Disability Empowerment: చక్రాల కుర్చీతోఅందలానికి!
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:13 AM
జీవితంలో ఎదురైన ఎన్నో పరిస్థితులు పలు విధాలుగా నాకు స్ఫూర్తినిచ్చాయి..
పరిస్థితులే స్ఫూర్తినింపాయి
జీవితంలో ఎదురైన ఎన్నో పరిస్థితులు పలు విధాలుగా నాకు స్ఫూర్తినిచ్చాయి. ఎవరైనా ‘ఇది నీ వల్ల కాదు’ అంటే దాన్ని సవాలుగా తీసుకుని చేసి చూపించేదాన్ని. వైఫల్యాలే విజయానికి మార్గం. ఓడిపోతే అక్కడే ఆగిపోకుండా, కష్టపడి పైకి లేచి పూనుకుంటే విజయం సొంతమవుతుంది. మనసు పెట్టి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. వ్యాపారంలో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. కానీ పనిని కష్టపడి కాకుండా ఇష్టపడి చేయగలిగితే విజయం సొంత మవుతుంది.
- స్మినూ జిందాల్
స్మినూ.. హరియాణాలోని హిసార్‌లో ఓ వ్యాపార కుటుంబంలో పుట్టారు. ఆనందంగా సాగుతున్న ఆమె జీవితం పదకొండేళ్ల వయసులో ఊహించని మలుపు తిరిగింది. జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా కారు ప్రమాదానికి గురయ్యారు. అదృష్టం బాగుండి ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ ప్రమాదంలో వెన్నుపూసకు బలమైన గాయం కావడంతో నడుము కింద భాగం చచ్చుబడింది. తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ ఇంక చేయలేనని ఎంతో బాధపడ్డారామె. ఆ సమయంలో తల్లితండ్రులు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. వైకల్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేసిన వాళ్లెంతో మంది ఉన్నారని ఆమెకు ధైర్యం నూరిపోశారు. ఒక సందర్భంలో తన తల్లితండ్రులు అందించిన బాసట గురించి స్మినూ గుర్తు చేసుకుంటూ... ‘‘అమ్మానాన్న నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అలాగని నన్నెప్పుడూ అతి గారాబం చేయలేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఉద్యోగం కోసం పోరాటం...
స్మినూ నడవలేదని తల్లిదండ్రులు ఆమెను ప్రత్యేక పాఠశాలకు పంపలేదు. సాధారణ బడికే పంపించారు. అలా కష్టపడి చదివి ఎంబీఏ పూర్తి చేశారామె. తరువాత వ్యాపార రంగంలోకి రావాలనుకున్నారు. కానీ ఆమె తండ్రి పీఆర్ జిందాల్, అందుకు ఒప్పుకోలేదు. మొదటి నుంచి స్మినూ కుటుంబంలో ఆడవారు వ్యాపారాలు చేయలేదు. చివరకు ఎంతో కష్టపడి తన తండ్రిని ఒప్పించి, తండ్రి కంపెనీ ‘జిందాల్ సా లిమిటెడ్’లోనే ట్రైనీగా చేరారామె. తరువాత అంచలంచెలుగా మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. పురుషాధిక్యతతో కూడిన ఇనుము, ఉక్కు పైప్‌లైన్ల తయారీ రంగంలో స్మినూను ఎవరూ స్వాగతించలేకపోయారు. సహనంతో వారిలో మార్పు కోసం ఎదురుచూసి విజయం సాధించారామె. కంపెనీని అమెరికా, యూరప్, అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలకు విస్తరింపచేశారు. కంపెనీ టర్నోవర్‌ను వేల కోట్ల రూపాయలకు పెంచారు. ఆ విధంగా ‘ఫార్ట్యూన్ ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్-2025’ జాబితాలో చోటు కూడా దక్కించుకునే స్థాయికి ఎదిగారామె.
‘స్వయం’ సేవ...
చిన్న వయసు నుంచే చక్రాల కుర్చీకి పరిమితమైన స్మినూ.. తనలాంటి వారికోసం ఏదైనా చేయాలనుకున్నారు. అందుకే ‘స్వయం’ పేరిట ఓ లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. దీని ద్వారా దివ్యాంగులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీల్‌ఛైర్‌లు అందిస్తున్నారు. అలాగే ‘స్వయం’ ద్వారా అనేక మంది దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తున్నారు. వృద్ధులు, గర్భిణులకు కూడా ప్రాథమిక అవసరాల్లో సహాయపడుతూ ప్రభుత్వ పథకాల గురించి ఈ సంస్థ అవగాహన కల్పిస్తోంది. ‘స్వయం’ ద్వారా చేస్తున్న సేవలకు గాను స్మినూ.. లారియల్ పారిస్ ఫెమీనా ‘ఫేవరెట్ ఫేస్ ఆఫ్ కాజ్’ అవార్డు కూడా ఆమె అందుకున్నారు.
ప్రేమ పెళ్లి..
స్మినూకు ఇంట్లో వాళ్లు వ్యాపార కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆమె వ్యాపార నేపథ్యం లేని ఇంద్రదేశ్ బాథ్రా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు అబ్బాయిలు. వ్యాపారాన్ని వృద్ధి చేయడంతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నెరవేరుస్తాననీ, అర్థం చేసుకునే కుటుంబం దొరకడం తన అదృష్టమనీ స్మినూ అంటున్నారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News