Share News

Reviving Assams Heritage Muga Eri Pattu Weaving Fabric: సంప్రదాయ పట్టుకు పునరుజ్జీవం

ABN , Publish Date - Oct 30 , 2025 | 02:54 AM

దశాబ్దాలుగా జీవన స్రవంతిలో మిళితమై... ఒక వెలుగు వెలిగిన ‘ముగ, ఎరి’ పట్టు... తెరమరుగైపోవడం ఆమెను కలవర పెట్టింది. ఈ వారసత్వ కళకు పూర్వ వైభవం తెచ్చి... భావి తరాలకు అందించాలన్న సంకల్పం...

Reviving Assams Heritage Muga Eri Pattu Weaving Fabric: సంప్రదాయ పట్టుకు పునరుజ్జీవం

సంకల్పం

దశాబ్దాలుగా జీవన స్రవంతిలో మిళితమై... ఒక వెలుగు వెలిగిన ‘ముగ, ఎరి’ పట్టు... తెరమరుగైపోవడం ఆమెను కలవర పెట్టింది. ఈ వారసత్వ కళకు పూర్వ వైభవం తెచ్చి... భావి తరాలకు అందించాలన్న సంకల్పం ఆమెను మరో అడుగు ముందుకు వేయించింది. అదే... గృహహింస బాధితులైన గ్రామీణ మహిళలకు ఉపాధి మార్గమైంది. వారిని సాధికారత వైపు నడిపించి... గౌరవప్రదమైన జీవితాన్ని అందించి... సంప్రదాయ పట్టుకు ఎనలేని ఆదరణ కల్పిస్తున్నారు జాగృతి. ఆమె అంతరంగం ఇది.

‘‘అసోం రాష్ట్రం... బ్రహ్మపుత్ర నదీ తీరం... ధెమాజి పట్టణం... సూర్యోదయం వేళ ఆ ప్రాంతంలో అడుగుపెడితే... మగ్గం శబ్దాలు లయబద్ధంగా వినిపిస్తుంటాయి. ఆ మగ్గాలపై ముగా పట్టు బంగారు దారాలు చక్కని ఆకారంలో ఒదిగిపోతుంటాయి. అక్కడే పుట్టి పెరిగిన నాకు అదంతా ఒక సుమధుర గీతంలా అనిపించేది. మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉండేది. పండుగలు, పెళ్లిళ్లప్పుడు ఆ వస్త్రాలు ధరించి... హొయలు పోయిన జ్ఞాపకాలు ఎన్నో. కానీ నేను పెరిగే క్రమంలో ఆ పట్టు వస్త్రాలు కనుమరుగవుతూ వచ్చాయి.

నా గుండె చప్పుడు...

మాది కూడా నేత కుటుంబమే. నిద్రలేచి, కళ్లు తెరిచే సరికి అమ్మ మగ్గం మీద చీరలు నేస్తూ కనిపించేది. వెంటనే వెళ్లి అమ్మ పక్కన కూర్చొని... ఆ కళాత్మకమైన పనితనాన్ని ఆస్వాదించేదాన్ని. ఎంతలా అంటే... ఆ మగ్గాల కదలికలు నా గుండె చప్పుడులా మారాయి. అయితే యంత్రాల రాకతో... కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న ఆధునిక దుస్తులతో మా ప్రాంత నేతన్నలకు పని తగ్గుతూ వచ్చింది. కొన్నేళ్లకు దాన్ని నమ్ముకున్న వారికి ఉపాధి కూడా కష్టమైంది. ఇది నన్ను కలవరపెట్టింది.


అందరిలా నేనూ...

‘నిఫ్ట్‌’లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసి, తిరిగి మా ఊరు వెళ్లి, సొంతంగా ఒక డిజైనింగ్‌ స్టూడియో పెట్టాలనేది నా కల. అనుకున్నట్టే ఢిల్లీ వెళ్లి ‘నిఫ్‌’్టలో కోర్సు పూర్తి చేశాను. మా ఊరు వచ్చాను. అందరు డిజైనింగ్‌ గ్రాడ్యుయేట్స్‌లా నేను కూడా సృజనకు రెక్కలు తొడిగి, ఫ్యాషన్‌ పరిశ్రమలో వినూత్న వస్త్ర శ్రేణులను ఆవిష్కరించాలని ఆరాటపడ్డాను. కానీ అందులో దిగాక తెలిసింది... సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఎంతటి విధ్వంసానికి పాల్పడుతున్నామో! అవసరానికి మించి ఉత్పత్తి, విచ్చలవిడిగా రసాయనాల వినియోగం, తద్వారా విడుదలయ్యే కాలుష్యం, దానివల్ల పర్యావరణానికి కలిగే హాని... ఇవన్నీ అనుభవంలోకి వచ్చాయి. అన్నిటికీ మించి ‘ముగ, ఎరి’ పట్టు వస్త్రాలు రూపొందిస్తూ, వారసత్వ కళను నమ్ముకొని జీవిస్తున్న కళాకారులకు జీవనోపాధిని దూరం చేస్తున్నామని తెలిసినప్పుడు ఎంతో బాధ కలిగింది. ఇది కాదు నేను కోరుకున్నది.

00-navya.jpg

‘వే ఆఫ్‌ లివింగ్‌’...

