Share News

Heart Attack: యువత గుండె ఆగిపోతోందా?

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:09 AM

ఉరకలేసే వయసులో చురుగ్గా పని చేయవలసిన గుండెలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి. కొన్ని క్షణాల ముందు వరకూ చలాకీగా, హుషారుగా కనిపించిన యువత హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న సంఘటనలు చూస్తున్నాం. ఈ సమస్య వెనకున్న కారణాలు, నివారణోపాయాల గురించి ప్రముఖ హృద్రోగ వైద్యులు స్టార్‌ హాస్పటల్స్‌ జాయింట్‌ ఎం.డీ. డాక్టర్‌ రమేష్‌ గూడపాటి వివరిస్తున్నారు.

Heart Attack: యువత గుండె ఆగిపోతోందా?

త మూడు నాలుగు దశాబ్ధాలుగా భారతీయుల్లో గుండెపోటు ముప్పు బాగా పెరిగింది. అంతే కాకుండా గుండెపోటు వచ్చే వయసు కూడా బాగా తగ్గింది. మునుపు 60 ఏళ్లు పైబడిన వాళ్లలో ఈ సమస్యను చూసేవాళ్లం. కానీ ఇటీవలి కాలంలో 30 అంతకంటే తక్కువ వయస్కులు గుండెపోటుకు లోనవుతున్న సంఘనలను చూస్తున్నాం. ఇందుకు కారణాలు లేకపోలేదు. అమెరికన్లు, యూరోపియన్లు, చైనీయులు, జపనీయులతో పోలిస్తే, భారతీయులు జన్యుపరంగా గుండె జబ్బులకూ, గుండె పోట్లకూ లోనయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక్కడున్న భారతీయులే కాదు, విదేశాల్లోనే పుట్టి పెరిగి, ఆయా జీవనశైలులను అనుసరించే భారతీయులు సైతం, గుండె జబ్బుల బారిన పడుతూ ఉండడాన్ని బట్టి, మన భారతీయులకు జన్యుపరమైన గుండె జబ్బుల ముప్పు విదేశీయుల కంటే విదేశీయుల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అయితే మనకు జన్యుపరమైన గుండెజబ్బుల ముప్పు ముందు నుంచే పొంచి ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే...

2.jpg

పొట్ట కొవ్వు : మనకు పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుంటూ ఉంటుంది. లావు పొట్ట కలిగి ఉన్నవాళ్లలో, అంతర్గత అవయవాల్లో కూడా కొవ్వు పేరుకుని ఉంటుంది. ఈ కొవ్వు శరీరానికి హాని కారకమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరిగి మధుమేహం బారిన పడడం, మంచి కొలెస్ట్రాల్‌ తక్కువగా, చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే జన్యుపరంగానే మనలో ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్‌ : మూడింట ఒక వంతు కొలెస్ట్రాల్‌ మనకు మన జీవనశైలి నుంచే అందుతుంది. మనం తినే ఆహారం, చేసే వ్యాయామం మీదే ఈ కొలెస్ట్రాల్‌ మోతాదు ఆధారపడి ఉంటుంది. రెండింట మూడో వంతు కొలెస్ట్రాల్‌ మన శరీరంలోనే తయారవుతుంది. ఈ కొలెస్ట్రాల్‌ మోతాదును మన జన్యువులు నిర్థారిస్తాయి. అయితే ఈ మొత్తం కొలెస్ట్రాల్‌లో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం, అది ఎక్కువ హానికారకమైన కోవకు చెంది ఉండడం వల్ల సహజంగానే గుండెకు జరిగే చేటు ఎక్కువ.

మధుమేహం : మనకు మధుమేహం ముప్పు కూడా ఎక్కువే! విదేశీయులతో పోలిస్తే, వాళ్ల కంటే మనకు మధుమేహం వచ్చే అవకాశాలు 20ు ఎక్కువ.


ముప్పు పెరిగిందిలా...

