Sunscreen: ఎండ నుంచి చర్మానికి రక్ష
ABN , Publish Date - Feb 25 , 2025 | 03:54 AM
ఎండాకాలం చర్మం నల్లబడకుండా ఉండాలంటే సన్‌స్ర్కీన్స్ వాడుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే! అయితే సన్‌స్ర్కీన్‌ను ఎలా ఎంచుకోవాలో, వాటినెలా వాడుకోవాలో కూడా తెలుసుకోవాలి. అప్పుడే ఎండకు చర్మం నల్లబడిపోకుండా సమర్థంగా అడ్డుకట్ట వేయగలుగుతాం!
సన్‌స్ర్కీన్‌ను ఎంచుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దాని లేబుల్ పైన సూచించిన వివరాలను అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి ఆ లేబుల్ మీద ఎస్‌పిఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్), పిఎ ఫ్యాక్టర్ (అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ) ఎంత పేర్కొని ఉందో గమనించాలి. వాటితో పాటు...
ఎస్‌పిఎఫ్: కనిష్ఠంగా 30 ఎస్‌పిఎఫ్ నుంచి గరిష్ఠంగా 100 ఎస్‌పిఎఫ్ వరకూ సన్‌స్ర్కీన్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. కొన్ని ఉత్పత్తుల మీద 10 నుంచి 15 ఎస్‌పిఎఫ్ ఉంటూ ఉంటుంది. కానీ ఇవి చర్మానికి ఎటువంటి రక్షణనూ కల్పించలేవు. అలాగే కొన్ని సన్‌స్ర్కీన్స్ లేబుళ్ల మీద సన్‌స్ర్కీన్‌తో పాటు విటమిన్ సి, మాయిశ్చరైజరు కూడా అదనంగా ఉన్నట్టు పేర్కొంటూ ఉంటారు. ఇలాంటివి కూడా నిరుపయోగమే! కాబట్టి కనిష్ఠంగా 30 ఎస్‌పిఎ్‌ఫను ఎంచుకోవాలి. ఎక్కువగా ఎండకు బహిర్గతమయ్యేవారు 60 అంతకంటే ఎక్కువ ఎస్‌పిఎఫ్ ఉన్న సన్‌స్ర్కీన్స్ వాడుకోవాలి. అలాగే చర్మపు అలర్జీలు ఉన్న వారు, ఎండకు చర్మం కమిలిపోయే సున్నిత చర్మం కలిగిన వారు కూడా ఎక్కువ ఎస్‌పిఎఫ్ ఉన్న సన్‌స్ర్కీన్స్ ఎంచుకోవాలి. అలాగే చర్మ చికిత్సలు చేయించుకున్న వాళ్లు కూడా ఇలాంటి అత్యధిక ఎస్‌పిఎఫ్ ఉన్న సన్‌స్ర్కీన్స్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది.
పిఎ ఫ్యాక్టర్: సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల ప్రభావంతో చర్మం దెబ్బ తింటుంది. కాబట్టి ఆ కిరణాల నుంచి రక్షణ కల్పించే అంశం సన్‌స్ర్కీన్‌లో ఉందో, లేదో గమనించాలి. ఈ అంశాన్ని సూచించే ప్లస్ గుర్తులు ఎన్ని ఎక్కువగా ఉంటే అతినీలలోహిత కిరణాల నుంచి అంత ఎక్కువ రక్షణ దక్కుతుంది.

నీలి రంగు రక్షణ: ఇళ్లలో లేదా కార్యాలయాల్లో కంప్యూటర్ల ముందు పని చేసేవారు నీలి రంగుకు బహిర్గతం అవుతూ ఉంటారు. దీని నుంచి రక్షణ కల్పించే బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా సన్‌స్ర్కీన్స్‌లో ఉండేలా చూసుకోవాలి.
పరారుణ రేడియేషన్: కొందరు వేడి వాతావరణంలో పని చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా గృహిణులు వంటగదిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వీళ్లకు ముందు నుంచే పిగ్మెంటేషన్ సమస్య ఉన్నప్పుడు, వేడికి బహిర్గతమవడం వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు, పరారుణ రేడియేషన్ (ఇన్‌ఫ్రారెడ్) కలిగి ఉన్న సన్‌స్ర్కీన్స్ వాడుకోవాలి.
వాటర్ రెసిస్టెంట్: ఈతకొలనుకు వెళ్లేటప్పుడు, సముద్రంలో మునిగేటప్పుడు వాటర్ రెసిస్టెంట్ సన్‌స్ర్కీన్స్ వాడుకోవాలి. ఈ అంశం కూడా లేబుల్ మీద గమనించాలి.
ఎలాంటి సన్‌స్ర్కీన్?
చర్మ తత్వాన్ని బట్టి అందుకు నప్పే సన్‌స్ర్కీన్స్ ఎంచుకోవాలి.
జెల్: జిడ్డు చర్మం కలిగిన వాళ్లు వాడుకోవాలి
క్రీమ్, ఆయింట్‌మెంట్, లోషన్: పొడి చర్మం కలిగిన వాళ్లు వాడుకోవాలి పౌడర్: ముఖానికి పూసుకున్న సన్‌స్ర్కీన్ జిడ్డుగా ఉందనిపించినప్పుడు, దాని పైన పౌడర్ సన్‌స్ర్కీన్ అద్దుకోవచ్చు.
