Sahaja Yoga: విశ్వశాంతి మంత్రం
ABN , Publish Date - Jun 20 , 2025 | 06:16 AM
ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనికి మతాలు, జాతులు మధ్య వైరాలు, సరిహద్దుల కోసం, ఆధిపత్యం కోసం పోరాటాలు... ఇలా ఎన్నో కారణాలు. ఈ యుద్ధ వాతావరణంలో...
సహజయోగ
ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనికి మతాలు, జాతులు మధ్య వైరాలు, సరిహద్దుల కోసం, ఆధిపత్యం కోసం పోరాటాలు... ఇలా ఎన్నో కారణాలు. ఈ యుద్ధ వాతావరణంలో అమాయకమైన ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. విశ్వశాంతికి భంగం కలిగిస్తున్న అనేక సమస్యలకు యోగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ‘మన కోసం, మన సమాజం కోసం యోగా’ అనే నినాదంతో... జూన్ 21వ తేదీని ‘.అంతర్జాతీయ యోగా దినం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జీవితానికి శాంతిని, ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అందించే ప్రక్రియ యోగా. సహజయోగ ధ్యాన ఆవిష్కర్త శ్రీమాతాజీ నిర్మలాదేవి విశ్వశాంతి స్థాపన ధ్యేయంగా పలు దేశాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన సందేశాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.
ఆ కలయికే యోగా...
ఈ రోజుల్లో చాలామంది యోగ అంటే కేవలం ఆసనాలు, సూర్యనమస్కారాలు అనుకుంటున్నారు. నిజానికి ఆ పదానికి అర్థం చాలా విస్తృతమయినది, ఎంతో సూక్ష్మమైనది. సంస్కృత భాషలో ‘యోగ’ అనే పదానికి ‘కలయిక’ అనే అర్థం ఉంది. ప్రతి మానవునిలో అంతర్గతంగా ఉండే భగవంతుని శక్తి జాగృతం చెంది, మన చుట్టూ సర్వవ్యాపితమై ఉన్నభగవంతుని శక్తితో కలయిక చెందడాన్నే ‘యోగ’ అని పిలుస్తారు..
శాంతి మనలో ఉండాలి
వేదికల మీదకు ఎక్కి... ‘శాంతి, శాంతి’ అని గొంతెత్తి అరచినంతమాత్రాన ప్రపంచంలో శాంతి స్థాపన చేయలేం. మనిషిలోనే ప్రశాంతత లేనప్పుడు శాంతి సాధన కోసం చర్చలు జరపడం వల్ల ఫలితం ఏముంటుంది? ఒక వేళ శాంతికోసం చర్చలు జరిపినా, ఒప్పందం చేసుకున్నా... ఏదో ఒక రూపంలో మళ్ళీ అశాంతి మొదలవుతుంది. మనలోని ఆత్మ ద్వారా శాంతి వ్యక్తం కావాలి. ముందుగా శాంతి అనేది మనలో ఉండాలి. మనం మానసిక ప్రశాంతతతో ఉండాలి. మనలో అశాంతి ఉన్నప్పుడు, అహంకారంతో మన కళ్ళు మూసుకుపోయినప్పుడు ‘నేనెంతో ప్రశాంతంగా ఉన్నాను’ అని భావిస్తే... అది కేవలం భ్రమ. శాంతి కోసం యుద్ధాలు చేయనవసరం లేదు. దాన్ని ఆత్మ ద్వారా అనుభూతి చెందాలి. అంతర్గతంగా ప్రశాంతతతో ఉన్నవారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. అందరికీ ఆనందాన్ని పంచుతారు. ప్రతి మనిషిలో నిద్రాణ స్థితిలో ఉన్న దైవశక్తి అయిన కుండలినీ శక్తిని జాగృతం చేసి, ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు... మన హృదయానికి, మెదడుకు మధ్య ఐక్యత ఏర్పడుతుంది.
అదే సహజయోగం. ఆ కాంతి మనలో ప్రవేశించినప్పుడు... మన జీవితం నెమ్మదిగా, స్థిరంగా మారడం, పరివర్తన చెందడం గమనిస్తాం. అప్పుడు మానవులలో అత్యున్నత శ్రేణికి చెందిన కొత్త కోణాన్ని మనం చూస్తాం. రూపాన్ని గురించి చింతించడం, ప్రత్యేకమైన ఇష్టాలు, అయిష్టాలు, అనవసరమైన ఆలోచనలు లాంటివి ఉండవు. మనలో శాంతి క్రమంగా స్థిరపడడం ప్రారంభమవుతుంది. మనలో స్థిరపడిన ఈ అంతర్గత శాంతి మనల్నే కాదు... మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అలా విశ్వశాంతికి దోహదపడే మంత్రమే యోగా.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
రూ.14,000 కోట్లతో హైదరాబాద్ విమానాశ్రయం విస్తరణ!