Janaka And Nachiketa In Sahaja Yoga: ఉన్నతిని పొందాలంటే
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:44 AM
లోక సంక్షేమం కోసం అమృతమథనంలో సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. రాజ్యలక్ష్మిగా, గృహలక్ష్మిగా రూపాంతరం చెందింది. మానవులు సామూహికతలో ఆనందిస్తూ, ఉన్నతిని పొందడానికి కారణం...
సహజయోగ
లోక సంక్షేమం కోసం అమృతమథనంలో సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. రాజ్యలక్ష్మిగా, గృహలక్ష్మిగా రూపాంతరం చెందింది. మానవులు సామూహికతలో ఆనందిస్తూ, ఉన్నతిని పొందడానికి కారణం... వారి కుడి పార్శ్వంలో ఉన్న రాజ్యలక్ష్మి ఆశీస్సులే. ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సౌకర్యం కోసం రాజ్యలక్ష్మి శక్తి పని చేస్తుంది. ఆ శక్తి మనలోనే ఉంది. ‘రాజ్య’ అంటే రాజ్యం లేదా రాజసం. రాజ్యలక్ష్మి పాలనకు అధిదేవత. సుగుణాలు లేని పాలకులు ప్రజల బాగోగులు చూడలేరు. మన పూర్వ పాలకుల్లో ఎందరో గొప్పవారు కనిపిస్తారు. వారు రాజ్యలక్ష్మి తత్త్వంతో నిండి ఉంటారు. పాలకులైనప్పటికీ ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
నచికేతుడికి జ్ఞానోదయం
జనక మహారాజు పాలకుడు కాబట్టి ఆభరణాలు, అందమైన వస్త్రాలు ధరించి హుందాగా ఉండేవాడు. నచికేతుడు అనే ముని తన గురువు ఆదేశం మేరకు జనకుడి దగ్గరకు వచ్చాడు. ఆయనను చూసి ఆశ్చర్యపడి ‘అలంకారాలు చేసుకొని, ఆభరణాలు ధరించిన ఈ మహారాజుని కలవాలని నా గురువు నాకెందుకు చెప్పారు? ఈ జనకుణ్ణి గమనిస్తే తన స్వపరివారంతో కలిసి నాట్య ప్రదర్శనను తిలకించడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇతను భాగవతోత్తముడు కానేకాదు. మరి నా గురువు ఈ రాజు పాదాలకు ఎందుకు ప్రణమిల్లుతున్నారో అర్థం కావడం లేదు. ఇతను సాధారణమైన రాజు మాత్రమే’ అని అనుకున్నాడు. నచికేతుడి మనోభావాలను జనక మహారాజు చదవగలిగాడు. ‘‘నచికేతా! నీకు ఇక్కడికి ఎందుకు వచ్చావు?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఆత్మ సాక్షాత్కారం పొందడానికి’’ అని నచికేతుడు సమాధానం ఇచ్చాడు. ‘‘కావాలంటే నా సమస్త రాజ్యాన్నీ నీవు తీసుకో. కానీ ఆత్మసాక్షాత్కారం కలుగజెయ్యడం అంత సులభం కాదు’’ అన్నాడు జనకుడు. ‘‘ఆత్మసాక్షాత్కార సాధన కోసం మీరు ఏది చెబితే అది చేస్తాను’’ అన్నాడు నచికేతుడు పట్టుదలగా. అప్పుడు అతణ్ణి ఒక నది దగ్గరకు జనకుడు తీసుకువెళ్ళి ‘‘ఈ నీటిలో ప్రవేశించు. స్నానం చేద్దాం’’ అని చెప్పాడు. ఇద్దరూ నదిలోకి దిగారు. ఇంతలో రాజభటులు కొందరు అక్కడికి వచ్చి... అగ్నిప్రమాదం కారణంగా మంటలు వ్యాపిస్తున్నాయనీ, ప్రజలందరూ పారిపోతున్నారనీ చెప్పారు. జనకుడు మాత్రం ప్రశాంతంగా ధ్యానావస్థలో ఉన్నాడు. నచికేతుడు ఆందోళనకు గురయ్యాడు. ఈలోగా మరికొందరు వచ్చి మంటలు అక్కడికి కూడా వ్యాపిస్తున్నాయని హెచ్చరించారు. వెంటనే నచికేతుడు స్వీయరక్షణ కోసం దూరంగా పరుగెత్తాడు. ఇంత జరుగుతున్నా జనక మహారాజు ధ్యానంలోనే కూర్చున్నాడు. నది బయటకు వచ్చిన నచికేతుడు... అక్కడ ఏ విధమైన మంటలూ లేవనీ, అదంతా కల్పన అని గ్రహించాడు. తనలో లోపమేమిటో గుర్తించాడు. జనకుడి భగవత్ శక్తులను అతను అనుమానించాడు. కానీ జనకుడు మహారాజైనా తన అధికార శక్తుల గురించి పట్టించుకోలేదు. ‘పరమభాగవతోత్తముడైన ఆయనకు రాజుననే అహంకారం లేదు, అంతర్గతంగా ఆయన ఒక పుణ్య పురుషుడు, ఆత్మజ్ఞాని’ అని నచికేతుడు గ్రహించాడు.