టింటెడ్ సన్‌స్ర్కీన్స్
ఇవి మేకప్ ఫౌండేషన్ ప్రభావాన్ని కనబరిచే తత్వాన్ని కలిగి ఉంటాయి. మేక్‌పలో మాదిరిగా టింటెడ్ సన్‌స్ర్కీన్స్‌లో కూడా అందుకు తగ్గట్టు ‘ఐవరీ, బ్రాంజ్’ అనే రెండు రంగుల సన్‌స్ర్కీన్స్ అందుబాటులోకొచ్చాయి. తెల్లని చర్మం కలిగిన వాళ్లు ఐవరీ, ముదురు రంగు ఉన్నవాళ్లు బ్రాంజ్ వాడుకోవచ్చు. ఈ టింటెడ్ సన్‌స్ర్కీన్స్ వాడుకుంటే, అదనంగా ఇతరత్రా ఫౌండేషన్ల అవసరం తగ్గిపోవడంతో పాటు ఎండ నుంచి కూడా రక్షణ దక్కుతుంది.
ఎంత తరచుగా...
ఎండలోకి వెళ్లడానికి 30 నిమిషాల ముందే సన్‌స్ర్కీన్ పూసుకోవాలి. అలాగే వేసవి ఎండ తీవ్రత సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉంటుంది. కాబట్టి కనిష్ఠంగా ప్రతి రెండు గంటలకూ, గరిష్ఠంగా ప్రతి మూడు గంటలకూ, సన్‌స్ర్కీన్ పూసుకుంటూనే ఉండాలి. 30 ఎస్‌పిఎఫ్ సన్‌స్ర్కీన్ ఎండ నుంచి 95ు మేరకు రక్షణ కల్పిస్తుంది. 50 నుంచి 60 ఎస్‌పిఎఫ్ ఉన్న సన్‌స్ర్కీన్‌తో 98ు రక్షణ దక్కుతుంది. అయితే సన్‌స్ర్కీన్ ఎస్‌పిఎఫ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన తరచూ పూసుకోవలసిన అవసరం లేదనుకుంటే పొరపాటు. సన్‌స్ర్కీన్ వాడుకుంటున్నప్పటికీ సన్‌ట్యాన్ నుంచి పూర్తి రక్షణ పొందడం కోసం స్కార్ఫ్, చలువ కళ్లజోడు, గొడుగు, టోపీలు వాడుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక రోజు ఎక్కువ సమయం పాటు ఎండకు బహిర్గతమైతే, డీట్యాన్ మాస్కులు వాడుకుని, ఎండకు నల్లబడిన చర్మాన్ని సరిచేసుకోవచ్చు.
ఎండకు చర్మం నల్లబడిందా? కాలిందా?
ఎండకు బహిర్గతమై, చర్మం నల్లబడినట్టు అనిపించగానే వెంటనే టమాటా రసం, బంగాళాదుంప రసాలు లాంటివి పూసుకోకూడదు. చర్మ పరిస్థితి సర్దుకునే వరకూ కనీసం వారం రోజుల పాటైనా ఆగి, ఆ తర్వాతే ఇలాంటి చిట్కాలు పాటించాలి. కొన్ని సందర్భాల్లో ఎండకు చర్మం కాలి, పొక్కులు తలెత్తి, తోలు ఊడినట్టు, అట్ట కట్టినట్టు తయారవుతుంది. ఇలాంటప్పుడు ఇంటి చిట్కాలు పాటించకుండా చర్మ వైద్యులను కలిసి, చికిత్స తీసుకోవాలి.
పిల్లలకు, గర్భిణులకు
మార్కెట్లో దొరికే సన్‌స్ర్కీన్స్ రసాయనాలతో తయారవుతాయి. వీటితో పిల్లలూ, గర్భిణులూ దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకూ, గర్భిణులకూ సురక్షితమైన మినరల్ సన్‌స్ర్కీన్స్ అందుబాటులోకొచ్చాయి. జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ ఆధారిత సన్‌స్ర్కీన్స్‌తో అన్ని విధాలా సురక్షితమైనవి.
ఓరల్‌సన్‌స్ర్కీన్
పైపూత సన్‌స్ర్కీన్స్ సరిపోని సందర్భాల్లో నోటి మాత్రల రూపంలో తీసుకునే సన్‌స్ర్కీన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో కొచ్చాయి.
కొంతమంది సన్‌స్ర్కీన్స్ వాడకంతో చర్మం నల్లబడిందనీ, మొటిమలు మొదలయ్యాయనీ అంటూ ఉంటారు. చర్మ తత్వానికి తగిన సన్‌స్ర్కీన్‌ను ఎంచుకోలేకపోవడం వల్లే ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సన్‌స్ర్కీన్స్‌తో చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే వైద్యులు సూచించే సన్‌స్ర్కీన్స్‌నే వాడుకోవాలి.
డాక్టర్ స్వప్న ప్రియ
కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్,
కాస్మోస్యూర్ క్లినిక్,
హైటెక్ సిటీ, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.