గుండె జబ్బుల ముప్పును పెంచే ఈ కారణాలు ఇప్పుడు కొత్తగా మనలో చోటుచేసుకున్నవి కావు. ఇవన్నీ ప్రారంభం నుంచీ ఉన్నవే! అయినా ఇటీవలి కాలంలో, మరీ ముఖ్యంగా యువతలో గుండెపోటు ముప్పు పెరగడానికి కారణం మన జీవనశైలి మార్పులే! మారుతున్న మన జీవనశైలి గుండెపోటు ముప్పును మరింత పెంచుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూసుకుంటే పట్టణాల్లో నివసించే వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉండడాన్ని బట్టి పట్టణ జీవనశైలి కూడా గుండెపోట్లకు కారణమవుతోందని నిర్థారించుకోవచ్చు. శారీరక వ్యాయామం లోపించడమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే మన ఆహారశైలి కూడా బాగా మారిపోతోంది. స్విగ్గీలు, జొమాటోలతో బయటి ఆహారం చిటికెలో చేతికందుతోంది. అలాగే రుచిగా ఉండే పదార్థాలన్నీ ఎక్కువ చక్కెరలు, నూనెలతో తయారవుతూ ఉంటాయి. కాబట్టి వాటినే మనం ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాం. ఊబకాయం, మధుమేహాల పెరుగుదలకు ఇలాంటి ఆహారశైలే కారణం. అలాగే ప్రస్తుతం పోటీతత్వం విపరీతంగా పెరిగింది. వృత్తిలో, చదువులో ముందుండడం కోసం పెట్టే ఈ పరుగులో మనకు తెలియకుండానే ఒత్తిడి పెరుగుతోంది. వీటితో పాటు మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు కూడా గుండెజబ్బుల ముప్పుకు తోడవుతున్నాయి. కంటికి కనిపించని మరొక భూతం, వాతావరణ కాలుష్యం. అయితే పెరిగే వయసు (60 ఏళ్లు దాటిన తర్వాత గుండెపోటుకు గురయ్యే ముప్పు పెరుగుతుంది), గుండెజబ్బుల కుటుంబ చరిత్ర కలిగి ఉండడం (60 ఏళ్ల లోపు గుండెపోటుకు గురవడం) లాంటి సరిదిద్దే వీలు లేని కారణాలను మినహాయించి, ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌, అధిక బరువు, శారీరక వ్యాయామం లోపించడం లాంటి సరిదిద్దే వీలున్న వాటి మీద దృష్టి పెట్టగలిగితే కచ్చితంగా గుండెపోట్లను నివారించుకోగలుగుతాం!

gfj.jpg

నివారణ మన చేతుల్లోనే...

యువతలో గుండెపోటుకు వేర్వేరు కారణాలుంటాయి. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో క్రమేపీ అడ్డంకులు ఏర్పడడం వల్ల ప్రధానంగా గుండెపోటు వస్తుంది. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న కొందర్లో అకస్మాత్తుగా గుండెపోటు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయే వాళ్లు ఈ కోవకు చెందుతారు. కొందర్లో వ్యాయామం చేసే సమయంలో గుండె రక్తనాళాలు చిట్లి, వాటిలో రక్తపు గడ్డలు ఏర్పడి గుండెపోటు రావచ్చు. కొందర్లో ముందు నుంచే గుండె కండరాల బలహీనత లాంటి సమస్యలు ఉండడం వల్ల గుండె పోటు తలెత్తవచ్చు. అయితే ఈ ముప్పులను నివారించడం కోసం పుట్టుకతోనే సంక్రమించుకున్న జన్యువులను మార్చుకోలేం కాబట్టి కనీసం జీవనశైలినైనా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అదెలాగంటే...

ఏం తింటున్నామో గమనించుకోవాలి. ఆరోగ్యాన్ని అందించే ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి

వారంలో ఐదు రోజులు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి

ప్రతి రోజూ వ్యాయామానికి సమయాన్ని కేటాయించలేని వాళ్లు వారం మొత్తంలో రెండు, మూడు విడతల్లో రెండున్నర గంటల వ్యాయామాన్ని పూర్తి చేయాలి

శరీరాన్ని చురుగ్గా ఉంచే ఏరోబిక్‌ వ్యాయామం (నడక, క్రీడలు, పరుగు)తో పాటు, బరువులెత్తే వ్యాయామాలు కూడా చేయాలి


నిద్ర అత్యవసరం

ఆరు గంటల నిద్ర ఆరోగ్యానికి అవసరం. నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. జీవనశైలి దెబ్బతింటుంది. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి నిద్ర విషయంలో రాజీ పడకూడదు. అలాగే ఒత్తిడిని కూడా అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కాలక్షేపం చేయడం, పని ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కొన్ని పనులను కింది స్థాయి ఉద్యోగులతో పంచుకోవడం చేయాలి. అలాగే వాస్తవిక అంచనాలతో లక్ష్యాలను ఏర్పరుచుకోవడం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నాను కాబట్టి వ్యాయామం చేయలేను అనే వాళ్లుంటారు. కానీ నిజానికి వ్యాయామంతో విడుదలయ్యే ఫీల్‌ గుడ్‌ హార్మోన్లతో ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించే సాధనంగా వ్యాయామాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు లాంటి ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.

