Hair Fall: బియ్యం నీళ్లు చేసే అద్భుతం..
ABN , Publish Date - May 04 , 2025 | 05:52 AM
శిరోజాల రాలడం, చుండ్రు వంటి సమస్యలకు బియ్యం నీళ్లు మంచి పరిష్కారంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఫెర్మెంటెడ్ బియ్యం నీటిని వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే కురులు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతాయని సూచిస్తున్నారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ... శిరోజాలు రాలడం, అవి నిర్జీవంగా మారడం, వాటి చివర్లు చిట్లడం, చుండ్రు లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని నివారించేందుకు బియ్యం నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలా తయారు చేసుకోవాలి...
ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. వెంటనే రెండు కప్పుల నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టాలి. తరవాత ఈ నీటిని మరో గిన్నెలోకి వడకట్టాలి.
బియ్యాన్ని నీటిలో రెండు రోజులు నానబెడితే ఆ నీటిని ‘ఫెర్మెంటెడ్ వాటర్’ అంటారు. ఈ నీళ్లు మాడుకు, శిరోజాలకు అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ఫెర్మెంటెడ్ వాటర్‌ను ఫ్రిజ్‌లో వారంపాటు నిల్వ చేసుకోవచ్చు.
బియ్యం నీటిలో లావెండర్ లేదా రోజ్‌మేరీ ఆయిల్ చుక్కలు వేసుకుంటే ఫలితం బాగుంటుంది.
బియ్యం నీళ్లలో బి, ఇ విటమిన్లతోపాటు మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇలా వాడాలి...
ముందుగా శిరోజాలను కుంకుళ్లు లేదా గాఢత తక్కువగా ఉన్న షాంపూతో శుభ్రం చేసుకోవాలి. తలను కొద్దిగా ఆరనివ్వాలి. తరవాత బియ్యం నీటిని చేత్తో తీసుకుంటూ కురులకు, మాడుకు పట్టించాలి. బియ్యం నీటిని ఒక స్ర్పే బాటిల్‌లో పోసి తలంతా చిలకరించుకోవచ్చు. అయిదు నిమిషాల తరవాత తలను వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. పావుగంటసేపు ఆరనిచ్చి మంచినీళ్లతో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి:
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..