Share News

Prostate Health: ప్రోస్టేట్‌ గ్రంథి వాపు సురక్షిత చికిత్స ఇదే

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:39 AM

యాభై ఏళ్లు దాటిన పురుషుల్లో తలెత్తే ప్రధాన సమస్య ప్రోస్టేట్‌ గ్రంథి వాపు. ఈ ‘బినైన్‌ ప్రోస్టటిక్‌ హైపర్‌ప్లేసియా’తో వేధించే మూత్ర సంబంధ సమస్యల నుంచి విముక్తి కోసం సురక్షితమైన...

Prostate Health: ప్రోస్టేట్‌ గ్రంథి వాపు సురక్షిత చికిత్స ఇదే

యాభై ఏళ్లు దాటిన పురుషుల్లో తలెత్తే ప్రధాన సమస్య ప్రోస్టేట్‌ గ్రంథి వాపు. ఈ ‘బినైన్‌ ప్రోస్టటిక్‌ హైపర్‌ప్లేసియా’తో వేధించే మూత్ర సంబంధ సమస్యల నుంచి విముక్తి కోసం సురక్షితమైన, సౌకర్యవంతమైన ‘ప్రోస్టేట్‌ ఎంబొలేజేషన్‌’ చికత్సను ఎంచుకోవాలంటున్నారు వైద్యులు

పైబడే వయసుతో అంతర్గత అవయవాల్లో చోటు చేసుకునే కొన్ని మార్పులు, ఇతరత్రా అసౌకర్యాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా పురుషుల్లో 50 ఏళ్లు దాటిన తర్వాత మూత్రనాళాన్ని చుట్టి ఉండే ప్రోస్టేట్‌ గ్రంథి పరిమాణం పెరగడం మొదలుపెడుతుంది. ఇందుకు జన్యుపరమైన కారణాలతో పాటు, పురుష హార్మోన్‌ సంతులనం దెబ్బతినడం, మఽధుమేహం లాంటి ఇతరత్రా కారణాలున్నాయి. ఈ పరిస్థితి ప్రమాదకరం కాకపోయినా, పెరిగిన ప్రోస్టేట్‌ వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి, మూత్ర సంబంధ

అసౌకర్యాలు వేధించడం మొదలుపెడతాయి. అవేంటంటే..

  • మూత్రవిసర్జన సంపూర్తిగా జరగకపోవడం

  • పగలు ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయవలసి రావడం

  • మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండడం

  • మూత్రాన్ని నియంత్రించుకోలేకపోవడం

  • రాత్రివేళ మూడు నుంచి నాలుగుసార్లు మూత్ర విసర్జన చేయవలసి రావడం

  • మూత్రవిసర్జన తర్వాత చుక్కలు చుక్కలుగా కారుతూ ఉండడం

పెద్ద వయస్కులు సాధారణంగా మూత్ర సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినప్పుడు, పరిస్థితి మరింత తీవ్రమై మూత్రాశయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మొదట్లోనే అప్రమత్తమవడం అవసరం. జనరల్‌ ఫిజీషియన్‌ లేదా యూరాలజి్‌స్టను సంప్రతించి అలా్ట్రసౌండ్‌తో ప్రోస్టేట్‌ పరిమాణం తెలుసుకోవాలి. అలాగే ఇదే పరీక్షతో మూత్రవిసర్జన తదనంతరం మూత్రాశయంలో ఎంత మూత్రం మిగిలిపోతుందో వైద్యులు కనిపెట్టగలుగుతారు. అలాగే యూరోఫ్లోమెట్రీ పరీక్షతో మూత్రవిసర్జన వేగాన్ని కూడా వైద్యులు అంచనా వేయగలుగుతారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రోస్టేట్‌ వాపును నిర్థారించుకోవచ్చు.


సర్జరీలతో సమస్యలు

సాధారణంగా ప్రోస్టేట్‌ పరిమాణం 20 గ్రాములు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా కొందరికి 50, 100, 150 గ్రాముల వరకూ పెరిగిపోవచ్చు. బినైన్‌ ప్రోస్టటిక్‌ హైపర్‌ప్లేసియాను నిర్థారించుకున్న తర్వాత ఒకట్రెండు నెలల పాటు మందులు వాడుకుని, వాటితో లక్షణాలు అదుపులోకి రానప్పుడు, సర్జికల్‌ లేదా నాన్‌ సర్జికల్‌ చికిత్సలను ఎంచుకోవచ్చు. ట్రాన్స్‌ యురేత్రల్‌ రిసెక్షన్‌ ఆఫ్‌ ప్రోస్టేట్‌ అనే సర్జరీలో భాగంగా మూత్రనాళం ద్వారా ప్రోస్టేట్‌ గ్రంథి మధ్య భాగాన్ని పాక్షికంగా కత్తిరించి, తొలగిస్తారు. ఈ సంప్రదాయ చికిత్సా విధానం 40 ఏళ్లుగా మనుగడలో ఉంది. గ్రంథి మరీ పెద్దగా ఉన్నప్పుడు ఇతరత్రా సర్జరీల సహాయంతో లేజర్‌ను ఉపయోగించి కత్తిరించి తొలగిస్తారు. తాజాగా కొన్ని మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీలు కూడా అందుబాటులోకొచ్చాయి. అయితే ఈ సర్జరీలన్నీ మూత్రనాళం ద్వారానే సాగుతాయి కాబట్టి సర్జరీ తదనంతరం కొన్ని దుష్ప్రభావాలకు కూడా ఆస్కారం ఉంటుంది. అవేంటంటే...

