Share News

Desk Job Health Tips: శరీర భంగిమలతో భంగపాట్లు

ABN , Publish Date - May 13 , 2025 | 05:43 AM

శరీర భంగిమల కారణంగా మెడ, వెన్ను, నడుము నొప్పులు రావచ్చు. కండరాలు బలహీనపడినప్పుడు, సరిగా శరీరాన్ని ఉంచకపోతే ఈ నొప్పులు పెరిగి సమస్యలకు దారితీస్తాయి.

Desk Job Health Tips: శరీర భంగిమలతో భంగపాట్లు

మెడ నొప్పి వేధిస్తోందా? వీపు నొప్పి చంపేస్తోందా? అయితే ఆ బాధలకు, తప్పుడు శరీర భంగిమలే కారణం కావచ్చు. శరీరాన్ని అసౌకర్యానికి లోను చేసే శరీర భంగిమలు, వాటి పర్యవాసానాల గురించి వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం!

సాధారణంగా మెడ, వెన్ను, నడుము నొప్పులను ఆ ప్రదేశాల్లోని ఎముకలకే ఆపాదిస్తూ ఉంటాం. అక్కడి కీళ్లలో సమస్య ఉన్నట్టు, అవి అరిగిపోయినట్టు భావిస్తాం. కానీ నిజానికి ఎముకలకు దన్నుగా ఉండే కండరాలు బలహీనపడినప్పుడే ఇలాంటి నొప్పులు మొదలవుతాయి. ప్రత్యేకించి అస్తవ్యస్థ భంగిమల్లో శరీరాన్ని ఇబ్బందికి గురి చేసేవారిలో ఇలాంటి నొప్పులు సర్వసాధారణం. ఎక్కువ గంటల పాటు ఒకే చోట కూర్చుని కంప్యూటర్‌ పని చేయడం, రోజులో గంటల తరబడి ఫోన్లు ఉపయోగించడం లాంటి అలవాట్లన్నీ ఈ కోవకు చెందినవే! ఇలాంటి అలవాట్లతో తలెత్తే నొప్పులు, వాటి పర్యవసానాల నుంచి విముక్తి పొందాలంటే, మన శరీర భంగిమలను సరి చేసుకోవాలి.

తప్పుడు భంగిమలతో...

మన శరీరాన్ని నిర్దిష్టమైన భంగిమలో ఉంచడానికి తగ్గట్టుగానే మన కండరాలు నిర్మితమై ఉంటాయి. నడిచేటప్పుడు కొన్ని కండరాలు చురుగ్గా మారితే, కూర్చున్నప్పుడు మరికొన్ని కండరాలు చురుగ్గా పని చేయడం మొదలుపెడతాయి. మరీ ముఖ్యంగా మన వెన్నుపాము... మెడ, వీపు, నడుము దగ్గర భిన్నమైన కోణాలతో కూడిన వంపును కలిగి ఉంటుంది. ఆ వంపులకు తగ్గట్టు అక్కడి కండరాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి వెన్నులోని వంపులకు తగ్గట్ట్టు శరీరాన్ని ఉపయోగించుకున్నంత కాలం ఎలాంటి సమస్యలూ, నొప్పులూ తలెత్తవు. ఎప్పుడైతే ఆయా వంపులకు భిన్నంగా శరీరాన్ని అసౌకర్యానికి లోను చేస్తామో, అప్పటి నుంచి నొప్పులు వేధించడం మొదలు పెడతాయి.