సామూహికత దిశగా...
రాజ్యలక్ష్మిని పూజిస్తే అహంకారాన్ని సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆమె సమతుల్యత ప్రసాదిస్తుంది. మనిషిని మర్యాదస్తుడిగా మారుస్తుంది, హుందాతనాన్ని ఇస్తుంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు ఇతరుల పట్ల ప్రేమతో, దయతో వ్యవహరిస్తారు. ఇతరుల నుంచి ఏదీ ఆశించరు. భౌతికమైన వస్తువులకు ఆశపడేవారు ఆమె అనుగ్రహానికి అర్హులు కారు. ఇతరుల క్షేమాన్ని ఆకాంక్షించడం, తన దగ్గరకు వచ్చినవారి పట్ల శ్రద్ధగా వ్యవహరించడం లాంటి గుణాలు చాలా ముఖ్యం. బద్ధకస్తుల దగ్గర రాజ్యలక్ష్మి నిలబడదు. ఆమె ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. అధర్మపరులకు ఆమె ఆశీస్సులు ఉండవు. ధర్మపరులకు ఆమె రక్షణ లభిస్తుంది. రాజ్యలక్ష్మి ఏనుగును అధిరోహించి ఉంటుంది. ఏనుగు అన్ని జంతువులలో ఎత్తయినది. దానిలో క్షమాగుణం, జ్ఞాపకశక్తి ఉంటాయి. రాజ్యలక్ష్మీతత్త్వంతో ఉన్నవారు స్వార్థపరులుగా ఉండరు. తమ గురించి ప్రచారం చేసుకోరు. మనలో రాజ్యలక్ష్మిని మేలుకొలిపినప్పుడు... మన ఆలోచనలు సొంత విషయాలకే పరిమితం కాకుండా, సామూహికత దిశగా సాగుతాయి. మొత్తం ప్రపంచం గురించి ఆలోచించడం మొదలుపెడతాం. మానవ అంతర్గత సూక్ష్మ శరీరంలో నాభీచక్రానికి ఎడమవైపు గృహలక్ష్మి, కుడివైపు రాజ్యలక్ష్మి ఆసీనులై ఉంటారు. సహజయోగ ధ్యాన సాధన ద్వారా కుండలినీ శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రయాణించి, సహస్రారాన్ని చేరుకొనే ప్రయాణంలో... అది నాభీచక్రం దగ్గర గుడి పార్శ్వాన్ని తాకినప్పుడు... ఆ చక్రం పరిశుద్ధం అవుతుంది. అక్కడ ఉన్న రాజ్యలక్ష్మీతత్త్వం మేలుకొని మనలో స్థిరపడుతుంది. తద్వారా మనం ఉన్నతిని సాధించగలం.
డాక్టర్ పి. రాకేష్
8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
ఈ వార్తలు కూడా చదవండి..
పేలిన వాషింగ్ మిషన్.. ఉలిక్కిపడ్డ ప్రజలు
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం