Share News

Pulugurtha Andhra Pradesh handloom: పులుగుర్తకు పూర్వ వైభవం

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:44 AM

నూలు నుంచి రంగురంగుల వస్త్రాలను తయారుచేసే ఘనత మన చేనేత కార్మికులకే దక్కుతుంది. అలాంటి ఒక కళ- తూర్పుగోదావరి జిల్లాలోని పులుగుర్తలో ఇప్పటికీ పరిఢవిల్లుతోంది. ఇటీవల విశాఖపట్నంలో...

Pulugurtha Andhra Pradesh handloom: పులుగుర్తకు పూర్వ వైభవం

నూలు నుంచి రంగురంగుల వస్త్రాలను తయారుచేసే ఘనత మన చేనేత కార్మికులకే దక్కుతుంది. అలాంటి ఒక కళ- తూర్పుగోదావరి జిల్లాలోని పులుగుర్తలో ఇప్పటికీ పరిఢవిల్లుతోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ పులుగుర్త జాకెట్‌ వేసుకొని అందరినీ ఆకర్షించారు. ఈ జాకెట్‌ గురించి ఆయన చేసిన ట్వీట్‌తో పులుగుర్త చేనేతల గురించి ఆసక్తి నెలకొంది.

మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే పులుగుర్త చేనేత సహకార సొసైటీ ఏర్పడింది. అప్పటి నుంచి అనేక ఉత్థానపతనాలు చూసిన ఈ సొసైటీ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం ఈ సొసైటీలో 450 కుటుంబాలు భాగస్వాములుగా ఉన్నాయి. పులుగుర్తకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా ఒక ప్రాంతంలో ఒక రకమైన చేనేతలే ప్రసిద్ధి పొందుతాయి. ఉదాహరణకు ఉప్పాడ, మంగళగిరి, గద్వాల్‌ లాంటి ప్రాంతాలు కేవలం చీరలకే ప్రసిద్ధి. ఇతర రకాలమీద వారు పెద్దగా శ్రద్ధ పెట్టరు. కానీ ఇక్కడ చీరల నుంచి హ్యాండ్‌ కర్చీ్‌ఫల వరకు ఎన్నో రకాలు తయారుచేస్తూ ఉంటారు. మల్కా, జకార్డు, కుప్పటం, బుటా లాంటి చీరల రకాలు ఇక్కడ లభిస్తాయి. కేవలం చీరలు మాత్రమే కాకుండా పురుషులు ధరించే జాకెట్‌ కోట్‌లు, పంచెలు, కండువాలు, అంగవస్త్రాలు లాంటివి కూడా తయారవుతూ ఉంటాయి.


జాతీయ స్థాయి గుర్తింపు

పులగుర్త సొసైటీ - తమ సభ్యులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. చాలామంది సభ్యులు సొసైటీ నుంచి నూలు తెచ్చుకొని వస్త్రాలు నేసి తిరిగి సొసైటీకి అప్పగిస్తూ ఉంటారు. చీరల డిజైన్ల ఆధారంగా వీరికి వేతనాన్ని నిర్ణయిస్తారు. ఈ వృత్తిలోకి రావాలనుకొనే యువతీ యువకులకు సొసైటీ శిక్షణ అందిస్తోంది. వీరికి ఉపకారవేతనం కూడా ఇస్తారు. ఐఏఎస్‌ ట్రైనీలు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు ఈ సొసైటీని సందర్శించటం ఒక అనవాయితీగా వస్తోంది. దీనితో జాతీయ స్థాయిలో కూడా పులుగుర్త చేనేతల గురించి తెలుసు. ఈ మధ్యకాలంలో తూర్పుగోదావరి జిల్లాను సందర్శించే వీఐపీలకు పులుగుర్త జాకెట్‌ కోట్‌లను బహుమతిగా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్‌ సీఐఐ సమ్మిట్‌లో ఈ కోట్‌ను ఽధరించారు. దీనితో దేశవ్యాప్తంగా పులుగుర్త చేనేతలపై ఆసక్తి పెరిగింది.

కర్రి శ్రీనివాసరెడ్డి, అనపర్తి

ఇవి కూడా చదవండి..

రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..

వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 23 , 2025 | 05:44 AM