అపోహలు

లక్షణాలేవీ లేవు కాబట్టి నాకు గుండె సమస్య ఉండదు అనుకోవడం అపోహ మాత్రమే!

ఫిట్‌గా ఉన్నంత మాత్రాన, ఆరోగ్యకరమైన ఆహారశైలిని అనుసరిస్తున్నంత మాత్రాన గుండె సమస్యలు రావనుకోవడం కూడా అపోహే!

మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలు లేవు కాబట్టి గుండె జబ్బులు రావు అనుకోవడం కూడా అపోహే!

కొవిడ్‌ తర్వాత గుండెజబ్బులు పెరిగాయి అన్నది కూడా అపోహే! కొవిడ్‌తో, కొవిడ్‌ వ్యాక్సిన్‌తో ముడిపడిన గుండెపోట్లు ఆ కాలానికే పరిమితం. ఆ ప్రభావం ఇప్పటివరకూ కొనసాగే వీలు లేదు.


పరీక్షలు క్రమం తప్పకుండా...

గుండె పోటుకు దారితీసే ముప్పును ముందుగానే పసిగట్టాలంటే పరీక్షలు చేయించుకోవాలి. 25 నుంచి 30 ఏళ్ల వయస్కులు ఏడాదికి ఒకసారైనా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో కొలెస్ట్రాల్‌, రక్తపోటు, మధుమేహం ముప్పులు కనిపిస్తే, అప్పటి నుంచి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలను కొనసాగిస్తూ ఉండాలి. ముప్పు లేని వాళ్లు ఐదేళ్లకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 50 ఏళ్లు దాటిన వాళ్లు, మధుమేహం, అధికరక్తపోటు ఉన్న వాళ్లు, ఊబకాయులు, ధూమపానం అలవాటున్నవాళ్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే 60 ఏళ్లలోపు గుండె జబ్బుల కుటుంబ చరిత్ర కలిగి ఉన్నవాళ్లు కూడా పాతికేళ్ల వయసు నుంచి, ఏడాదికోసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా పరీక్షలు చేయించుకుంటూ ఉండడం వల్ల ముందస్తుగానే ఆరోగ్య సమస్యలను కనిపెట్టగలుగుతాం! గుండెజబ్బులను ప్రారంభ దశల్లోనే గుర్తించగలుగుతాం!

బీజాలు బాల్యంలోనే....

గుండెపోటు బీజాలు బాల్యంలోనే నాటుకుంటాయి. రెండు, మూడేళ్ల వయసు పిల్లల్లో కొలెస్ట్రాల్‌ నిల్వలు పేరుకుపోవడం మొదలుపెట్టి, వయసు పెరిగేకొద్దీ తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. కాబట్టి చిన్న వయసు నుంచే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో ఒరిగే ప్రయోజనాల గురించి వివరించాలి. వీడియోగేమ్స్‌, ఫోన్లు, టివిల కాలక్షేపానికి బదులుగా ఆరుబయట ఆటలకు పిల్లలను ప్రోత్సహించాలి. ఇలా ఆరోగ్యకరమైన ఆహారాన్నీ, వ్యాయామాన్నీ జీవనశైలిలో భాగం చేయగలిగితే, పెరిగి పెద్దయ్యాక కూడా అదే జీవనశైలిని కొనసాగించగలుగుతారు. ఫలితంగా గుండెపోట్ల ముప్పు నుంచి తప్పించుకోగలుగుతారు.


మద్యం పరిమితంగానే...

మద్యపానం కచ్చితంగా ఆరోగ్యానికి ఎంతో కొంత నష్టం చేకూరుస్తుంది. అయితే ఆ అలవాటున్న వాళ్లు గుండెకు చేటు కలగకుండా ఉండడం కోసం, మద్యాన్ని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. వేర్వేరు మద్యాల్లో ఆల్కహాల్‌ మోతాదులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్‌ మోతాదు ఆధారంగా మద్యం పరిమితిని నిర్దేశించుకోవాలి. విస్కీ, రమ్‌, బ్రాండీల్లో ఆల్కహాల్‌ మోతాదు 40% మేరకు ఉంటుంది కాబట్టి వీటిని రోజుకు 90 మిల్లీ లీటర్లకే పరిమితం చేయాలి. బీర్‌ (7% - 9%), వైన్‌ (20ు) లాంటివి వాటిలోని ఆల్కహాల్‌ మోతాదును బట్టి 180 మిల్లీలీటర్లకు మించకుండా చూసుకోవాలి. మహిళలు దీన్లో సగం మాత్రమే తీసుకోవాలి. అయితే మితిమీరిన మద్యం ప్రమాదకరం అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 04:13 AM