వెన్ను వంపు సమస్య

వెన్నులో నొప్పులను అక్కడి కీళ్లు, డిస్కులకే ఆపాదిస్తూ ఉంటాం. కానీ ఇవి రెండూ పనిచేయాలంటే కండరాలు కూడా బలంగా ఉండాలి. సాధారణంగా వెన్నులో ఎలాంటి సమస్య తలెత్తినా దాన్ని డిస్క్‌ సమస్య, ఎముకల్లో సమస్య లేదా స్పాండిలోసి్‌సగా భావిస్తూ ఉంటారు. దాంతో వైద్యులను కలిసి ఎమ్మారై చేయించుకున్నప్పుడు దాన్లో కూడా ఎముక, డిస్క్‌ మినహా కండరాల పరిస్థితి కనిపించదు. కానీ ఎక్కువ సందర్భాల్లో అసలు సమస్య కండరాల్లో ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎముకను, డిస్క్‌నూ పట్టి ఉంచే కండరాల ఆరోగ్యం గురించి అంచనా వేయాలి. ఎక్కువ కాలం పాటు ఒకే కోణంలో వంగి కూర్చోవడం వల్ల, వెన్నులో వెన్నుపూసకు దన్నుగా ఉండే కండరాలు ఒత్తిడికి లోనై పటుత్వాన్ని కోల్పోతాయి. దాంతో కండరాల తోడ్పాటు లోపించిన వెన్ను పూసల మధ్య జాగా తరిగిపోయి, క్రమేపీ వెన్ను ముందుకు వంగిపోతుంది. కండరాల ఆసరా లోపించిన కీళ్లు కూడా త్వరగా అరిగిపోతాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ల్యాప్‌టా్‌పను ఒళ్లో పెట్టుకుని ముందుకు వంగిపోయి పని చేసే వాళ్లుంటారు. డెస్క్‌టాప్‌ మానిటర్‌ దగ్గరకు తలను ముందుకు చాపి పని చేసుకునే వాళ్లుంటారు. దాంతో సరైన కోణాల్లో శరీరాన్ని పట్టి ఉంచే కండరాలు అలసిపోయి, బలహీనపడిపోయి, శరీర భంగిమలు క్రమం తప్పుతాయి.


మెడ, వెన్ను నొప్పుల వెనక...

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మెడ, వెన్ను నొప్పులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ నొప్పులే వీడకుండా వేధిస్తున్నా, భంగిమతో పని లేకుండా నిరంతరం మెడ, వెన్ను, నడుము నొప్పులు బాధిస్తున్నా వాటిని శరీర భంగిమ సమస్యలుగా అనుమానించాలి. వీటిని సరిదిద్దడం కోసం మందులు, కైరోప్రాక్టర్‌ అనే ప్రత్యామ్నాయ చికిత్సా విధానం, ఫిజియోథెరపీల మీద ఆధారపడడానికంటే ముందు, శరీర భంగిమ మీద దృష్టి పెట్టడం అవసరం. మెడ, వెన్ను సమస్యల విరుగుడు మనలోనే ఉంది. శరీర భంగిమల పరంగా చేస్తున్న తప్పును సరిదిద్దుకుంటే నొప్పులు కచ్చితంగా అదుపులోకొస్తాయి. మెడ, వెన్నులో ఎముకల కీళ్లు అరిగే పరిస్థితి స్పాండిలోసిస్‌. ఇది పైబడే వయసు ఫలితంగా తలెత్తవచ్చు. ఎముకలను దన్నుగా ఉండే కండరాల పటుత్వం లోపించిన ఫలితంగా మెడ, వెన్నులోని కీళ్లు అరిగి చిన్న వయసులోనే లంబార్‌ స్పాండిలోసిస్‌, సర్వైకల్‌ స్పాండిలోసిస్‌లు వేధించవచ్చు.


వ్యాయామంతో కండర దన్ను

యవ్వనంలో ఉన్నప్పుడు చాలా వరకూ కండరాలు శక్తిమేరకు సామర్థ్యాన్ని కనబరుస్తూ శరీరాన్ని చురుగ్గానే ఉంచుతాయి. కానీ వయసు పైబడే కొద్దీ అస్తవ్యస్థ భంగిమలతో కండరాలను ఒత్తిడికి లోనుచేసిన ఫలితం నొప్పుల ద్వారా బయల్పడుతూ ఉంటుంది. అయితే వ్యాయామం చేసే వారిలో ఈ సమస్యలు తక్కువ. కండరాలను బలపరిచే వ్యాయామాలతో తప్పుడు భంగిమలతో అలసిపోకుండా ఉండేలా కండరాలను బలోపేతం చేసుకోవచ్చు. వ్యాయామం లోపిస్తే, కండరాలు, ఎముకలు బలహీనపడిపోతాయి. అలాంటప్పుడు వాటి సామర్థ్యం లోపించి, చిన్నపాటి పనులకే డస్సిపోయి, అసౌకర్యాన్ని కలిగించడం మొదలుపెడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయాలి. బరువులెత్తే వ్యాయామాలతో ఎముకలు బలపడతాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి.


