Share News

Gaddar Cinema Awards: చిన్న సినిమాలకు పెద్ద గౌరవం

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:00 AM

తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ సినిమా అవార్డులు ప్రకటించింది. చిన్న సినిమాలకు పెద్ద గౌరవం లభించగా, బాలయ్యకు మూడు అవార్డులు లభించడం విశేషం.

Gaddar Cinema Awards: చిన్న సినిమాలకు పెద్ద గౌరవం

ధ్నాలుగు సంవత్సరాల తరవాత తెలుగు చిత్ర పరిశ్రమలో అవార్డుల సందడి మళ్లీ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘గద్దర్‌ సినిమా అవార్డు’లను ప్రకటించింది. ఏడాదికి మూడు చొప్పున పదేళ్ల అవార్డులను ఒకేసారి ప్రకటించారు. ఈ అవార్డులు పొందిన వాటిలో పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలకు కూడా సముచిత ప్రాధాన్యం లభించింది.

ఈసారి గద్దర్‌ అవార్డులు పొందిన ‘పొట్టేల్‌, బలగం, 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్లు, అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌, కలర్‌ ఫొటో’ వంటి చిన్న చిత్రాలు బాక్స్‌ ఆఫీసు వద్ద కూడా విజయం సాధించాయి. పైగా ఈ చిత్రాలన్నీ గ్రామీణ నేపథ్యంలో తీసినవే! తెలుగు ప్రాంత సంస్కృతిని ప్రతిబించేవే! ఉదాహరణకు ‘కమిటీ కుర్రోళ్లు’ పూర్తి గ్రామీణ నేపథ్యంలో తీసిన చిత్రం. పైగా ఈ సినిమాలో దర్శకుడు సహా అందరూ కొత్తవారే! ఈ చిత్రాన్ని తెరకెక్కించిన యధువంశీకి ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు దక్కింది. ఇక ‘35 చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. ఇందులో నటించిన నివేదా థామస్‌ ఉత్తమ నటిగా, మాస్టర్‌ అరుందేవ్‌ పోతుల, బేబీ హారిక ఉత్తమ బాల నటులుగా అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ సినిమాలో పిల్లలతోపాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ‘బలగం’ ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమా కథ చావు చుట్టూ తిరుగుతుంది. పల్లెల్లో బంధాలు, అనుబంధాలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పింది. కంటెంట్‌ బావున్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనే విషయాన్ని ఈ చిత్రం చెప్పకనే చెప్పింది. సమాజంలోని అంతరాలు, పరువు, ప్రేమ నేపథ్యంలో వచ్చిన


‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యూరో’ పెద్ద విజయమే సాధించింది. కులాల మధ్య అంతరాన్ని, ఆర్థిక అసమానతలను ఈ చిత్రంలో దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏటా మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం సినీ అభిమానుల్లో అసక్తిని కలిగించింది. ఉత్తమ కేటగిరీ చిత్రంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలను ప్రకటించారు. ఇలా ఎంపిక చేసిన 30 సినిమాల్లో సింహ భాగం సూపర్‌ హిట్‌ అయినవే. మొదటి ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన ‘రన్‌ రాజా రన్‌, రుద్రమదేవి, శతమానం భవతి, బాహుబలి, మహానటి, మహర్షి, అల వైకుంఠపురములో, ఆర్‌ఆర్‌ఆర్‌, సీతారామం’ మొదలైనవి ప్రేక్షకుల ఆదరణతో పాటుగా బాక్స్‌ఆఫీసు విజయాలు కూడా సాధించాయి.

  • బాలయ్యకు 3 అవార్డులు

ఈ అవార్డుల్లో మరో గొప్ప విశేషం ఏమిటంటే.. 2021 సంవత్సరానికి గాను నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ రెండో ఉత్తమ చిత్రంగా, 2023లో ‘భగవంత్‌ కేసరి’ మూడో ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యాయి. వీటితోపాటు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు సైతం బాలకృష్ణను వరించింది. బాలయ్య నటుడిగా 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభతరుణాన ఒకేసారి మూడు అవార్డులు రావడం నిజంగా విశేషమే.

Updated Date - Jun 01 , 2025 | 04:01 AM