Purnima Devi Barman: అరుదైన పక్షులకు అమ్మలా, అండగా...
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:44 AM
దీనికోసం అనేక మంది శాస్త్రవేత్తలు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు అసోంకు చెందిన జీవశాస్త్రవేత్త పూర్ణిమా దేవి బర్మన్. అంతరించిపోతున్న పక్షిజాతుల పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న కృషి... అంతర్జాతీయ సమాజం మెప్పు అందుకుంటోంది.

భూమిపై మనిషి జీవనానికి ఆలంబనగా నిలిచేది ప్రకృతి. వృక్ష సంపద, జంతువులు, పక్షులు ఇవన్నీ దానిలో భాగమే! అందుకే వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా మానవుడిపై ఉంది. దీనికోసం అనేక మంది శాస్త్రవేత్తలు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు అసోంకు చెందిన జీవశాస్త్రవేత్త పూర్ణిమా దేవి బర్మన్. అంతరించిపోతున్న పక్షిజాతుల పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న కృషి... అంతర్జాతీయ సమాజం మెప్పు అందుకుంటోంది. తాజాగా ‘టైమ్స్ మ్యాగజైన్’ ప్రకటించిన ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’- 2025 జాబితాలో ఆమెకు స్థానం దక్కింది.
‘‘పక్షులు కూడా మనలాంటి ప్రాణులే వాటిని రక్షించాల్సిన బాధ్యత మనదే’’ అని గాఢంగా నమ్ముతారు పూర్ణిమ. అందుకే పక్షులకు ఎక్కడ, ఎలాంటి ఆపద వచ్చినా వాటిని పరిరక్షించడంలో ఆమె ముందుంటారు.. అలాంటి సంఘటన ఒకటి 2007లో జరిగింది. ‘‘అసోంలో నేను నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఒక చెట్టును స్థానికులు నరకటానికి సిద్ధపడ్డారు. దీనికి కారణం ఆ చెట్టు మీద ‘అడ్జటంట్ స్టార్క్’ అనే జాతికి చెందిన కొంగలు నివసిస్తూ ఉంటాయి. స్థానికులు ఆ పక్షులను అశుభశూచకంగా భావిస్తారు. ఎందుకంటే ఆ పక్షులు జంతుకళేబరాలనే కాదు... ఎముకలను కూడా తింటాయి. అందుకే వాటిని అస్సామీ భాషలో ‘హర్గిలా’ (ఎముకలు తినేవి) అని పిలుస్తారు. కానీ స్థానికులకు తెలియని విషయమేమిటంటే- ఆ సమయానికి ఆ జాతి పక్షులు 450 మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలినవన్నీ అంతరించిపోయాయి.
ఇవి కూడా అంతరించిపోతే- ఈ భూమిని శుభ్రం చేయటానికి ప్రకృతి సృష్టించిన చక్రంలో ఒక ఇరుసు పోయినట్లే! నేను వెళ్లేసరికే చెట్టుపై ఉన్న పక్షి గూళ్లను స్థానికులు కర్రలతో కిందకు పడేశారు. గూళ్లలో ఉన్న పక్షి పిల్లలు నేలమీద గిలగిలా కొట్టుకుంటున్నాయి. నిస్సహాయంగా ఉన్న ఆ పక్షి పిల్లలను చూస్తే - నాకు నా పిల్లలు గుర్తుకొచ్చారు. చెట్టును నరకవద్దని స్థానికులకు నచ్చచెప్పటానికి ప్రయత్నించాను. కానీ వారు ఒప్పుకోలేదు. పెద్ద గొడవ అయిన తర్వాత.. వన్యప్రాణి పరిరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశాను. అప్పుడు స్థానికులు వెనక్కి తగ్గారు. ఈ సంఘటన నాలో అనేక ఆలోచనలను రేకెత్తించింది’’ అంటారు పూర్ణిమ.
హర్గిలా ఆర్మీ...
ఆ తర్వాత పూర్ణిమ స్టార్క్ పక్షుల పరిరక్షణ కోసం ఒక ఉద్యమం చేపట్టారు. పక్షుల పరిరక్షణకు మహిళలు ఉపకరిస్తారని భావించిన ఆమె అసోంలోని అనేక ప్రాంతాలు తిరిగారు. మహిళలలో అవగాహన కల్పించటం మొదలుపెట్టారు. మొదట చిన్న స్థాయిలో ప్రారంభమయిన ఈ హర్గిలా పరిరక్షణ ఉద్యమం నెమ్మదిగా అసోం అంతటా వ్యాపించింది. స్టార్క్ పక్షులు పెట్టే గూళ్లను స్థానికులు పడగొట్టకుండా అవగాహన కల్పించటం దీని ముఖ్య ఉద్దేశం. ‘‘అసోంలోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పక్షులను శవాలు పీక్కుతినేవిగా పరిగణిస్తారు. ఇవి తమ ప్రాంతంలో ఉంటే అశుభమని భావిస్తారు. వాస్తవానికి ఈ పక్షులు జంతువుల ఎముకలను తిని పర్యావరణాన్ని పరిశుభ్రపరుస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియకపోవడంతో... ఈ పక్షుల గూళ్లను గుర్తించి, వాటిని కర్రలతో కొట్టేస్తూ ఉంటారు. కాబట్టి ముందు ఈ సమస్యను నివారించడానికి స్థానికుల్లో అవగాహన కల్పించటం మొదలుపెట్టాం.
క్రమంగా ఉద్యమం విస్తరించింది’’ అని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈ ఉద్యమంలో సుమారు 20 వేల మంది భాగస్వాములుగా ఉన్నారు. వీరందరూ స్టార్క్ పక్షుల అవసరం గురించి ప్రచారం చేస్తున్నారు. మొదట్లో అసోంకి మాత్రమే పరిమితమయిన ఈ ఉద్యమం కంబోడియా, ఫ్రాన్స్ తదితర దేశాలకు కూడా విస్తరించింది. విదేశాల్లో కూడా పూర్ణిమ చేస్తున్న కృషికి ప్రాచుర్యం లభించింది. 2017లో బ్రిటన్‌కు చెందిన ‘వైట్లీ ఫండ్ ఫర్ నేచర్’ ప్రకృతి సంరక్షకులకు ఇచ్చే ‘వైట్లీ’ అవార్డు, ఆ తర్వాత భారత ప్రభుత్వం నుంచి ‘నారీ శక్తి’ పురస్కారం లభించాయి. అంతరించి పోతున్న పక్షి జాతుల పరిరక్షణ కోసం జరిగే అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. తాజాగా ‘టైమ్స్’ జాబితాలో ఆమె పేరు చోటు చేసుకోవడం... అంతర్జాతీయంగా ఆమెకు లభించిన మరో గొప్ప గుర్తింపు.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.