ఏది ఒప్పు - ఏది తప్పు?

  • శరీర భంగిమల్లో ఏది ఒప్పో, ఏది తప్పో తెలుసుకోవడం అవసరం. అవేంటంటే...

  • కంప్యూటర్‌ పని: వీపు కుర్చీకి పూర్తిగా ఆనించి, నిటారుగా కూర్చోవాలి. తుంటి ఎముక, మోకీలు సమాంతరంగా ఉండాలి. కంటి చూపు, మానిటర్‌కు సమాంతరంగా ఉండాలి. అలాగే మోచేయి, ముంజేయి డెస్క్‌కు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.

  • నిలబడడం: కొందరు నడుము పైభాగాన్ని ముందుకు వంచి నిలబడతారు. ఇంకొందరు వెనక్కి వంచి నిలబడతారు. కొందరు భుజాలను ముందుకు వంచేస్తారు. నిజానికి ఇవేవీ సరైన శారీర భంగిమలు కావు. నిలబడేటప్పుడు శరీర బరువు రెండు కాళ్ల మీద సమంగా పడేలా చూసుకోవాలి. వెన్ను, మెడ నిటారుగా ఉండాలి. ఎక్కువ సమయం నిలబడవలసి వచ్చినప్పుడు, శరీర బరువును ఒక కాలి పైనుంచి మరో కాలి పైకి తరచూ మారుస్తూ ఉండాలి.

  • బరువులు ఎత్తడం: బరువు ఎత్తగానే నడుము పట్టేస్తుందంటే, బరువును లేపే పద్ధతిలో తప్పు ఉందని అర్థం చేసుకోవాలి. నడుము పైభాగాన్ని వంచి, బరువును చేతులతో పైకి లేపే ప్రయత్నం చేస్తే, వెన్ను మీద ఒత్తిడి పడుతుంది. అలాకాకుండా మోకాళ్లను వంచి, కిందకు కుంగి బరువును లేపాలి. ఇలా చేస్తే తేలికగా బరువును లేపగలగడంతో పాటు వెన్ను సురక్షితంగా ఉంటుంది.

  • కీబోర్డ్‌: కంప్యూటర్‌ కీబోర్డు మీద టైప్‌ చేసేటప్పుడు, అరచేతులు బోర్డుకు అనించకూడదు. అలాగే రెండు చేతులు సమాంతరంగా ఉండాలి. వేర్వేరు దిశల్లో ఉండకూదదు. మణికట్టును మరీ కిందకు, లేదా మరీ పైకి లేపి ఉంచి, వేళ్లతో టైప్‌ చేయకూడదు.

  • మొబైల్‌ ఫోన్‌: రోజులో ఎక్కువ సమయం మొబైల్‌ ఫోన్‌ వాడే వాళ్లు, వీలైనంత వరకూ ఫోన్‌ను ముఖానికి ఎదురుగా చేత్తో పట్టుకుని వాడుకోవాలి. టెక్స్ట్‌ చేసేటప్పుడు, తలను మరీ కిందకు దించడం, మెడ వంపులో ఫోన్‌ ఇరికించుకుని మాట్లాడడం చేయకూడదు. సాధ్యమైనంతవరకూ ఇయర్‌ పాడ్స్‌ లేదా ఇయర్‌ ఫోన్స్‌ ఉపయోగించాలి.

-డాక్టర్‌ వంశీకృష్ణ వర్మ పెన్మెత్స

సీనియర్‌ స్పైన్‌ సర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.

Updated Date - May 13 , 2025 | 06:37 AM