  • మూత్రనాళంలో పూడికలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటికి మళ్లీ ఇంకొక సర్జరీ అవసరం పడొచ్చు

  • మూత్రం లీక్‌ అవుతూ ఉండడం

  • మూత్రాన్ని ఆపులేకపోవడం

  • యూరిన్‌ బ్యాగ్‌ వాడుకోవలసి రావడం

  • వీర్యం బయటకు రాకుండా లోపలకు వెళ్లడం

  • స్వల్ప అంగస్తంభన సమస్య దుష్ప్రభావాలకు ఆస్కారం లేని సురక్షిత చికిత్స...

6-navya.jpg


ప్రోస్టేట్‌ ఎంబొలైజేషన్‌

యాంజియోగ్రఫీ పద్ధతిలో కాలు లేదా చేతిలోని రక్తనాళాల ద్వారా ప్రోస్టేట్‌కు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాన్ని చేరుకుని, దాన్ని మూసివేసే చికిత్స.. ప్రోస్టేట్‌ ఎంబొలైజేషన్‌. ఈ చికిత్సలో సమస్యకు కారణమైన రక్తనాళం లోపలకు చేరుకుని, ఎంబోస్ఫియర్స్‌ అనే పార్టికల్స్‌ లేదా ద్రవరూప జిగురును ఇంజెక్ట్‌ చేయడం జరుగుతుంది. వీటితో రక్తనాళం మూసుకుపోయి, ప్రోస్టేట్‌కు ఆక్సిజన్‌ ఆగిపోయి, ఆ గ్రంథి మెత్తబడి, క్రమేపీ చిన్నదైపోతుంది. ఫలితంగా సంబంధిత సమస్యలన్నీ అదుపులోకొస్తాయి. దాదాపు 15 ఏళ్లుగా అందుబాటులో ఉన్న ఈ చికిత్సకు ఎఫ్‌డిఎ అనుమతి కూడా ఉంది. అమెరికన్‌ యూరలాజికల్‌ మార్గదర్శకాలతో పాటు యుకె, యూర్‌పలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ మార్గదర్శకాల్లో కూడా ఈ చికిత్స అనుమతి పొందింది. కాబట్టి ఇది ప్రయోగాత్మక చికిత్స కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ చికిత్సలో మూత్రనాళ ప్రమేయం ఉండదు కాబట్టి మూత్రనాళం దెబ్బతినే ప్రమాదం ఉండదు. కోత ఉండదు కాబట్టి రక్తస్రావ సమస్య ఉండదు. అనస్తీషియా అవసరం కూడా ఉండదు. చికిత్స ఒక్క రోజులోనే పూర్తయిపోతుంది కాబట్టి మరుసటి రోజు నుంచి పనులన్నీ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది కోత లేని సర్జరీ కాబట్టి నరాలు దెబ్బతినే ప్రమాదం ఉండదు. ఫలితంగా చికిత్స తదనంతర లైంగిక సమస్యలు తలెత్తవు. అంగ స్తంభన సమస్య ఉండదు. అలాగే సర్జరీకి భయపడే పురుషులు, సర్జరీ చేయించుకోలేని పురుషులు, వృద్ధులు, హృద్రోగులు, రక్తం పలుచబడే మందులు వాడుకునేవాళ్లు అన్ని విధాలా సురక్షితమైన ప్రోస్టేట్‌ ఎంబొలైజేషన్‌ చికిత్సను ఎంచుకోవచ్చు.

తిరగబెట్టొచ్చు

సర్జరీని ఎంచుకున్నా ప్రోస్టేట్‌ ఎంబొలైజేషన్‌ను ఎంచుకున్నా ప్రోస్టేట్‌ వాపు సమస్య దీర్ఘకాలంలో తిరగబెట్టే అవకాశాలు లేకపోలేదు. అయినప్పటికీ ఎటువంటి దుష్ప్రభావాలకూ ఆస్కారం లేకుండా ఉండాలనుకుంటే ప్రోస్టేట్‌ ఎంబొలైజేషన్‌ చికిత్సను ఎంచుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం.

అనుభజ్ఞులను ఎంచుకోవాలి

ప్రోస్టేట్‌ ఎంబొలైజేషన్‌ చికిత్స భద్రత, సత్ఫలితాల కోసం అనుభవమున్న వైద్యులనే ఎంచుకోవాలి. అలాగే అడ్వాన్స్‌డ్‌ ఇమేజింగ్‌ విత్‌ కోన్‌ బీమ్‌ సిటి సౌకర్యాన్ని కలిగి ఉండే ఆస్పత్రినే ఎంచుకోవాలి.

డాక్టర్‌ అర్జున్‌ రెడ్డి

చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజిస్ట్‌, రివియా వాస్క్యులర్‌ ఇన్‌స్టిట్యూట్‌,

గచ్చిబౌలి, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

For More TG News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 02:39 AM