ఈ యోగం గురించి ఆనాడే...
ABN , Publish Date - May 02 , 2025 | 04:06 AM
‘‘ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మాత్రమే మానవులు అత్యున్నతమైన ఆనంద స్థితికి చేరుకోగలరు. దీనికోసం తపస్సులు చేయనక్కరలేదు. ఉపవాసాలు ఉండనక్కర్లేదు. ఏ కులం, మతం, ప్రాంతం వారైనా, పురుషులైనా, స్త్రీలైనా దాన్ని...
సహజయోగ
‘‘ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మాత్రమే మానవులు అత్యున్నతమైన ఆనంద స్థితికి చేరుకోగలరు. దీనికోసం తపస్సులు చేయనక్కరలేదు. ఉపవాసాలు ఉండనక్కర్లేదు. ఏ కులం, మతం, ప్రాంతం వారైనా, పురుషులైనా, స్త్రీలైనా దాన్ని సాధించవచ్చు’’ అని ప్రబోధించడమే కాదు... సహజయోగ ద్వారా దాన్ని ఆచరణాత్మకంగా నిరూపించారు శ్రీమాతాజీ నిర్మలాదేవి. కాగా, ఇటువంటి మార్గాన్ని మానవాళికి చూపించడానికి ఒక యోగి రాక గురించి, ఆ యోగం తాలూకు లక్షణాల గురించి పూర్వ గ్రంథాలలో ప్రస్తావన ఉండడం విశేషం. సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షిని జ్యోతిష శాస్త్రానికి ఆద్యుడిగా భావిస్తారు. ఆయన ‘భృగు సంహిత’ కన్నా ముందే గొప్ప నాడీ గ్రంథాన్ని (భృగు నాడి) రచించారు. పురాతన జ్యోతిష గ్రంథాల్లో నేటికీ దాన్ని ప్రామాణికమైనదిగా పరిగణిస్తారు. దీనిలో భవిష్యత్తులో జరగబోయే గొప్ప ఆధ్యాత్మిక సంఘటనలను కూడా అందులో వివరించారు. ఆ గ్రంథాన్ని మూడు వందల ఏళ్ళ క్రితం ఆచార్య శ్రీభుజేందర్ మరాఠీ భాషలో తర్జుమా చేశారు. అందులో ప్రస్తావితమైన భవిష్య వాణి ప్రకారం:
ఇప్పుడు అందరికీ సాధ్యమే...
బృహస్పతి మీనరాశిలో ఉన్నప్పుడు... పరబ్రహ్మ స్వరూపమైన ఒక గొప్ప యోగి భూమిపై అవతరిస్తారు. కొన్నేళ్ళ తరువాత... ఒక కొత్త యుగం ప్రారంభం అవుతున్నట్టు చాలామందికి స్పష్టంగా తెలుస్తుంది. మానవుడి జీవితం సంపూర్ణ పరివర్తనకు లోనవుతుంది. అలాంటి సమయం ఆసన్నమయ్యేవరకు... ఒక యోగి లేదా భక్తుడు మోక్షం ద్వారా లభించే ఆనందం పొందాలన్నా, జీవిత పరమార్థం తేలుసుకోవాలన్నా కేవలం భక్తి, జ్ఞానం, ప్రాచీన యోగమార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యం. కానీ దానికోసం అతను తన సూక్ష్మ శరీరంలో నిద్రాణ స్థితిలో ఉన్న వివిధ చక్రాల శక్తులను మేలుకొలపడం కోసం, కుండలినీ శక్తి ఉద్దీపన కోసం తీవ్రమైన తపస్సు చేయవలసి ఉంటుంది. కానీ ఆ గొప్ప యోగి రూపొందించే సరికొత్త యోగ పద్ధతి ద్వారా మానవులు తమ జీవితకాలంలోనే మోక్షం తాలూకు ఆనందాన్ని పొందగలుగుతారు. దేనినీ త్యాగం చేయవలసిన అవసరం ఉండదు. అప్పటిదాకా గొప్ప గొప్ప యోగులు మాత్రమే... అదికూడా వారు సమాధి స్థితికి చేరుకొని, మరణించడానికి ముందు మాత్రమే ఈ బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతారు. కానీ ఈ కొత్త తరహా యోగం ద్వారా సమాధి స్థితిలోకి చేరకుండానే అది సాధ్యం అవుతుంది. ప్రారంభంలో ఈ యోగాన్ని, తద్వారా మోక్షాన్ని పొందడం లక్షల్లో ఒకరికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ తరువాతి కాలంలో మానవ జాతి మొత్తానికి అది వ్యాప్తి చెందుతుంది. అప్పుడు ప్రజలు నిత్యావసరాలకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. వారు సాధారణ జీవితాలను గడుపుతూనే... ఈ యోగ పద్ధతి ద్వారా భగవంతుడితో ఐక్యతను అనుభూతి చెందుతారు. అజ్ఞానం, మాయ ముసుగులు తొలగిపోతాయి. గతంలో యోగులు చాలా కష్టపడి, తీవ్ర తపస్సు ఫలితంగా సాధించిన అనంతమైన ఆనందం, మోక్షం ఎంతోమంది మానవులకు సులభంగా అందుబాటులోకి వస్తుంది.
కొత్తదేం కాదు...
ఆ గ్రంథంలో పేర్కొన్న సమయం... నిర్మలాదేవి సహజయోగ పద్ధతిని ఆవిష్కరించిన సమయం దాదాపుగా సరిపోతున్నాయి. ఆమె భౌగోళికంగా భారతదేశానికి మధ్యలో ఉన్న చింద్వారా ప్రాంతంలో... పగలు, రాత్రి సమానంగా ఉండే విషువత్తు రోజున... 1923 మార్చి 21 మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు. 1970 మే 5వ తేదీన సహజ యోగ మార్గాన్ని ఆవిష్కరించచారు. ఎలాంటి తపస్సులు, బాధలు, ఉపవాసాలు లేకుండా, అన్ని కోరికలను త్యజించాల్సిన అవసరం లేకుండా... దీని ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చునని స్పష్టం చేశారు. కుండలినీ శక్తిని ఆమె ఉత్థానం చేయడాన్ని, ఆ శక్తి ఉత్థానం చెందినప్పుడు వివిధ చక్రాల వద్ద కలిగే ప్రతిసఁందించడాన్ని వేలాదిమంది తిలకించారు. తరువాత ఎందరో ఈ మార్గంలోకి ప్రవేశించి, సహజయోగను ఆచరించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఋషులు కఠోరమైన తపస్సు చేస్తే కాని సాధ్యం కాని కుండలినీ శక్తి జాగృతి... నేడు సాధారణ గృహస్థ జీవితం గడుపుతున్న సామాన్యులకు ఎలా సాధ్యమయిందనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... ‘‘మానవాళి తమ పరిణామక్రమంలో అత్యున్నత స్థాయికి చేరుకొనే సమయం ఇప్పుడు ఆసన్నమయింది కాబట్టి. వారిలోపల ఉన్నదాన్నే నేను పరిచయం చేశాను. కొత్తగా ఏదీ వారికి ఇవ్వడం లేదు’’ అని చెప్పారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో సహజయోగులు ఉన్నారు. సహజయోగపై పరిశోధనలు చేసినవారు పలు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ప్రదానం చేశాయి.
ఢిల్లీ విశ్వవిద్యాలయం సహజయోగను ప్రత్యామ్నాయ వైద్యంగా గుర్తించింది. సహజయోగ సాధనలో ఉద్భవించే చైతన్య తరంగాల ద్వారా వ్యాధులను ముందే గుర్తించి, నయం చేసే పద్ధతులు కూడా అభివృద్ధి చెందుతున్నాయి.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..