ఒకప్పుడు మా ప్రాతంలో ఇళ్లన్నీ మగ్గాల చప్పుళ్లతో... వెలిగిపోతున్న నేతన్నల మోములతో కళకళలాడేవి. కానీ నేను తిరిగి వచ్చేనాటికి ఊళ్లో మగ్గాలు మోగబోయాయి. తరతరాలుగా వస్తున్న వారసత్వ కళ అవసాన దశలో ఉంది. అద్భుతమైన ‘ముగ, ఎరి’ పట్టుకు పూర్వ వైభవం తేవాలని ఆ క్షణమే సంకల్పించాను. దాని కోసం నాలుగేళ్ల కిందట మా ధెమాజి పట్టణంలో ‘వే ఆఫ్‌ లింగ్‌ స్టూడియో’ నెలకొల్పాను. దాని ద్వారా కనుమరుగు అవుతున్న కళను బతికించే ప్రయత్నం ప్రారంభించాను.

స్టూడియో మాత్రమే కాదు..

కళకు పునరుజ్జీవం కోసమే కాకుండా... మా స్టూడియోను అటు నేతన్నకు, ఇటు గ్రామీణ మహిళలకు ఒక చక్కని వేదికగా మార్చాలని అనుకున్నాను. అందులో భాగంగా తొలుత కళాకారులను కలిసి చర్చించాను. వారి అనుభవాలు, సూచనల నుంచి, మా ప్రాంత రమణీయత నుంచి స్ఫూర్తి పొంది... సంప్రదాయ ‘ముగ, ఎరి’ పట్టుకు ఆధునికత జోడించి, విభిన్న వస్త్ర శ్రేణులను తీసుకువచ్చాను. అదే సమయంలో పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా, నాణ్యతలో రాజీ పడకుండా, నేటి తరానికి నచ్చేలా చీరలు, స్కార్ఫ్‌లతో పాటు ట్రెండీ దుస్తులను రూపొందిస్తున్నాం.

అంత కంటే ఎక్కువ...

ముఖ్యంగా ముగ పట్టు పురుగులు చాలా అరుదు. ఏమాత్రం కాలుష్యం లేని ప్రాంతాల్లో మాత్రమే జీవించగలుగుతాయి. అవి ఆవాసం ఏర్పరచుకున్నాయంటే అర్థం... అక్కడ పర్యావరణ సమతుల్యత ఉందని. నేలకు, చెట్లకు, మనుషులకు మధ్య సామరస్యం కుదిరిందని. అందుకే ముగ... మా అసోం ప్రజలకు ఒక పట్టు వస్త్రమే కాదు... అది మా గుర్తింపు. రాష్ట్రంలో అతిపెద్ద పండుగైన బిహూకు ముగ పట్టు ధరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దాని మెరిసే దారాలు మా వారసత్వ సంపదకు సజీవ చిహ్నం. అలాగే ఎరి పట్టు కూడా అస్సామీల జీవన గమనంలో ఒక భాగం. ఈ నేపథ్యంలోనే అంతరించిపోతున్న ఈ పట్టును భావి తరాలకు అందించాలని అనుకున్నాను.


000-navya.jpg

మహిళలకు సాధికారత...

మా సంస్థ ఆధ్వర్యంలో ‘ముగ, ఎరి’ పట్టు పురుగుల పెంపకం చేపట్టాం. దాని కోసం గ్రామీణ మహిళలకు శిక్షణ ఇచ్చాను. మగ్గం పని కూడా నేర్పించాను. ముఖ్యంగా గృహహింసకు బాధితులైన ఒంటరి మహిళలకు ఉపాఽధి అవకాశాలు కల్పించాను. ఇప్పుడు ఎంతోమంది మహిళలు ఒకరిపై ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించగలుగుతున్నారు. కొందరు ఇంటి వద్ద నుంచే పని చేస్తూ, తమ పిల్లలను పోషించుకోగలుగుతున్నారు. సాధికారత వైపు అడుగులు వేస్తున్నారు. రైతులు, నేతన్నలు, వారిని నమ్ముకున్నవారు... ఇక్కడ మా అందరిదీ ఒకే కుటుంబం. అందుకే నాకు లాభాలు, వ్యాపార దృక్పథం కంటే మానవ సంబంధాలు, విలువలే ప్రధానం.’’

వందమందికి పైనే...

ప్రస్తుతం మా ‘వే ఆఫ్‌ లివింగ్‌ స్టూడియో’ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రంలో పధ్నాలుగు మగ్గాలు ఉన్నాయి. ఒక్కో మగ్గంపై ఎనిమిది మంది కళాకారులు పని చేస్తారు. ప్రత్యక్షంగా దాదాపు వందమందికి పైగానే రైతులు, కళాకారులు ఉపాధి పొందుతున్నారు. మార్కెటింగ్‌, ఇంటింటికీ వెళ్లి పట్టు దారాలు సేకరించేవారు... ఇలా దాదాపు మరో యాభై మంది సంస్థపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో తొంభై శాతంమంది మహిళలే. వీరందరి కృషితో మా స్టూడియోకు మంచి ఆదరణ లభించింది. స్మిత గోద్రెజ్‌, జాన్వి నిలేకని, రోషినీ నాడార్‌ లాంటి ప్రముఖుల చొరవతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది. ఒక అంతర్జాతీయ సంస్థ మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. అంతిమంగా నా కృషికి తగిన ఫలితం కనిపిస్తోంది. అంతరించిపోతున్న పట్టుకు పూర్వ వైభవం లభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంది.

ఇవి కూడా చదవండి:

కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..

మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..

Updated Date - Oct 30 , 2025 | 02:55 AM