Share News

Teacher Kalyani Kumari: బడిని బతికించారు

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:32 AM

ఏడేళ్ల క్రితం... ఆ పాఠశాలలో ఇద్దరే విద్యార్థులు. ఆ బడిని మూసేయాలని అధికారులు భావిస్తున్న దశలో... ఉపాధ్యాయినిగా బాధ్యతలు చేపట్టారు కళ్యాణి కుమారి. ఇంటింటికీ వెళ్లి, తల్లిదండ్రులను ఒప్పించి... విద్యార్థుల సంఖ్య పెరిగేలా...

Teacher Kalyani Kumari: బడిని బతికించారు

  • రేపు ఉపాధ్యాయ దినోత్సవం

ఏడేళ్ల క్రితం... ఆ పాఠశాలలో ఇద్దరే విద్యార్థులు. ఆ బడిని మూసేయాలని అధికారులు భావిస్తున్న దశలో... ఉపాధ్యాయినిగా బాధ్యతలు చేపట్టారు కళ్యాణి కుమారి. ఇంటింటికీ వెళ్లి, తల్లిదండ్రులను ఒప్పించి... విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేశారు. ప్రస్తుతం 55 మంది పిల్లలు చదువుతున్న ఆ పాఠశాలలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. సర్వత్రా ప్రశంసలతోపాటు పలు పురస్కారాలను కూడా అందుకున్న కళ్యాణి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

పేదల జీవితాలు మారాలంటే అది విద్యతోనే సాధ్యమని కళ్యాణి కుమారి గట్టిగా నమ్ముతారు. ఆమెది కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన మధ్యతరగతి కుటుంబం. లక్ష్మీదేవి, నెట్టేకల్‌ దంపతులకు మూడో సంతానమైన ఆమె చదువు సరైన వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలో సాగింది. తండ్రి చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగి. ఆదోనిలో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన కళ్యాణికి... వైద్యశాఖలో పని చేస్తున్న రమే్‌షతో వివాహమయింది. భర్త ప్రోత్సాహంతో డీఎస్సీ పరీక్ష రాశారు. 2010లో హొళగుంద మండలంలోని నాగరకన్వి ప్రాథమిక పాఠశాలలో తొలిసారిగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆ తరువాత పత్తికొండ మండలం రాజీవ్‌నగర్‌ స్కూల్‌లో పని చేసేవారు. వాహన సౌకర్యం లేని ఆ ప్రాంతానికి రోజూ రెండున్నర కిలోమీటర్లు నడిచివెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పేవారు. తర్వాత పత్తికొండకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవరాళ్లమలతండా (జేఎం తండా) పాఠశాలకు 2017లో బదిలీ అయ్యారు. అప్పటికి ఆ బడిలో ఉన్నది ఇద్దరే విద్యార్థులు. దీనితో ఆ పాఠశాలను మూసివేయాలనే ప్రయత్నంతో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఇది కళ్యాణిని ఎంతగానో కలవరపరిచింది.


గడప గడపకూ తిరిగి...

‘‘ఆ గ్రామంలో 700 మందికి పైగా జనాభా ఉన్నారు. పాఠశాల హాజరు పట్టికలో 14 మంది పేర్లు ఉన్నప్పటికీ... బడికి వచ్చేవారు ఇద్దరే. కేవలం ఇద్దరికి పాఠాలు చెప్పి, జీతం తీసుకోవడం నాకు మనస్కరించలేదు. పరిస్థితులను నెల రోజులు పరిశీలించాను. అక్షరాస్యతకు నోచుకోని జేఎం తండాలోని పిల్లలను ఉన్నత విద్యావంతులుగా చేయాలనుకున్నాను. విద్యార్థులు రావాలంటే బడిని సుందరంగా మార్చాలనుకున్నాను. దానికి నా భర్త సహకారం తీసుకున్నాను. ఆయన ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ పాఠశాల సుందరీకరణలో భాగమయ్యారు’’ అని చెప్పారు కళ్యాణి. వారం రోజులపాటు వారిద్దరూ కష్టపడ్డారు. ముందుగా పాఠశాల పరిసరాల్లో తాగుబోతులు పారేసిన మద్యం సీసాలను, ఆ తరువాత పిచ్చి మొక్కలు, బండరాళ్లు, చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలను తొలగించారు. ఆ ప్రాంతాన్ని ఆహ్లాదమైన పార్కులా మార్చేశారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారితో సహా ఇంటింటికీ తిరిగి, పిల్లలను బడికి పంపాలని కోరారు. అయితే పిల్లలను తమతో పనులకు తీసుకువెళ్లడానికే తల్లిదండ్రులు మొగ్గుచూపారు. అయినప్పటికీ కళ్యాణి పట్టు వదలలేదు. పదే పదే తండాలో ప్రతి గడపకూ వెళ్లారు. నిరక్షరాస్యులైన వారి తల్లిదండ్రులను చివరకు ఒప్పించారు. ఆమె సంకల్పంలో తొలి అడుగు విజయవంతం అయింది. ఇద్దరు పిల్లల సంఖ్య పదికి చేరింది. ఆ తరువాత... పిల్లలకు పాఠాలు చక్కగా అర్థం కావడం కోసం చార్టులపై ఇంట్లోనే బొమ్మలు వేసి, పిల్లలకు వివరించేవారు. వారిలో ఆసక్తి పెంచడానికి ల్యాప్‌టా్‌పలో వీడియోలు చూపించారు. ఉదయం ప్రార్థన, సాయంత్రం ఆటలు... ఇలా అన్నీ క్రమం తప్పకుండా చేయించారు. ఇది గమనించిన గ్రామస్తులకు ఆమెపై గట్టి నమ్మకం ఏర్పడింది.


1-navya.jpg

ఆధునిక పద్ధతుల్లో బోధన

బోధనలో విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఆధునిక పద్ధతులను కళ్యాణి అనుసరిస్తున్నారు. ప్రతివారం విద్యార్థులకు వివిధ సబ్టెక్ట్స్‌లో ‘స్టార్‌ ఆఫ్‌ ది వీక్‌’ పేరుతో పరీక్షలు నిర్వహించి, చిన్న చిన్న బహుమతులతో విద్యపట్ల వారి అభిరుచిని పెంచారు. పాథమిక విద్య తరువాత... వివిధ పరీక్షలకు వారిని సిద్ధం చేస్తూ... ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో సీట్లు, సైనిక్‌ స్కూల్‌, గురుకుల, నవోదయ పాఠశాలల ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించేలా శిక్షణ ఇచ్చారు. గడిచిన అయిదేళ్లలో 35 మంది వివిధ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ఆలాగే ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’ పేరిట విద్యార్థుల పుట్టిన రోజులను నిర్వహించారు. అయితే స్వీట్లు, చాక్లెట్లు పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయన్న ఆలోచనతో... వాటికి బదులు సబ్బులు, షాంపూలు, టూత్‌ పేస్టులు, టూత్‌ బ్రెష్‌లను అందించారు. వారితో మొక్కలు నాటించారు. తద్వారా వారి వ్యక్తిగత పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఆమె దోహదపడుతున్నారు. ఆ పిల్లలందరూ పేద కుటుంబాలవారు కాబట్టి... వారికి కావలసిన పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని కొనడానికి, ఇతర సౌకర్యాల కోసం తన జీతంలో కొంతభాగాన్ని కళ్యాణి కేటాయించారు. సొంత డబ్బుతో అంగన్‌వాడీ బడికి దోమతెరలు, ఫ్యాన్లు, పేద పిల్లలకు పుస్తకాలు కొని ఇచ్చారు. ఆమె చొరవతో ఇప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 55కు చేరుకుంది. ఒకప్పుడు ఆ పాఠశాలను మూసేయాలనుకున్న అధికారులు ఇప్పుడు మరో ఉపాధ్యాయుడిని నియమించారు.


ఉద్యోగం కాదు, సామాజిక సేవ

మారుమూల గిరిజన తండా పిల్లల చదువుకోసం కృషి చేస్తున్న కళ్యాణి సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది జూన్‌ 2న అమరావతికి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ఆహ్వానించి సత్కరించారు. ఆమె చేసిన, భవిష్యత్తులో చేయాలనుకుంటున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె చెప్పిన పలు అంశాలను నోట్‌ చేసుకున్నారు. ‘‘ఉపాధ్యాయ వృత్తి ఆదర్శవంతమైనది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద వర్గాల పిల్లలకు కూడా ఎంతో ప్రతిభ ఉంటుందని నిరూపించాలనేది నా ప్రయత్నం. ఈ వృత్తిని ఉద్యోగంలా కాకుండా సామాజిక సేవగా భావిస్తున్నాను. కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. వంద కుటుంబాల్లో విద్యావంతులు ఉంటే సమాజం మరింత ముందంజ వేస్తుంది’’ అంటున్నారు కళ్యాణి.

చల్లా నవీన్‌కుమార్‌ నాయుడు,

కర్నూలు

అందరూ ప్రభుత్వ బడికే...

ఒకప్పుడు నాటుసారాకు నిలయంగా పేరుపడిన జేఎం తండా ఇప్పుడు సరస్వతీ పుత్రులకు చిరునామాగా మారుతోంది. పిల్లల పట్ల కళ్యాణి చూపించే శ్రద్ధకు ముగ్ధులైన ఆ గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాలవారు కూడా... ప్రైవేటు పాఠశాలలకు బదులు ఈ ప్రభుత్వ పాఠశాలకే తమ పిల్లల్ని పంపుతున్నారు. కళ్యాణి సేవలకు గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుతోపాటు ప్రతిభా పురస్కారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్నో అవార్డులు, ఇతర పురస్కారాలు స్వచ్ఛంద సంస్థలు, విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు సత్కారాలు పొందారు. అలాగే శ్రీశక్తి ప్రతిభా పురస్కార్‌, జ్యోతిరావు పూలే అవార్డులు కూడా ఆమెను వరించాయి.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Updated Date - Sep 04 , 2025 | 03:32 AM