శాంతిని అన్వేషిద్దాం
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:10 AM
మనం ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మనకు ఎన్ని బాధ్యతలు ఉండేవి? చాలా తక్కువ. రెండో తరగతికి, మూడో తరగతికి వెళ్ళాక బాధ్యతలు తగ్గాయా, పెరిగాయా? బాధ్యతలు పెరుగుతూనే మన హైస్కూల్ చదువు...
చింతన
మనం ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మనకు ఎన్ని బాధ్యతలు ఉండేవి? చాలా తక్కువ. రెండో తరగతికి, మూడో తరగతికి వెళ్ళాక బాధ్యతలు తగ్గాయా, పెరిగాయా? బాధ్యతలు పెరుగుతూనే మన హైస్కూల్ చదువు పూర్తవుతుంది. కాలేజీలో చేరాక... ఆ బాధ్యతలు ఇంకా ఎక్కువవుతాయి. పెళ్ళి చేసుకున్నాక బాధ్యతల భారం పెరగడం తప్పితే తగ్గదు. అలాగే ఉద్యోగంలో పదోన్నతులు వచ్చిన కొద్దీ బాధ్యతలు అధికమవుతాయి. అంటే... వయసు పెరుగుతున్నకొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయని అర్థం. ఈ బాధ్యతలన్నీ తీరిపోయే రోజు ఒకటి వస్తుందని చాలామంది పగటికలలు కంటూ ఉంటారు. కానీ ఆ బాధ్యతలు ఎన్నటికీ తీరవు. వాటి మధ్యనే మనిషి మనుగడ సాగిస్తున్నాడు.
ఊరట పొందాలంటే...
బాధ్యతలు ఎన్ని ఉన్నా, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించే వ్యక్తి అయినా... ఆహారం తీసుకోకపోతే ఆకలితో అలమటిస్తాడు. ఆకలి వేస్తే ఆహారం తినాలి, దాహం తీరాలంటే నీరు తాగాలి. ఎందుకంటే ఇవన్నీ మానవుడి మౌలిక అవసరాలు. శ్వాస తీసుకోవడానికి కూడా నాకు సమయం లేదు ఎవరైనా అంటే, నిజంగానే వారికి ఆ సమయం లేకపోతే... మూడు నాలుగు నిమిషాల తరువాత ఆ వ్యక్తి లోకాన్ని విడిచిపోతాడు. మనకు శ్వాస ఎంతో అవసరం. అలాగే ఎన్నో బాధ్యతలున్నాయని ఎవరైనా నిద్రపోకుండా ఉంటే ఏమవుతుంది? గొప్ప గొప్ప దేశాల నాయకులు ఎంతో ముఖ్యమైన సమావేశాల మధ్యలో నిద్రపోవడం నేను చాలాసార్లు గమనించాను. ఎందుకంటే నిద్ర రావడం మనిషికి సహజం. ఈ ఒత్తిడుల నుంచి ఊరట పొందాలంటే శాంతి ఎంతో అవసరం.
ఈ ప్రశ్నలు వేసుకోవాలి...
శ్వాస తీసుకోవడం, ఆహారం తినడం, నీరు తాగడం... ఇవన్నీ జరగకపోతే మనం అసంపూర్తిగా మిగిలిపోయినట్టే శాంతి లేకపోతే, మనల్ని మనం గుర్తించుకోకపోతే కూడా అసంపూర్తిగా మిగిలిపోతాం. ఈ స్థితిలో ‘నేను ఎవరిని? నా జీవితం ఏమవుతుంది?’ అనే రకరకాల ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. తాము ఎన్నో ఏళ్ళు బతుకుతామని చాలామంది భావిస్తూ ఉంటారు. మీరు ఎన్ని రోజులు ఉన్నప్పటికీ... ఆ రోజుల్లో ఏం సాధించారు? రాబోయే రోజుల్లో ఏం సాధిస్తారు? హృదయం కోసం ఏదైనా సంపాదిస్తున్నారా? శాంతిని పొందే దిశలో ఏ విధమైన అడుగులు వేస్తున్నారు? జీవన సాఫల్యతకు ఏం చేస్తున్నారు? అందరూ ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ప్రతి మనిషిలో శాంతి నిక్షిప్తమై ఉంది. ఆ శాంతిని స్వయంగా అనుభూతి చెందడం ప్రతి ఒక్కరికీ అవసరం. తనలో ఉన్న శాంతిని అనుభూతి చెందకపోతే... మనిషికి తాను ఎవరో, ఏం చేస్తున్నాడో ఎన్నటికీ అర్థం కాదు. మనిషి అన్నిటి గురించీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన స్నేహితులు, కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుంటున్నాడు. తనను తాను తెలుసుకోడానికి ప్రయత్నించడం లేదు. తానెవరో గుర్తించడం లేదు. బయటి గమ్య స్థానాలను చేరుకోగలిగాడు కాని... తన అసలైన గమ్యమేమిటో తెలుసుకోలేదు, చేరుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? నేను నా సందేశాన్ని యావన్మందికీ తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. తద్వారా అందరూ వారి జీవితాల్లో శాంతిని స్వయంగా అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను. మీరు శాంతిని అన్వేషించండి. అది ఎక్కడ మీకు దొరికినా గొప్ప విషయమే. మీరు ఎక్కడ లభిస్తుందో అక్కడికి వెళ్ళి, మీ దాహాన్ని తీర్చుకోండి. మీ జీవితాన్ని సఫలీకృతం చేసుకోండి.
ప్రేమ్‌రావత్
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News