాయి. నేను కూడా కొన్ని శతాబ్దాల పాటు ఉపయోగించుకోగలిగే అంశాలను ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. మా స్వస్థలం, బాపట్ల జిల్లా బేతంపూడి. నాన్న కుంచాల శ్రీనివాసరెడ్డి నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెం సచివాలయంలో కార్యదర్శిగా పని చేస్తున్నారు. అమ్మ కుంచాల విజయలక్ష్మీ గృహిణి. ప్రస్తుతం, ఆస్ట్రానమీ కిడ్స్‌ క్లబ్‌ సహ వ్యవస్థాపకురాలిగా, స్పేస్‌పోర్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ రాయబారిగా వ్యవహరిస్తున్నాను. జీరో గ్రావిటీ, పారాబొలిక్‌ ఫ్లైట్స్‌, స్కూబా డైవింగ్‌, ఈవా డైవింగ్‌, న్యూట్రల్‌ బోయన్సీ, హై-ఆల్టిట్యూడ్‌ స్కైడైవింగ్‌, ఎక్స్‌టెన్సివ్‌ మౌంటెన్‌ హైకింగ్‌ వంటి వాటిలో శిక్షణ పొందిన తర్వాత అభ్యర్థులందరం మా మా మిషన్‌ అసైన్‌మెంట్‌లను అందుకుని, అధునాత శిక్షణ దశలోకి ప్రవేశించడంతోపాటు శాస్త్రీయ ప్రయోగాలు చేపడతాం.

కైవల్య

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 06:22 AM