Share News

life: అదే అసలైన స్వేచ్ఛ

ABN , Publish Date - May 23 , 2025 | 04:25 AM

సుఖ దుఃఖాలు జీవన భాగాలే, వాటికి లోనవ్వడం కాదు, మనలో ఉన్న శ్వాస అసలైన జీవితం అని గుర్తించాలి. ప్రతి రోజు భగవంతుడిచ్చే ఒక కొత్త అవకాశం, జీవితం అనేది ప్రేమతో నింపుకోదగిన అమూల్యమైన కానుక.

life: అదే అసలైన స్వేచ్ఛ

సుఖదుఃఖాలు మన జీవితంలో రెండు భాగాలు. సుఖంగా ఉన్నప్పుడు... ఆ సుఖం అలాగే కొనసాగాలని మనిషి ఆరాటపడతాడు. దుఃఖం, బాధ కలిగినప్పుడు విలవిలలాడిపోతాడు. ఎందుకంటే ఇది మనిషి స్వభావం. మంచి చెడుల విచక్షణాభావం అందరికీ ఉంటుంది. కాని సత్యం అనేది ఒకటి ఉంది. అది మంచి చెడులకు అతీతమైనది. ఆ సత్యం మన హృదయాలలో నిక్షిప్తమై ఉంది. దానికి మీరు సుపరిచితులు కావాలని కోరుకుంటున్నాను.

సమస్యలన్నిటికీ మూలకారణం... మనమే

కష్టాల్లో, సమస్యలలో కూరుకుపోయినప్పుడు.. మనం పొందినవాటితో, మనం కోల్పోయినవాటితో జీవితాన్ని బేరీజు వేసుకుంటాం. ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, బాధ్యతలను చూసుకొని... అదే తమ జీవితం అని అందరూ భావిస్తారు. కానీ జీవితం అంటే ఇవేవీ కావు. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే... అది మనలో నడిచే శ్వాస. ఈ శ్వాస రాకపోకలు ఆగిపోయినప్పుడు... మీ గౌరవ ప్రతిష్టలు, మీ బంధాలు, బాంధవ్యాలు, ఉద్యోగం, ధన సంపదలు... వేటినైతే మీరు జీవితం అని ఈనాడు భావిస్తున్నారో అవన్నీ అంతమైపోతాయి. దేనివల్ల ఈ రోజు జీవించి ఉన్నారో, దేనివల్ల మీకంటూ ఈనాడు ఒక విలువ ఉందో... దాన్ని తెలుసుకోవడమే ఈ జీవితం తాలూకు సర్వ శ్రేష్ఠమైన లక్ష్యం. దాన్ని తెలుసుకోకపోతే జీవితం నిరర్థకం అవుతుంది. జీవితం ఉన్నందువల్లే సమస్యలు కూడా ఉన్నాయి. మనిషి సమస్యల నుంచి తప్పించుకోలేడు. మనకున్న సమస్యలన్నిటికీ మూలకారణం... మనమే. అవన్నీ మనం సృష్టించుకున్నవే. ఈ ప్రాపంచిక నియమావళి అందరికీ సమానమే. సమస్యలనేవి అందరినీ ఒకేలా వేధిస్తాయి. వాటన్నిటికీ కారణం... మనిషి తన భుజస్కంధాలమీద అనవసరమైన భారాన్ని మోస్తూ ఉండడం.


ఈ రోజు.... మరో అవకాశం

జీవితంలో నిరాశకు స్థానం ఉండకూడదు. జీవితంలో నిరాశతో కుంగిపోతున్న స్థితిలో కూడా... ఆశ అనేది మీలోనే ఉద్భవిస్తుంది. రేపటి రోజున సూర్యుడు తిరిగి ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఉదయించిన సూర్యుడు తప్పనిసరిగా అస్తమించినా... మరుసటి రోజు మళ్ళీ ఉదయించి, మనకు మరొక కొత్త రోజును అందిస్తాడు. అలాగే మీ జీవితాన్ని కూడా తిరిగి ప్రారంభించడానికి మీకొక కొత్త రోజు... ప్రతిరోజూ లభిస్తుంది. ఆ రోజుకు స్వాగతం పలకండి. మీలోని ఆశాజ్యోతులను వెలిగించండి. మీలోని ఆనందాన్ని వీక్షించండి. నిన్నటి రోజు మీరు చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఈరోజు మీకు మరొక అవకాశాన్ని కల్పిస్తోంది. కాబట్టి మీ జీవితంలో ఆశాకిరణాలను ప్రకాశింపజేయండి. ఆ భగవంతుడు మీకు ఈ శరీరాన్ని, ఈ శ్వాసను కానుకగా ఇచ్చాడు. వాటినుంచి లాభాన్ని పూర్తిగా పొందండి.


జీవితం ఒక కానుక

మీలో సాగే ఈ శ్వాస అత్యంత అమూల్యమైనదని మీరు ఎప్పుడైనా గుర్తించారా? భగవంతుడి అనుగ్రహం వల్ల... ఎవ్వరి ప్రమేయం లేకుండా తనకుతానే ఈ శ్వాస మీ లోపలికి వస్తోంది, పోతోంది. అది మీకు మళ్ళీ దొరకని ఒక అవకాశాన్ని, ఒక కానుకను అందిస్తోంది. జీవితం అనే ఆ కానుకను మనిషి అందుకోవాలి. మీరు ఈ ప్రపంచంలో ఉత్త చేతులతో జన్మించినప్పటికీ... ఉత్త చేతులతో వెనుతిరగవలసిన అవసరం లేదు. మీ వెంట ఏదైనా తీసుకువెళ్ళండి. మరి మీరు మీ వెంట దేన్ని తీసుకువెళ్ళగలరు? హృదయపాత్రను ప్రేమతో, ఆనందంతో నింపుకొంటే... దాన్ని తీసుకువెళ్ళగలరు. మీకు లభించిన ఈ శ్వాస, ఈ సమయం, ఈ జీవితం... ఇవన్నీ ఎంతో అమూల్యమైనవి. వాటని వృధా చేసుకోకూడదని మీరు గ్రహిస్తే... మీ జీవితం రూపురేఖలే మారిపోతాయి. ఆ మార్పు మీకు బయటకు కనిపించకపోవచ్చు, కానీ మీలో ఎంతో పరివర్తన వస్తుంది. మీ శ్వాస గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకున్న రోజున... మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. సందేహాలకు స్థానంలేని స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తారు. మీలోనికి వచ్చే పోయే శ్వాసతో మీకు అనుబంధం ఏర్పడితే... అప్పుడు మీకు మీ జీవితం మీద ప్రేమ కలుగుతుంది. ఎప్పుడైతే మీకు మీ జీవితంపై ప్రేమ కలుగుతుందో... అప్పుడు మిమ్మల్ని మీరు స్వతంత్రులుగా భావిస్తారు. అదే మీలోని అసలైన స్వేచ్ఛ.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:25 AM